iDreamPost
android-app
ios-app

Chandrababu- జగన్ ని దెబ్బ కొట్టడానికి చంద్రబాబుకు మంచి అవకాశం

Chandrababu- జగన్ ని దెబ్బ కొట్టడానికి చంద్రబాబుకు మంచి అవకాశం

క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి ఎంత అధ్వానంగా ఉన్నా కార్యకర్తల ధైర్యం సడలిపోకుండా ఉండాలని బాగా తెలిసిన నాయకుడు చంద్రబాబు. ఆ దిశగా ఆయన ఎలాంటి ప్రయత్నాలు అయినా చేస్తాడు. 2019 అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయినప్పుడు కూడా ఆయన బింకం నటిస్తూ, “ప్రజలందరూ మనవైపే ఉన్నారు. మనకే ఓట్లేశారు. వోటింగ్ మిషన్లు ట్యాంపరింగ్ చేసి, వైసీపీ గెలిచింది” అని కొన్ని రోజులు, ప్రజల కోసం అన్ని మంచి పనులు చేసినా ఎందుకు ఓడిపోయామో అర్థం కావడం లేదని కొన్ని రోజులు, పెయిడ్ ఆర్టిస్టులతో నువ్వెలా ఓడావయ్యా అని డ్రామాలతో కొన్ని రోజులు
లాక్కొచ్చారు.

ఆ తరువాత పదేపదే అధికార పార్టీ మీద ప్రజల్లో అసంతృప్తి జ్వాలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే విజయం మాదే అని చెప్తూ వచ్చారు. అయినా మధ్యలో వచ్చిన వివిధ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయినా ఆయన తమ పార్టీ మీద ప్రజల్లో వ్యతిరేకత తగ్గలేదని ఒప్పుకోలేదు. పోయిన సంవత్సరం మూడు రాజధానుల విషయంలో “మీరందరూ రాజీనామాలు చేయండి. మేమూ చేస్తాం. మళ్ళీ ఎన్నికలకు వెళ్దాం” అని అధికార పక్షాన్ని ఛాలెంజ్ చేసి, నలభై ఎనిమిది గంటల డెడ్ లైన్ కూడా విధించారు. ఇది చాలా హాస్యాస్పదమైన ప్రతిపాదన అని ఎవరికయినా అర్థమవుతుంది, ఇది వైసీపీ అధికారాన్ని అంతం చేసే తిరుగులేని అస్త్రం అన్న స్థాయిలో, తెలుగుదేశం పార్టీకి సయామీస్ కవల లాంటి ఏబీఎన్ ఛానల్ తన స్క్రీన్ మీద కౌంట్ డౌన్ టైమర్ కూడా వేసింది. సహజంగానే దీన్ని అధికారపార్టీ ఏమాత్రం పట్టించుకోలేదు.

ఆ తర్వాత కూడా ప్రతిసారీ అధికార పక్షం మీద ప్రజల్లో వ్యతిరేకత ఉప్పొంగుతోంది అని చంద్రబాబు అనడం, ఆ వెంటనే వచ్చిన వివిధ ఎన్నికల్లో అధికార పార్టీ తన హవా చాటడం రివాజుగా మారింది. పార్టీ ప్రాతిపదిక లేని ఎన్నికల్లో మేము కూడా గణనీయంగా విజయాలు సాధించాం అని చెప్పుకుని, ఆ తర్వాత పార్టీ ప్రాతిపదికన జరిగిన ఎన్నికలు బహిష్కరించినా ప్రజల్లో వైసీపీ పట్ల ఆదరణ ఏమాత్రం తగ్గలేదని తెలిసిపోయింది. తిరుపతి పార్లమెంటు స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో కూడా వైసీపీ హవా కొనసాగడంతో, బద్వేలు అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో అందరి కన్నా ముందు తమ అభ్యర్దిని ప్రకటించి, ఆ తర్వాత సాంప్రదాయం పేరుతో ఉపసంహరించాడు చంద్రబాబు.

Also Read : Jr Ntr – మాట్లాడినా తప్పే, మాట్లాడకున్నా తప్పే.. జూనియర్ ని కావాలనే టార్గెట్ చేస్తున్నారా?

మొన్న నెల్లూరు కార్పొరేషన్, కుప్పం సహా కొన్ని మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల్లో దర్శి, కొండపల్లి మినహా, కుప్పంతో సహా అన్ని చోట్లా ఓడిపోయినా, మాకు ఓటు షేర్ పెరిగింది కాబట్టి ఇది మాకు సానుకూల ఫలితమే అని కొందరు తెలుగుదేశం నాయకులు కవర్ చేసే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత అసెంబ్లీలో తన సతీమణికి అవమానం జరిగిందని మీడియా ముందు రోదించి, ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో మళ్ళీ కాలుమోపుతానని శపథం చేసిన చంద్రబాబు ఈ ఎపిసోడ్ ప్రజల్లో తనపట్ల సానుభూతిని, అధికార పక్షం పట్ల వ్యతిరేకతనూ పెంచుతుందని ఈసారి గట్టిగా నమ్మాడు. దానికి అనుగుణంగానే రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో తుఫాను కలిగించిన నష్టాన్ని అంచనా వేయడానికి జరిపిన పర్యటనలో కూడా అన్ని చోట్లా ఆ అంశాన్ని ప్రస్తావించారు.

ఒక్క దెబ్బతో అనేక పిట్టలు

అసెంబ్లీలో తనకు, తన శ్రీమతికీ అవమానం జరిగిందని అంటున్న చంద్రబాబు ఆ ఎపిసోడ్ నిజంగా అధికార పార్టీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెంచిందని నిరూపించడానికి తిరుగులేని అస్త్రం రాజీనామా. తెలంగాణ సెంటిమెంట్ క్షేత్ర స్థాయిలో లేదని అన్న నాయకుల మాటలు తప్పు అని నిరూపించడానికి రాజీనామా చేసి, తిరుగులేని విజయం సాధించిన కేసీఆర్ అడుగుజాడల్లో ఇక్కడ చంద్రబాబు కూడా తన కుప్పం స్థానానికి రాజీనామా చేసి, మళ్ళీ పోటీచేసి ఇదివరకటి కన్నా ఎక్కువ మెజారిటీతో విజయం సాధిస్తే అది చంద్రబాబుకి ఎన్నో విజయాలు సాధించినట్లు అవుతుంది.

కుప్పం మునిసిపల్ ఎన్నికల్లో ఓడిపోగానే కుప్పంలో చంద్రబాబు పని అయిపోయింది, 2024 అసెంబ్లీ ఎన్నికల్లో మరో నియోజకవర్గం చూసుకోవాలి అనేవారి నోళ్ళు మూడపడుతాయి. చంద్రబాబు ఛరిష్మా వచ్చే ఎన్నికల్లో పనిచేయదు, జూనియర్ ఎన్టీఆర్ రావలసిందే అనే వారు కూడా సైలెంట్ అవుతారు. అన్నింటికన్నా ముఖ్యంగా వరుస పరాజయాలతో డీలా పడివున్న పార్టీ కేడర్లో జవసత్వాలు, ఉత్సాహం నింపడానికి ఆ విజయం బాగా ఉపయోగపడుతుంది. చంద్రబాబు మీద వ్యక్తిగత విమర్శలు చేస్తే ప్రజలు తిప్పికొడతారు అన్న భయం అయినా ప్రత్యర్ధుల్లో ఏర్పడి, మరోసారి ఏదైనా విమర్శ చేయాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి కల్పిస్తుంది. వయసు పెరిగినా చంద్రబాబులో ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు అన్న మెసేజ్ కేడర్ మరింత ఉధృతంగా పనిచేసే అవకాశం కలిగిస్తుంది.

కాబట్టి వృథా విమర్శలు, కంఠశోష మాని రాజీనామా అస్త్రం సంధించి, అధికార పక్షంతో నేరుగా తలపడితే మంచిది. ఈ విషయం ఆయనతో ఎవరైనా చెప్తారేమో చూడాలి.

Also Read : Chandrababu, AP Assembly – అసెంబ్లీకి రానప్పుడు రాజీనామా చేయొచ్చు కదా..? చంద్రబాబు ప్రశ్న ..