iDreamPost
iDreamPost
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా? అని అడుగుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు, తమ పార్టీ నేతల అరెస్టుల నుంచి ప్రజలను తప్పుదోవ పట్టించడానికి నానా పాట్లు పడుతున్నారు. అయితే ఆయన చెబుతున్నట్టు కేవలం ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే అరెస్టు చేసేస్తుంటే నిరాధార ఆరోపణలతో ప్రభుత్వంపై విరుచుకు పడుతూ, అడ్డగోలు ప్రశ్నలు సంధించే చంద్రబాబును ప్రభుత్వం ఇప్పటికి చాలాసార్లు అరెస్ట్ చేసి ఉండేది. ప్రమోషన్ కోసం ఫోర్జరీ సర్టిఫికెట్ సమర్పించారన్న అభియోగంపై అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ అశోక్‌బాబు నివాసానికి శనివారం చంద్రబాబు వెళ్లి పరామర్శించారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ ఎప్పటిలా ప్రభుత్వంపై, పోలీసులపై ఇష్టానుసారం ఆరోపణలు గుప్పించారు.
అశోక్‌బాబు తప్పు చేస్తే ధైర్యంగా ఆఫీస్‌కు వచ్చి అరెస్ట్ చేయవచ్చు. పోలీసులు అర్ధరాత్రి కిడ్నాప్ చేసి ఎక్కడెక్కడో తిప్పారు. ఉన్మాది సీఎం చెప్తే.. పోలీసుల విచక్షణ ఏమైంది? అంటూ ఆవేశం తెచ్చుకొని ఊగిపోయారు. ముఖ్యమంత్రిని అనాగరికమైన భాషతో సంబోధించడమే కాక అరెస్టును కిడ్నాప్ గా అభివర్ణించడం చంద్రబాబు అహంకారాన్ని, సమస్యలను పక్కదారి పట్టించే కుట్ర మనస్తత్వాన్ని బయట పెట్టిందని అధికార పార్టీ నాయకులు అంటున్నారు.
నేరాలు, ఘోరాలు చేసినా అరెస్ట్ చేయకూడదా?
ముగ్గురు మాజీ మంత్రులను అరెస్ట్ చేశారు. ఇప్పటివరకూ 40 మంది టీడీపీ నేతలపై కేసులు పెట్టారు అని ప్రభుత్వాన్ని తప్పు పడుతున్న చంద్రబాబు.. నేరాలు చేసినా టీడీపీ నేతలను అరెస్ట్ చేయకూడదని చెప్పదలచుకున్నారా? హత్యకేసు, కుంభకోణాల్లో ముగ్గురు మాజీ మంత్రులు అరెస్ట్ కాగా వారిని ఉత్తి పుణ్యాన అరెస్ట్ చేసినట్టు చంద్రబాబు కలర్ ఇవ్వడం దుర్మార్గమని వైఎస్సార్ సీపీ నేతలు అంటున్నారు. వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి అరెస్టు చేయడం, వారు బెయిల్ తెచ్చుకోవడం, కేసుల విచారణ కొనసాగుతుండడం రాష్ట్రంలో అందరికీ తెలిసిందే.
అయినా సీఎం జగన్ కావాలనే టీడీపీ నేతలను వేధించడానికి అరెస్టులు చేయించారని నోరు పారేసుకోవటం ఏమిటి? ఆ ముగ్గురు మాజీ మంత్రులు కాని, ఇప్పుడు ఎమ్మెల్సీ అశోక్ బాబు కాని తమను ప్రభుత్వం వేధిస్తోందని రాజకీయ విమర్శలు చేస్తున్నారు తప్పితే తమపై ఉన్న అభియోగాలను ఖండించడం లేదు. కోర్టు పరిధిలోకి వెళ్ళిన ఈ అంశాలపై న్యాయ పోరాటం చేయాలి. అంతేకాని వీధి పో రాటాలు చేస్తాము, బజారు భాష మాట్లాడతాము అంటే ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబుకు చెప్పేదేముంది? ఆయన విచక్షణకు వదిలేయడం తప్ప.!
Also Read : ప్రభుత్వాన్ని మోసం చేయడం చిన్న పొరపాటా? ఇదెక్కడి లాజిక్ అశోక్ బాబూ?