Idream media
Idream media
రాష్ట్రంలో జరిగే ఘటనల్లో తన రాజకీయ అవసరాలకు ఉపయోగపడే ఏ ఒక్క అంశాన్ని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ వదిలిపెట్టడం లేదు. గత ఏడాది మత్తు డాక్టర్ సుధాకర్ వ్యవహారం, ఇటీవల ఎంపీ రఘురామకృష్ణం రాజు హంగామా, తాజాగా జడ్జి రామకృష్ణ అరెస్ట్.. ఇలా ప్రతి ఘటనను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు అనుకూల మీడియాలో ప్రసారం చేయించి.. ఆ తర్వాత ఆయా అంశాలపై మాట్లాడుతూ వైఎస్ జగన్ సర్కార్‌ను ఇరుకునపెట్టేందుకు ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు తంటాలు పడుతున్నారు.
మత్తు డాక్టర్ సుధాకర్‌ఇటీవల గుండెపోటుతో చనిపోయారు. దాన్ని కూడా రాజకీయం చేయాలని చూసిన టీడీపీ నేతలకు.. సుధాకర్ తల్లి ఝులక్ ఇచ్చింది. తన కుమారుడును కొంత మంది తమ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకున్నారని మండిపడ్డారు. ఇక ఎంపీ రఘురామ రాజు విమర్శలకు, వ్యంగ్య వ్యాఖ్యలకు అనుకూల మీడియాలో విస్తృత ప్రచారం కల్పిస్తూ.. ఆయనతో డిబేట్లు నిర్వహిస్తూ రెచ్చగొట్టారు. ఇది చినికి చినికి గాలివానలా మారి రఘురామ చేసిన వ్యాఖ్యలు ఆయన మెడకే చుట్టుకున్నాయి. కేసులు, అరెస్ట్‌ల నుంచి తనను సీఐడీ అధికారులు కొట్టారంటూ సాగిన రఘురామ రాజు కథ సుప్రిం కోర్టు వరకూ వెళ్లింది. చివరకు మీడియాతోనూ, సోషల్ మీడియాలోనూ మాట్లాడకుండా రఘురామ నోటికి సుప్రిం తాళం వేసింది. మరో వైపు తన కేసుల నుంచి తప్పించుకునేందుకే రఘురామ రాజు తనకు సంబధంలేని అంశాలతో తలదూర్చుతూ హడావుడి చేస్తున్నారనే చర్చ ప్రజల్లో సాగింది.
ఇప్పుడు టీడీపీకి జడ్జి రామ కృష్ణ అరెస్ట్ అంశం చిక్కింది. జైలులో ఉన్న జడ్జి రామకృష్ణకు ప్రాణహాని ఉందని, అయన్ను చంపేందుకు కుట్ర చేస్తున్నారంటూ.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారు. రామకృష్ణ ఉన్న బ్యారక్‌లోకి మరో ఖైదీని పంపారని, ఆ ఖైది వద్ద కత్తి దొరికిందంటూ హాస్యాస్పదమైన ఆరోపణలు చంద్రబాబు చేశారు. ఆ విషయం జడ్జి రామకృష్ణ తన కుమారుడుతో చెప్పడం వల్ల ఈ విషయం వెలుగులోకి వచ్చిందని బాబు చెప్పుకొస్తున్నారు. ప్రాణహాని ఉందనే విషయం జడ్జి రామకృష్ణ తన కుమారుడుకు చెప్పడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. ఈ విషయం జైలర్ దృష్టికి తీసుకెళ్లాలి. అతనిపై నమ్మకం లేకపోతే కోర్టు దృష్టికి తీసుకెళ్లాలి. అంతేగానీ బయటవారికి చెప్పు అంటూ తన కుమారుడుకు రామకృష్ణ ఈ విషయాలు చెప్పారంటూ చంద్రబాబు పేర్కొనడంలో వాస్తవం ఎంత అనేది ఇట్టే అర్థమవుతోంది. చంద్రబాబు రాజకీయం చేస్తున్న జడ్జి రామకృష్ణ కథ ఎక్కడ ముగుస్తుందో వేచి చూడాలి.
Also Read : చంద్రబాబు గతం మరచిపోయారా..? ప్రజాధనం దుబారా గురించి మాట్లాడుతున్న మాజీ సీఎం