iDreamPost
iDreamPost
తుంటి కొడితే పళ్లు రాలాయన్నట్టుంది తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడి మాట తీరు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్రో ధరల పెరుగుదలకు ప్రభుత్వ అవినీతి, దోపిడీ, దుబారాలే కారణమని ఆయన సూత్రీకరించారు. ఇన్నాళ్లూ అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధర పెరుగుతుంటే ఇక్కడ పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయని జనం భావించారు కానీ బాబుగారి లెక్క ప్రకారం జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం దుబారా వల్ల ధరాభారం పెరుగుతోందన్నమాట! దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో పెట్రోల్ ధరలు ఉన్నాయని బాబు ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని ఖండిస్తూ రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్ బంక్‌ల వద్ద మంగళవారం 12 గంటల నుంచి 1 గంట వరకు నిరసన కార్యక్రమం నిర్వహించాలని టీడీపీ కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. పెట్రోల్‌పై లీటర్‌కు రూ.16, డీజిల్‌పై రూ.17 చొప్పున తగ్గించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
దుబారా ఎక్కడ జరిగింది?
సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అవినీతి, దుబారా, చేతకాని పరిపాలనా విధానాలతో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోయాయని ఆరోపిస్తున్న చంద్రబాబు అవి ఏ విధంగా, ఎక్కడ జరిగాయో చెప్పడం లేదు. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకొనే బాబు ఇంత కీలకమైన విషయంపై ఆరోపణలు చేయడమే కాక, ఆందోళనకు కూడా పిలుపునిచ్చినపుడు అందుకు తగిన ఆధారాలు కూడా చూపాలి కదా. ఈ ఆధారాలు లేకుండా రోజూ ఆయన చేసే ఆరోపణలను ప్రభుత్వ నిజాయితీని ప్రజల్లో చులకన చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నారని భావించేలా ఉంటున్నాయి. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు లక్షా ముప్పై వేల కోట్ల రూపాయలు వివిధ పథకాల లబ్ధిదారులకు పంపిణీ చేసింది. పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేసి నేరుగా వారి ఖాతాల్లో సొమ్ము జమ చేశారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా, ఒక యజ్ఞంలా నిర్వహిస్తున్న ఈ పథకాల అమలులో దుబారాగాని, అవినీతి గాని జరగలేదు కదా? మీరన్నట్టు ఈ ప్రభుత్వానివి చేతకాని పరిపాలనా విధానాలే అయితే అంత పకడ్బందీగా ఈ రెండున్నరేళ్లు ఇన్ని సంక్షేమ పథకాలను అమలు చేయగలిగేదా?
ఈ విషయాలన్నీ ఇప్పుడే గుర్తుకొచ్చాయా?
పెట్రోల్, డీజిల్ ధరలు అధికంగా ఉన్న రాష్ట్రానికి పరిశ్రమలు రావు, ఉద్యోగాలు, ఉపాధి ఉండవు, అధిక డీజిల్ ధరల కారణంగా ట్రాక్టర్, నూర్పిడి ఖర్చులు పెరిగి వ్యవసాయం దెబ్బతింటుంది. అధిక పెట్రోల్ ధరల కారణంగా ఉద్యోగులు, కార్మికులు, చిరు వ్యాపారులు దెబ్బతింటారు. లారీల యజమానులు, కార్మికులు దెబ్బతినడమే కాక రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు తారాస్థాయికి చేరతాయి వంటి నీతులు వల్లిస్తున్న చంద్రబాబుకు ఈ విషయాలన్నీ ఇప్పుడే గుర్తుకొస్తున్నాయా? ఇప్పుడంటే లీటర్ పెట్రోల్‌కు రూ.5, డీజిల్‌కు రూ.10 చొప్పున కేంద్రం తగ్గించింది కానీ ఇన్నాళ్లూ సెన్సెక్స్‌తో పోటీ పడి పెట్రో ధరలు పెరుగుతుంటే మీరెందుకు మాట్లాడలేదు. దాదాపు రోజూ ధరలు పెరుగుతూ.. చూస్తుండగానే రూ.70 నుంచి రూ.115 వరకు పెట్రోల్ ధరలు పెరుగుతుంటే ఇదేం అన్యాయమని కేంద్ర ప్రభుత్వాన్ని ఒక్కసారైనా ప్రశ్నించారా? అసలు మీరు ఓడిపోయినప్పటి నుంచి కేంద్రాన్ని ఏ విషయంపైనైనా ప్రశ్నించరు ఎందుకు? ప్రపంచంలో ఏ విషయాన్నైనా వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికి ముడిపెట్టేసి అవినీతి, అసమర్థ అంటూ ఆరోపణలు చేసే మీరు దుబారాకు పెట్రో ధరల పెరుగదలకు లింకేమిటో వివరిస్తే జనం తెలుసుకుంటారు కదా.
మీ దుబారాపై సమాధానం చెప్పరేం?
మీ ప్రభుత్వ హయాంలో అయిన దానికి కాని దానికి చార్టెర్డ్ విమానాల్లో సింగపూర్, మలేసియాలకు మీరు, మీ మంత్రులు తిరిగినప్పుడు దుబారా అని తెలియదా? ప్రభుత్వం తరఫున నిర్వహించే ప్రతి కార్యక్రమాన్ని ఒక ఈవెంట్‌లా ఆడంబరంగా నిర్వహించినప్పడు గాని, కట్టడమే పూర్తికాని పోలవరం ప్రాజెక్టు సందర్శనకు జనం ముసుగులో తెలుగుదేశం కార్యకర్తలను ఆర్టీసీ బస్సుల్లో తీసుకెళ్లినప్పుడు దుబారా అని అనిపించలేదా? ప్రభుత్వ ఖర్చుతో ఢిల్లీలో పార్టీ తరఫున ధర్నాలకు రైళ్లలో టీడీపీ కార్యకర్తలను తరలించినప్పుడు ప్రజాధనం దుబారా అవుతోందని, అది అవినీతి అని మీకు తెలియదా? ఈ ప్రశ్నలన్నీ వైఎస్సార్ సీపీ నాయకులు ఎన్నిసార్లు సంధించినా ఇప్పటి వరకు మీరు ఎందుకు సమాధానం చెప్పరు.
కార్యకర్తలను ఉత్సాహ పరచడానికే పసలేని ఆరోపణలా..
రోజురోజుకు ప్రజాదరణ తగ్గి ఖాళీ అయిపోతున్న తెలుగుదేశం పార్టీని నిలబెట్టుకోవడానికి, కార్యకర్తల్లో ఉత్సాహం నింపడానికి మీరు పసలేని ఆరోపణలు చేస్తున్నారని అందరికీ అర్థమౌతోంది. ఈ మధ్య మీరు ఇస్తున్న ఆందోళన పిలుపులు తుస్సు మంటున్నాయి. ఇటీవల పట్టాభి ఉదంతంలో ఇచ్చిన బంద్ పిలుపు విఫలం అయింది. అందుకేనా మంగళవారం ఒక్క గంట నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఆ గంటపాటు నిరసన కార్యక్రమమైనా ఫెయిల్ కాకుండా చూసుకోవాలి తప్ప ఇలా పొంతన లేని వ్యాఖ్యలు చేసి ప్రజలను గందరగోళంలోకి నెట్టడం ఎందుకు చెప్పండి.