iDreamPost
android-app
ios-app

జగన్‌ పాలన గొప్పగా ఉంది.. బాబు మాటలతో ..

జగన్‌ పాలన గొప్పగా ఉంది.. బాబు మాటలతో ..

ప్రభుత్వంపై ప్రతిపక్షం విమర్శలు చేయడం సహజం. అది బాధ్యత కూడా. ప్రజల పక్షాన, ప్రజా సమస్యలపై, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై, ఎన్నికల వేళ ఇచ్చిన హమీలు అమలుపై ప్రతిపక్షం పాలక పక్షాన్ని నిలదీయాలి. నిరంతరం ప్రజల గొంతుకను వినిపించాలి. అప్పుడే ప్రజల విశ్వాసాన్ని ప్రతిపక్షం చూరగొంటుంది. అయితే ఇందుకు పూర్తి విరుద్ధంగా ఏపీలోని ప్రతిపక్షం వ్యవహరిస్తుండడం విడ్డూరంగా ఉంది. అదీ 4 పదుల రాజకీయ అనుభవం, మూడుసార్లు ముఖ్యమంత్రిగా, మరో మూడుసార్లు ప్రతిపక్ష నేతగా పని చేసిన అనుభవం ఉన్న నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌పై హాస్యాస్పదమైన విమర్శలు చేస్తుండడం ఆశ్చర్యంగా ఉంది.

ఆత్మలతో మాట్లాడే సీఎంను చూస్తున్నాం.. అంటూ చంద్రబాబు నాయుడు వైఎస్‌ జగన్‌ను ఉద్దేశించి అవహేళన చేశారు. ప్రతి ఆదివారం కొత్తపలుకు పేరుతో ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాథాకృష్ణ రాసే ఎడిటోరియల్‌ వ్యాసంలో.. సీఎం వైఎస్‌ జగన్‌ ప్రతి రోజు అర్థరాత్రి తన తండితో మాట్లాడుతుంటారని, ఓ రిటైర్డ్‌ ఐఏఎస్‌ తనకు ఈ విషయం చెప్పారంటూ ఓ కట్టుకథను అల్లారు. ఆ రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి ఎవరు..? రాథా కృష్ణ రాతల్లో విశ్వసనీయత ఏమిటో అందరికీ తెలిసిందే. ఇలాంటి హాస్యాస్పదమైన రాతలు రాసేందుకు రాథాకృష్ణ ఏ మాత్రం సిగ్గుపడరు.

Also Read : టీడీపీకి అతనితో తలనొప్పులే..

అయితే ఎప్పటిలాగే అనుకూల మీడియాలో వ్యతిరేక కథనాలు రాయించడం, ఆ తర్వాత వాటిని పట్టుకుని మాట్లాడే చంద్రబాబు నాయుడు.. సీఎం ఆత్మలతో మాట్లాడతారంటూ.. వైఎస్‌ జగన్‌ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ పరిణామాలు చూస్తున్న వారు.. ఎన్టీఆర్‌ను పదవీచిత్యుడ్ని చేసేందుకు నాడు ఎన్టీఆర్‌ వ్యక్తిత్వం, పాలన వ్యవహారాలపై వ్యతిరేక కథనాలు రాయించడం, వాటిని పదే పదే చెప్పడం ద్వారా బాబు సాధించిన ఘన కార్యాన్ని గుర్తు చేసుకుంటున్నారు. అదే పంథాను వైఎస్‌ జగన్‌ విషయంలోనూ అమలు చేసేందుకు ప్లాన్‌ చేశారని చెబుతున్నారు.

సీఎం వైఎస్‌ జగన్‌ పార్టీ పెట్టినప్పటి నుంచి ప్రజా సంకల్ప పాదయాత్ర వరకూ ఆయన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా టీడీపీ అనుకూల మీడియా కథనాలు రాసింది. వైఎస్‌ జగన్‌ అవేశపరుడని, పెద్ద వారిని కూడా పేరు పెట్టి పిలుస్తారని, సీనియర్‌ నాయకులు కూడా జగన్‌ ముందు నిలుచోనే ఉండాలని.. ఇలా వైఎస్‌ జగన్‌ను ఓ అహంకారి మాదిరిగా చిత్రీకరించేందుకు యత్నించారు. పత్రికల్లో కథనాలు రాయించడం, వాటిని పట్టుకుని టీడీపీ నేతలు మళ్లీ మీడియా సమావేశాల్లో గొంతుచించుకోవడం.. ఇలా సాగిన ఈ దుష్ప్రచారానికి ప్రజా సంకల్ప పాదయాత్రతో బ్రేక్‌ పడింది. వైఎస్‌ జగన్‌ అంటే ఏమిటో ప్రజలకు అర్థమైంది. ఇక ఈ ప్రచారం ద్వారా లాభం లేదనుకున్న టీడీపీ అనుకూల మీడియా, చంద్రబాబు.. తాజాగా.. వైఎస్‌ జగన్‌ను మూఢనమ్మకాలు కలిగిన వ్యక్తిగా ముద్రవేసే ప్రయత్నం చేస్తున్నారు.

Also Read : ‘నెక్స్ట్ సీఎం ఎన్టీఆర్’ నినాదాలతో.. చంద్రబాబుకు తెలుగు తమ్ముళ్ల స్వాగతం

వైఎస్‌ జగన్‌పై చంద్రబాబు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా ఆయనకు మేలే చేస్తున్నారు. వైఎస్‌ జగన్‌ పాలనపై విమర్శలు చేసేందుకు ఏ అవకాశం లేక.. ఇలాంటి విమర్శలు చంద్రబాబు చేస్తున్నారనేలా ప్రజలు భావిస్తున్నారు. ఎన్నికల వేళ వైఎస్‌ జగన్‌ ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని చంద్రబాబు విమర్శలు చేయడం లేదు. జగన్‌ సర్కార్‌ పాలన బాగోలేదని లోపాలను ఎత్తి చూపడం లేదు. ప్రజా వ్యతిరేక విధానాలు తీసుకుంటున్నారని చంద్రబాబు విమర్శలు చేయడంలేదు. ఈవేమీ చేయకుండా వైఎస్‌ జగన్‌ వ్యక్తిత్వహననమే లక్ష్యంగా విమర్శలు చేస్తుండడంతో జగన్‌ సర్కార్‌ పాలన భేష్‌గా ఉందని చంద్రబాబే సర్టిఫై చేస్తున్నారు.