iDreamPost
iDreamPost
అసలు గడ్డుకాలం. అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన సమయం. అయినా చంద్రబాబు తప్పటడుగులు మానడం లేదు. పదే పదే వ్యూహాత్మకంగా విఫలమవుతున్నారు. అతి విశ్వాసంతో వ్యవహరించి కష్టాలు రెట్టింపు చేసుకుంటున్నారు. అందుకు తాజా హస్తిన పర్యటన మరో ఉదాహరణ. ఇటీవల ప్రభుత్వం మీద దూకుడుగా వ్యవహరించాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. కానీ పరిస్థితులు అనుకూలంగా లేవన్నది ఆయన గ్రహించడం లేదు. అందుకే భంగపడాల్సి వస్తోంది.
చంద్రబాబు 2018 నుంచే జగన్ ఉచ్చులో పడ్డారన్నది పలువురు పరిశీలకుల అభిప్రాయం. నేటికీ అదే కొనసాగుతుండడమే విస్మయకరం. పార్లమెంట్ సాక్షిగా ప్రధాని మోడీ కూడా ఈ విషయాన్ని ప్రస్తావించడం విశేషం. ఏపీలో పొలిటికల్ ఎజెండా జగన్ ఫిక్స్ చేస్తే దానిని చంద్రబాబు ఆచరించడమే ఆసక్తికరం. అంత అనుభవం ఉందని చెప్పుకునే నాయకుడు కూడా ఇలా బుట్టలో పడడం ఏమిటన్నది అంతుబట్టని విషయంగా మారుతోంది. కేంద్ర ప్రభుత్వం మీద పోరాడాల్సిందేననే ఎజెండా జగన్ తీసుకొస్తే దానికి అనుగుణంగా చంద్రబాబు ఎన్డీయే నుంచి బయటకు వచ్చారు. అంతటితో సరిపెట్టకుండా అవిశ్వాస తీర్మానం పెట్టారు. మరో అడుగు ముందుకేసి మోడీ, అమిత్ షాల పై ఏపీలో పెద్ద గలాటానే సాగించాలని చూశారు.వాటన్నింటికీ ఫలితం ప్రస్తుతం అనుభవిస్తున్నారు. జగన్ ఎజెండాతో బరిలోదిగి సాధారణ ఎన్నికల్లో భంగపడిన చంద్రబాబు ఇప్పటికీ దానిని కొనసాగిస్తుండడం గమనించవచ్చు.
తాజాగా టీడీపీ అధికార ప్రతినిధి హోదాలో కొమ్మారెడ్డి పట్టాభి నోటికి పనిచెప్పారు. వాస్తవానికి వైఎస్సార్సీపీ నేతలు అంత సీరియస్ గా తీసుకుంటారని టీడీపీ ఊహించలేదు. దాంతో హఠాత్తుగా ఖంగుతిని ఆఘమేఘాల మీద హడావిడి చేశారు. ఏపీ బంద్ కి పిలుపునిచ్చారు. కానీ ఎజెండా ఫిక్స్ చేసిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా బంద్ పేలవమైన రీతిలో ముగించడానికి కారణమయ్యింది. దాంతో ఏం చేయాలో పాలుపోని చంద్రబాబు 36గంటల దీక్షకు దిగాల్సి వచ్చింది. అంతటితో సరిపెడితే బాగుండేది కానీ బాబు దీక్షలకు పోటీగా జనాగ్రహ దీక్షలకు వైఎస్సార్సీపీ పిలుపునివ్వడం బాబుని అసహనానికి గురిచేసి మరో అడుగుముందుకేశారు.
Also Read : Chandrababu May Lost Pattabhiram – బాబు ఇంకొకరిని వెతుక్కోవాల్సిందేనా..?
ఢిల్లీలో రాష్ట్రపతి, ప్రధానమంత్రులను ఎన్నుకోవడంలో కీలకమని చంద్రబాబు భావిస్తుంటారు. గతంలో అనేక మందిని తానే నియమించానని కూడా చెప్పుకున్న చరిత్ర ఆయనది. అలాంటిది హోం మంత్రి అపాయింట్ మెంట్ కోసం రోజంతా ఎదురుచూడాల్సి రావడం అనూహ్యమే కాకుండా బాబుకి పెద్ద అవమానం కూడా. ఇది టీడీపీ శ్రేణులకు మింగుడుపడే అవకాశం లేదు. ఏపీలో జగన్ నుంచి ఎంత ఎదురుదాడి జరిగినా ఢిల్లీలో చంద్రబాబు చక్రం తిప్పేస్తారని చాలామంది ఆశ. కానీ చక్రం తిప్పడం కాదు కదా ఆయనకు కాళ్లకు చక్రాలు కట్టుకుని తిరుగుదామన్నా అక్కడ తిరగనిచ్చే సీన్ లేదని తాజాగా వెల్లడయిపోయింది. రాష్ట్రపతి పాలన, డీజీపీ రీకాల్ అంటూ పెద్ద పెద్ద డిమాండ్లతో ఢిల్లీలో అడుగుపెట్టిన బాబుకి ఇలాంటి పరిస్థితి చరిత్రలోనే తొలిసారి.
వాస్తవంగా సీఎంగా ఉన్నప్పుడే మోడీ ఆయనకు మొఖం చూపించలేదు. అలాంటిది ఇప్పుడు స్వాగతం పలుకుతారని ఆశించడమే చంద్రబాబు పెద్ద తప్పిదం.
ఫలితంగా టీడీపీ అధినేతకు ఢిల్లీలో ఇక మొఖం చెల్లుబాటయ్యే అవకాశం లేదని ఆయనే చాటుకున్నారు. రెండున్నరేళ్ల తర్వాత ఢిల్లీ వెళుతున్న తరుణంలో వ్యూహాత్మకంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉన్నప్పటికీ హడావిడిగా వెళ్లి చేతులు కాల్చుకున్నారు. ఇది టీడీపీని తీవ్రంగా ఇరకాటంలో నెట్టేసే యత్నం. అమరావతి, హైదరాబాద్ మాత్రమే కాకుండా హస్తినలో కూడా బాబు సీటు చిరిగిపోయిందనే వాదనకు ఇది బలం చేకూరుస్తోంది. ఇక టీడీపీ అధినేత ఇక్కడ కాకపోతే అక్కడ అనుకునే పరిస్థితి లేదని తేటతెల్లమయ్యింది. ప్రజల్లో కూడా టీడీపీ పలుచన అయిపోయింది. రోజంతా ఎదురుచూసినా బాబుకి మొఖం చాటేసిన నేతల తీరుతో బీజేపీ అధిష్టానం బాబు ని చాలా లైట్ తీసుకున్నట్టు తేలిపోవడంతో టీడీపీ నేతలకు మరింత కష్టకాలం దాపురించిందనే చెప్పవచ్చు.
Also Read : Chandrababu Mud Slashing- మీ రాజకీయాలకోసం రాష్ట్ర ఇమేజ్ ను దెబ్బతీస్తారా బాబూ?