iDreamPost
android-app
ios-app

ఇంకనూ జగన్‌పై పాత పాటనేనా.. బాబు గారు..?

ఇంకనూ జగన్‌పై పాత పాటనేనా.. బాబు గారు..?

జగన్‌పై అనేక క్రిమినల్‌ కేసులున్నాయనే ట్రంప్‌ పర్యటనకు కేంద్రం పిలవలేదు. అమెరికా చట్టం చాలా నిక్కచ్ఛిగా ఉంటుంది. ఇలాంటి ఆర్థిక నేరగాళ్లను వాళ్లు చాలా దూరం పెడతారు, అందుకే ట్రంప్‌తో విందుకు కేంద్రం పిలవలేదు… ఇవీ నిన్న కుప్పం లో ప్రజా చైతన్య యాత్ర సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్న మాటలు. మోకాలికి బోడి గుండుకు ముడివేయడంలో చంద్రబాబుకు సాటిరాగల రాజకీయ నాయుడు భారత్‌ దేశంలో మరొకరు లేరనేది విశ్లేషకుల మాట. ఇది చాలా సార్లు నిజమైంది కూడా.

ఇప్పుడే కాదు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్న సమయంలో కూడా దేశంలో ఏ మూలన ఏమి జరిగినా దానికి జగన్‌ కేసులకు ముడిపెట్టారు. పెద్ద నోట్ల రద్దు సమయంలో స్వచ్ఛందంగా లెక్కల్లో చూపని ఆదాయం వెల్లడించాలని కేంద్రం ఓ పథకం ప్రవేశపెడితే.. తెలుగు రాష్ట్రాల నుంచి 15 వేల కోట్ల రూపాయలు వెల్లడైంది. అందులో ఒకే ఒక్క వ్యక్తి 10 వేల కోట్ల రూపాయలు వెల్లడించారు. ఆ వ్యక్తి జగనే అంటూ సాక్షాత్తూ సీఎం హోదాలో చంద్రబాబు ఆరోపించారు. సీఎంగా ఉన్న సమయంలోనే ఇలా వ్యవహరించిన చంద్రబాబు.. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పడు పై విధంగా మాట్లాడడంలో పెద్ద విశేషం లేదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

అయినా చంద్రబాబు గుడ్డి నమ్మకం కాకపోతే.. జగన్‌ను తిడితేనో.. అతను ఆర్థిక నేరగాడని, లక్ష కోట్లు దొచుకున్నాడని.. పాడిందే పాటరా.. పాసిపళ్ల దాసరా.. అన్నట్లు పాత పాటే పాడితే అధికారం వస్తుందని భావిస్తున్నట్లున్నారు. కానీ ఇది వర్క్‌అవుట్‌ కాదని గత ఎన్నికల్లోనే తేలిపోయింది. దాదాపు 10 ఏళ్లుగా జగన్‌పై లక్ష కోట్ల ఆరోపణలు చేస్తున్నారు. చెప్పిందే మళ్లీ మళ్లీ చెప్పినా.. ప్రజలు నమ్మలేదు. అందుకే 2014 ఎన్నికల్లో బాబు పార్టీకి, జగన్‌ పార్టీకి మధ్య కేవలం 5 లక్షల ఓట్లే వ్యత్యాసం ఉంది. 2019 వచ్చే సరికి జగన్‌కు పట్టం కట్టారు.

రాష్ట్ర విభజన నేపథ్యంలో సీనియర్‌ అనే కారణం, 650 పైగా హామీల వల్ల 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. సమర్థవంతమైన పరిపాలన, ఇచ్చిన హామీలను అమలు చేయడం మరిచి అధికారంలో ఉన్నప్పుడు కూడా సీఎం జగన్‌పై లక్ష కోట్ల ఆరోపణే చేశారు. 2019 ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ.. ఐదేళ్లలో విభజన వల్ల రాజధాని కూడా లేని రాష్ట్రాన్ని తాను ఏ విధంగా అభివృద్ధి చేసిందీ.. చెప్పడం మాని మళ్లీ ఎన్నికల సభల్లో జగన్‌పై అవినీతి ఆరోపణలు చేశారు. ఓ పక్క ఎన్నికల ఖర్చు కోసం జగన్‌కు తెలంగాణ సీఎం కేసీఆర్‌ వెయ్యి కోట్లు పంపుతున్నారు.. వాటిని సరిహద్దుల్లోనే ప్రజలు అడ్డుకోవాలని.. పిలుపునిస్తూనే.. మరో వైపు జగన్‌ లక్ష కోట్లు దోచాడు.. అంటూ పరస్పర విరుద్ధమైన విమర్శలు చేశారు.

చంద్రబాబు చెప్పినట్లు జగన్‌ వద్ద లక్ష కోట్లు ఉంటే.. ఎన్నికల ఖర్చు కోసం కేసీఆర్‌ నుంచి వెయ్యి కోట్లు తీసుకోవాల్సిన అవసరం ఏముంది..? లక్ష కోట్లలో వెయ్యి కోట్లు అంటే.. ఒక్క శాతం. వందకు ఒక్క రూపాయి లెక్క. జగన్‌పై తాను చేసిన లక్ష కోట్ల ఆరోపణలు పూర్తిగా అబద్ధమని.. తన నోటితోనే చంద్రబాబు చెప్పారు. ఇదే ప్రజలు ఆలోచించారు. అర్థం చేసుకున్నారు. 2019 ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడించారు. ఐదేళ్ల జగన్‌కు అధికారం ఇచ్చారు. జగన్‌ చెప్పినవి అమలు చేస్తే.. మళ్లీ అధికారం ఇస్తారు. లేదంటే చంద్రబాబుకు ఇచ్చిన ఫలితమే ఇస్తారు.

ఈ ఐదేళ్లలో ప్రజల పక్షాన నిలబడి.. జగన్‌ ప్రభుత్వం ఏమైనా ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తుంటే వ్యతిరేకించాలి. హామీలు అమలు చేయకపోతే ప్రజల తరఫున ప్రశ్నించారు. పింఛన్లు, రేషన్‌కార్డులు తొలగించిన సమయంలో స్పందించినట్లుగా నిత్యం ప్రభుత్వ నిర్ణయాలపై అప్రమత్తంగా వ్యవహరించాలి. అంతేగానీ జగన్‌ ఆర్థిక నేరగాడు.. లక్ష కోట్లు దోచాడు.. అందుకే ట్రంప్‌తో విందుకు పిలవలేదు.. లాంటి విమర్శల చేయడం ప్రతిపక్ష నేత విధి కాదన్న విషయం చంద్రబాబు గుర్తించాలని పరిశీలకులు సూచిస్తున్నారు. పైగా అలాంటి మాటల వల్ల చంద్రబాబుకు వీసమెత్తు లాభం కూడా ఉండదని, ప్రజల తరఫున పోరాడితేనే.. వారి మన్ననలు గెలుచుకోగలరంటున్నారు.