iDreamPost
android-app
ios-app

గిరిజన హక్కులను జగన్‌ కాలరాస్తున్నారట..!

గిరిజన హక్కులను జగన్‌ కాలరాస్తున్నారట..!

సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి గిరిజన హక్కులను కాలరాస్తున్నారట. చట్టప్రకారం గిరిజనులకు రావాల్సిన హక్కులను జగన్‌ ప్రభుత్వం ఇవ్వడంలేదంట. కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం వైసీపీదట. గిరిజన సంక్షేమాన్ని వైసీపీ ప్రభుత్వం విస్మరిస్తోందట. మాయమాటలతో సీఎం జగన్‌ ప్రజలను మోసం చేశారట… ఇవన్నీ అన్నది ఎవరో కాదు ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు. అరకు పార్లమెంట్‌ నియోజకవర్గ నేతలో ఈ రోజు జూమ్‌లో మాట్లాడిన చంద్రబాబు.. పై విధంగా విమర్శలు గుప్పించారు.

చంద్రబాబు విమర్శలకు కౌంటర్‌ ఇచ్చేందుకు వైసీపీ శ్రేణులు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటున్నాయి. చంద్రబాబు అలా విమర్శలు చేశారో తేదో.. ఇలా సోషల్‌ మీడియాలో చంద్రబాబు తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చేసిన పనులను గుర్తుచేస్తూ వైసీపీ కౌంటర్‌ ఇస్తోంది. 2017లో తూర్పు గోదావరి జిల్లా పోలవరం విలీన మండలాల్లో అంతుచిక్కని కాళ్లవాపు వ్యాధితో పదుల సంఖ్యలో గిరిజనులు మృతి చెందారు. పరిశుభ్రమైన తాగునీరు తాగకపోవడం వల్ల కిడ్నీలు విఫలమై వారు మృతి చెందారని వివిధ సంస్థలు తేల్చాయి. వారికి కేవలం వాటర్‌ ఫిల్టర్లు ఇచ్చిన నాటి చంద్రబాబు ప్రభుత్వం చేతులు దులుపుకుంది. అదే జిల్లా మారేడుమిల్లి సమీపంలోని చాపరాయిలో కలుషిత నీరు తాగి 17 మంది విష జ్వరాలతో చనిపోయిన ఘటనను వైసీపీ శ్రేణులు గురు చేస్తున్నారు.

చట్టప్రకారం గిరిజనులకు రావాల్సిన హక్కులను కాలరాస్తోందంటూ చీకట్లో రాయి విసిరిన చంద్రబాబుకు బలంగా తగిలేలా వైసీపీ శ్రేణులు టీడీపీ ప్రభుత్వంలో గిరిజనుల హక్కులను ఎలా కాలరాసింది చెబుతూ గతాన్ని తవ్వుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో టీడీపీ తరఫున ఒక్క ఎస్టీ ఎమ్మెల్యే కూడా నెగ్గలేదు. అందరూ ఎమ్మెల్యేలు వైసీపీ వారే కావడంతో.. గిరిజన అభివృద్ధి సలహా మండలిని ఐదేళ్లపాటు చంద్రబాబు ఏర్పాటు చేయలేదు. జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు గిరిజన అభివృద్ధి కమిటీ ఏర్పాటుకు విధాన పరమైన నిర్ణయం తీసుకున్నారని గుర్తు చేస్తున్నారు. గిరిజనులకు రైతు భరోసా పథకం వర్తింపజేయడం, పోడు భూములపై హక్కులు కల్పన, అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా మైదాన ప్రాంతాలలో కన్నా అధిక పౌష్టికాహారం పంపిణి వంటి అనేక సంక్షేమ పథకాలు, విధానపరమైన నిర్ణయాలు సీఎం వైఎస్‌ జగన్‌ తన 18 నెలల పాలనలో అమలు చేశారని ఆ పార్టీ శ్రేణులు గుర్తు చేస్తున్నాయి.