Idream media
Idream media
ఇప్పటికే సగం కాలం పూర్తయిపోయింది. అధికారం కోసం కష్టపడడానికి ఇంకో సగం సమయం మాత్రమే మిగిలి ఉంది. కానీ.. రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాలో చూసినా అనుకూల వాతావరణం కనిపించడం లేదు కదా..
ప్రజల్లో ప్రతిపక్ష పార్టీ టీడీపీకి స్థానం లేదని స్థానిక ఎన్నికలతో పాటు, తిరుపతి ఉప ఎన్నికల ఫలితాలు స్పష్టం చేశాయి. అధినేత చంద్రబాబునాయుడుకు కూడా ఆ విషయం అర్థమైంది. పరిస్థితి ఇలానే ఉంటే చాలా కష్టమేనని గుర్తించారు. దానిలో భాగంగానే కొంత కాలంగా టీడీపీలో మార్పు తెచ్చే ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
చంద్రబాబు ఇప్పటికీ జూమ్ మీటింగ్ లకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నా, తనయుడు లోకేశ్ ను ప్రజల్లోకి పంపుతున్నారు. అలాగే, పలు ఆందోళన కార్యక్రమాలకు పిలుపు ఇస్తున్నారు. పార్టీ నేతలు అరెస్టయిన సందర్భాల్లో గట్టిగానే స్పందిస్తూ, తమ వారికి తాము అండగా ఉంటామనే సంకేతాలు ఇస్తున్నారు.
అయినప్పటికీ పార్టీలో అసంతృప్తి పెరుగుతూనే ఉంది కానీ, జోష్ కనిపించడం లేదు. పైగా.. బుచ్చయ్య చౌదరి వంటి సీనియర్ నేతలు కూడా కొరకిరాని కొయ్యగా మారారు. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న కొద్ది సమయంలోనే అధికారంలోకి వచ్చేందుకు శతావిధ వ్యూహాలు పన్నుతున్నారు చంద్రబాబు.
వాస్తవానికి 2019 ఎన్నికల్లో ఓటమి తో టీడీపీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఏడాదిన్నర తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలతో నిరాశలోకి కూరుకు పోయింది. నాయకులు ఎక్కడికక్కడ స్తబ్ధుగా మారిపోయారు. అయినప్పటికీ.. పార్టీ అధినేత చంద్రబాబు ఓటమిని జీర్ణించుకుని ముందుకు వచ్చినా.. నాయకులు పెద్దగా కలివిడి ప్రదర్శించలేదు. ఏదో అంటీ ముట్టనట్టుగా వ్యవహరించారు. దీనికి తోడు కరోనా పేరు చెప్పి.. ఎవరికి వారు ఇంటికే పరిమితమయ్యారు. స్వయంగా చంద్రబాబు రంగంలోకి దిగి, తిరుపతి ఉప ఎన్నిక లో ప్రచారం చేసినా కనీస ప్రభావం చూపలేకపోయింది. అయినప్పటికీ.. అప్పటి నుంచీ పార్టీలో జోష్ పెంచేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తూ పలు కార్యక్రమాలకు పిలుపు ఇస్తున్నా అంతగా స్పందన రావడం లేదు.
ఒకవైపు ఉత్తరాంధ్రలో టీడీపీ ఉనికి కోల్పోయింది. కాస్తో కూస్తో పట్టున్న విశాఖలో కూడా పట్టు కోల్పోతోంది. విశాఖను రాజధానిగా జగన్ ప్రకటించినప్పటి నుంచీ అందరి చూపూ వైసీపీపైనే ఉంటోంది. ఈ క్ర మంలోనే ఉత్తరాంధ్ర హక్కుల విషయంలో చర్చా వేదిక పేరుతో టీడీపీ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అక్కడ కూడా అచ్చెన్నాయుడి వాయిస్ మినహా మరో నాయకుడు కనిపించడం లేదు. దీంతో వచ్చే రెండున్నరేళ్లలో ఉత్త రాంధ్ర విషయంలో ఎలా వ్యవహరించాలి అనే దానిపై టీడీపీ ఓ నిర్ణయానికి రాలేకపోతోంది. తమ హయాంలో ఆగిపోయిన ప్రాజెక్టులను కూడా ప్రభు త్వం పరుగులు పెట్టిస్తుండడంతో ఆందోళనలు చేపట్టే అవకాశం కూడా ఉండడం లేదు. ఈ క్రమంలో బస్సు యాత్ర నిర్వహించాలనే ఆలోచనలో టీడీపీ ఉన్నట్లు తెలుస్తోంది.
కోస్తాంధ్ర లో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటిస్తున్నారు. పోలవరంలో రెండు రోజుల పాటు పర్యటించారు. ఇక్కడి ప్రాజెక్టు నిర్వాసితులను ఆయన పరామర్శించారు. అప్పటికే పోలవరం విషయంలో జగన్ దూకుడుగా వ్యవహరిస్తుండడం, పరిహారం కూడా పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయడంతో లోకేశ్ పర్యటనకు అంతగా స్పందన రాలేదు. పోలవరాన్ని ఓ ఇష్యూ చేయడం ద్వారా ప్రాచుర్యం పొందుదామన్న లోకేశ్ ఆశ నెరవేరలేదు. దీనికి తోడు పలు చోట్ల నియోజకవర్గ ఇన్ చార్జిలపై నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఆ నాయకుడు మాకొద్దంటూ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు కొనసాగుతున్నాయి. ఓ జిల్లాలో సర్దిచెప్పేలోపు, మరో చోట కుంపటి రాజుకుంటోంది. ఇవన్నీ చంద్రబాబు లక్ష్యాలకు అడ్డంకిగా మారుతున్నాయి.
తన అనుభవంతో పార్టీలో దూకుడు పెంచేందుకు బాబు ఎంతలా ప్రయత్నిస్తున్నప్పటికీ ఆశించిన ప్రయోజనం కనిపించడం లేదు. ఈ క్రమంలో ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ రాబోయే కాలంలో అధికారంలోకి రావడానికి ఏం చేస్తే బాగుంటుందో తెలుసుకోవడానికి వ్యూహకర్తలను సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది.