iDreamPost
android-app
ios-app

స్టీల్‌ ప్లాంట్‌కు మద్ధతుగా గంటా రాజీనామా.. అమరావతి కోసం బాబు ఎందుకు చేయరు..?

స్టీల్‌ ప్లాంట్‌కు మద్ధతుగా గంటా రాజీనామా.. అమరావతి కోసం బాబు ఎందుకు చేయరు..?

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ మాజీ మంత్రి, టీడీపీ విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రం స్పీకర్‌ స్పీకర్‌ ఫార్మేట్‌లో ఉందా..? లేదా..? గంటా రాజీనామా సీరియస్‌గానే చేశారా..? లేదా..? అనే విషయాలు పక్కనపెడితే.. ఒక విషయం మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. గంటా శ్రీనివాసరావు రాజీనామా అస్త్రం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, గుంటూరు, కృష్ణా జిల్లాలోని టీడీపీ ప్రజా ప్రతినిధులపై ఒత్తిడి పెంచిందనేది వాస్తవం. కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరించబోతోందన్న మరు క్షణమే.. గంటా రాజీనామా అస్త్రం సంధించారు. ప్రజల ఆకాంక్షను తన రాజీనామా ద్వారా తెలిపారు.

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ వ్యవహారంలో గంటా వ్యవహరించిన మాదిరిగా.. చంద్రబాబు, ఆ పార్టీ గుంటూరు, కృష్ణా జిల్లాల ప్రజా ప్రతినిధులు అమరావతి విషయంలో ఎందుకు వ్యవహరిచడంలేదనే ఆలోచన ఈ పాటికే అమరావతి ఉద్యమకారుల్లో నెలకొని ఉంటుంది. గత 418 రోజులుగా అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ, మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతి కోసం భూములు ఇచ్చిన వారిలో కొంత మంది ఉద్యమం చేస్తున్నారు. ఇందుకు జేఏసీని కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఉద్యమం చేస్తున్నది రైతులే అయినా, చేయిస్తున్నది, ఉద్యమానికి స్ఫూర్తి నారా చంద్రబాబు నాయుడే. తన భార్య చేత ఉద్యమానికి గాజులు విరాళంగా ఇప్పించారు. జోలె పట్టి విరాళాలు సేకరించారు. నిత్యం అమరావతికి మద్ధతుగా మాట్లాడుతున్నారు. ఇది తప్పా.. ఉద్యమానికి మద్ధతుగా, అమరావతే రాజధానిగా కొనసాగాలనే డిమాండ్‌కు అనుగుణంగా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా చంద్రబాబు వ్యవహరిచడం లేదనేది అమరావతి రైతుల్లో ప్రస్తుతం నెలకొని ఉన్న భావన.

ఎన్నికలకు వెళదాం, వైసీపీ గెలిస్తే అమరావతి గురించి మాట్లాడను, అమరావతి అంశంపై రెఫరెండం పెట్టండి.. కృష్ణా, గుంటూరు జిల్లాల వైసీపీ ప్రజా ప్రతినిధులు రాజీనామా చేయండి.. అంటూ చంద్రబాబు మాట్లాడారే గానీ.. తాను రాజీనామా చేస్తానని, తన కుమారుడు నారా లోకేష్‌ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తామనే హెచ్చరిక చంద్రబాబు నాయుడు నోటి నుంచి ఇప్పటి వరకూ రాలేదు. డిమాండ్‌ చేసిన వారే రాజీనామా చేయడం పరిపాటి. తద్వారా ప్రజల ఆకాంక్షను ప్రతిభింబించినవారవుతారు. తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌.. తాను, తన పార్టీ ఎమ్మెల్యేలు పలుమార్లు రాజీనామా చేసి మళ్లీ పోటీ చేసిన గెలిచిన విషయం అందరికీ తెలిసిందే. ప్రజల ఆకాంక్షను కేసీఆర్‌ తన పదవులకు రాజీనామాలు చేసి, మళ్లీ గెలిచి నిరూపించారు. అందుకే తెలంగాణ ఉద్యమం నిలిచింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాకారమైంది.

ఇప్పుడు గంటా శ్రీనివాసరావు కూడా స్థానిక ప్రజల ఆకాంక్షను తన రాజీనామా ద్వారా కేంద్రానికి తెలియజేశారు. ఇలాంటి నిర్ణయాలు చంద్రబాబు ఎందుకు తీసుకోలేకపోతున్నారు..? మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి.. ఎమ్మెల్యే పదవి కోసం పాకులాడుతున్నారా..? రాజీనామా చేస్తే.. మళ్లీ గెలవలేమనే భయంతో ఉన్నారా..? తమను ఉద్యమం చేయాలంటూ చెబుతూ.. చంద్రబాబు మాత్రం ఎంచెక్కా రాజకీయం చేసుకుంటున్నారు.. ఇలాంటి ప్రశ్నలు, సందేహాలు, ఆలోచనలు అమరావతి ఉద్యమకారుల్లో ప్రారంభమయ్యాయి. వీటి ప్రభావం రానున్న రోజుల్లో ఎలా ఉంటుందో వేచి చూడాలి.