iDreamPost
android-app
ios-app

విపత్తులోనూ రాజకీయ విషమేనా..? బాబు రెండు నాలుకల ధోరణి..!

  • Published Apr 28, 2021 | 10:55 AM Updated Updated Apr 28, 2021 | 10:55 AM
విపత్తులోనూ రాజకీయ విషమేనా..? బాబు రెండు నాలుకల ధోరణి..!

కరోనా నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.. ఆరోగ్యశ్రీ అసలు అమలు కావడంలేదు.. పరీక్షలు నిర్వహించే అధికారం ప్రభుత్వానికి ఎవరిచ్చారు.. వ్యాక్సినేషన్ లోను ఫెయిల్ అయ్యారు.. ఇదీ టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శల పరంపర. తిరుపతి ఉప ఎన్నిక ప్రచారం తర్వాత రాష్ట్రంలోనే కనిపించకుండా.. వినిపించకుండా పోయిన రాష్ట్ర ప్రతిపక్ష నేత ఇన్నాళ్లకు గళం విప్పి ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. రాష్ట్రం మహా విపత్తును ఎదుర్కొంటున్న విషమ పరిస్థితుల్లో.. రాష్ట్రంలోనే ఉండి ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన ఆయన ఇక్కడ ఉండకుండా ఎక్కడో హైద్రాబాద్ నుంచి ట్వీట్లు, ప్రకటనల రూపంలో మొసలి కన్నీరు కారుస్తున్నారు. విపత్తును ఎదుర్కొనే విషయంలో నిర్మాణాత్మక సలహాలు, సహకారంతో ప్రభుత్వానికి అండగా నిలవాల్సిన బాధ్యతను విస్మరించి కువిమర్శలతో ఇక్కడా రాజకీయం చేయాలనుకోవడం విమర్శలకు తావిస్తోంది.

అప్పుడలా.. ఇప్పుడిలా..

కరోనా విషయంలో చంద్రబాబు ద్వంద్వ వైఖరి తో వ్యవహరిస్తున్నారు. గత ఏడాది చివరిలో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఒకలా.. ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారు. గత ఏడాది మార్చిలో నామినేషన్ల దశలో ఉన్న ఎన్నికలను అప్పటి ఎస్ ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కరోనా సాకుతో వాయిదా వేశారు. ఆ తర్వాత గత డిసెంబరులో వాయిదా పడిన ఎన్నికలను తిరిగి నిర్వహించడానికి సిద్ధమయ్యారు. అయితే కరోనా సెకండ్ వేవ్ ముంచుకొస్తోందని, దానితోపాటు జనవరి నుంచి ప్రారంభమయ్యే వ్యాక్సినేషన్ డ్రైవ్ లో ప్రభుత్వ యంత్రాంగం మొత్తం నిమగ్నం కావాల్సి ఉన్నందున.. అది పూర్తి అయిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనను చంద్రబాబు సహా టీడీపీ నేతలు అపహాస్యం చేశారు. ఓటమి భయంతోనే సీఎం జగన్ ఎన్నికలు వద్దంటున్నారని విమర్శిస్తూ నిమ్మగడ్డకు వత్తాసు పలికారు. వ్యాక్సిన్ వేసుకున్న తర్వాతే ఎన్నికల విధుల్లో పాల్గొంటామన్న ప్రభుత్వ ఉద్యోగుల మొరను వినిపించుకోలేదు.

ఇక కోవిడ్ సెకండ్ వేవ్ ప్రారంభమైన తర్వాత పది రోజుల క్రితం జరిగిన తిరుపతి ఉప ఎన్నికల్లో ను ఇలాగే వ్యవహరించారు. కేసులు బాగా పెరుగుతున్న పరిస్థితుల్లో తాను ప్రచారానికి వెళ్తే లక్షల్లో జనం వస్తారని.. అది కోవిడ్ జోరును మరింత ఎగదోస్తుందని భావించిన సీఎం జగన్ ప్రజారోగ్యాన్ని కాంక్షించి ప్రచారం రద్దు చేసుకున్నారు. దీన్ని కూడా చంద్రబాబు, ఆయన తనయుడు రాజకీయం చేశారు. ప్రజా వ్యతిరేకతను ఎదుర్కోలేక, వారికి సమాధానం చెప్పలేక జగన్ ప్రచారం రద్దు చేసుకున్నారని కువిమర్శలు చేశారు. వారు మాత్రం ప్రజారోగ్యాన్ని పట్టించుకోకుండా రోడ్డు షోలు, సభలతో హడావుడి చేశారు.

Also Read : పరీక్షల నిర్వహణపై విమర్శలకు సీఎం జగన్‌ చెక్‌

నాడు స్థానిక ఎన్నికల విషయంలో ను, నిన్నటి తిరుపతి ఉప ఎన్నికల విషయంలోనూ జగన్ చెప్పిందే నిజమైంది. భయపడినంతా జరుగుతోంది. రాష్ట్రంలో కేసులు విజృంభిస్తున్నాయి. తిరుపతి పూర్తిగా కంటైన్మెంట్ జోన్ గా మారింది. ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగులు వైరస్ బారిన పడుతున్నారు. తన రాజకీయ లక్ష్యాల కోసం నాడు కరోనా హెచ్చరికలను పట్టించుకోని చంద్రబాబు ఇప్పుడు తగుదునమ్మా అంటూ.. కేసులు, మరణాలు పెరుగుతున్నాయని ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నారు. బాధ్యత విస్మరించిన ఆయనకు.. అలా విమర్శించే హక్కు ఎక్కడిదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించరు..?

వాస్తవానికి కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. స్థానిక పరిస్థితులను బట్టి ఎక్కడికక్కడ పాక్షిక లాక్ డౌన్ అమలు చేస్తోంది. ఆస్పత్రుల్లో పడకలు, ఆక్సిజన్, మందులకు కొరత లేకుండా పర్యవేక్షిస్తోంది. ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత చికిత్స అందిస్తోంది. ఎక్కడో ఉన్న చంద్రబాబు రాజకీయ కళ్ళకు ఇవేవీ కనిపించడంలేదు. వ్యాక్సినేషన్ విషయంలో రాష్ట్రం విఫలమైందని మరో ఆరోపణ చేశారు.

40 ఏళ్ల అనుభవం ఉందని చెప్పుకుంటున్న చంద్రబాబు.. టీకా కార్యక్రమ పూర్తి కేంద్రీకృతంగా.. కేంద్ర ప్రభుత్వ అజమాయిషీలో జరుగుతున్న విషయం తెలుసుకోకపోవడం విచారకరం. 18 ఏళ్ళు దాటిన వారికి ఉచితంగా టీకా వేసేందుకు కేంద్రం నిరాకరించినప్పుడు.. రాష్ట్ర సీఎం జగన్ ఆ భారం భరించి అందరికీ ఉచితంగా టీకాలు వేస్తామని చెప్పిన విషయం బాబుకు తెలియదో.. లేక తెలిసే ఆరోపణలు చేస్తున్నారో అర్థం కావడంలేదు. టీకాల విషయంలో కేంద్రాన్ని నిలదీయకుండా రాష్ట్రంపై ఉత్తుత్తి ఆరోపణలు చేయడం ఆయన ఉద్దేశాన్ని స్పష్టం చేస్తోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

Also Read : కొత్త కేడ‌ర్ కోసం చంద్ర‌బాబు ప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తాయా?