iDreamPost
iDreamPost
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణ నివాసంలో సోదాలు జరుపుతున్నప్పుడు సీఐడీ అధికారులకు ఆటంకాలు సృష్టించారంటూ ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణపై నమోదు చేసిన జీరో ఎఫ్ఐఆర్ మీడియాకు సంకెళ్లు అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్య మరీ వింతగా ఉంది. ఈ విషయంపై ఆయన తీవ్రంగా స్పందించారు. రాధాకృష్ణతో సహా మరో ముగ్గురు ఏబీఎన్ సిబ్బందిపై జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయటం వైఎస్సార్ సీపీ ప్రభుత్వ ఉన్మాదానికి పరాకాష్ట అని మండిపడ్డారు. ప్రజా సంక్షేమం గాలికొదిలి ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రశ్నించే గొంతుకలను అణిచివేయటమే లక్ష్యంగా జగన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్న మీడియాకు సంకెళ్లు ఎన్నాళ్లు వేస్తారు? వేమూరి రాధాకృష్ణ ఏం నేరం చేశారని ఎఫ్ ఐఆర్ నమోదు చేశారని ప్రశ్నించారు.
మిత్రుడిగా అక్కడికి వెళ్లి మీడియా పనులు చేస్తే ఎలా?
దశాబ్ధాలుగా తనకు మిత్రుడైన లక్ష్మీనారాయణకు ధైర్యం చెప్పడానికి వెళ్లానంటున్న రాధాకృష్ణ అక్కడ చేసిందేమిటి? అధికారులు సోదా చేస్తుంటే తన ఏబీఎన్ సిబ్బందితో వీడియో తీయించారు. విచారణ సమయంలో అధికారుల అనుమతి లేకుండా వీడియో తీయడం భావ్యమేనా? పైగా మిత్రుడికి ధైర్యం చెప్పడానికి వెళ్లిన ఆయన సిబ్బందిని వెంట పెట్టుకు వెళ్లడం ఏమిటి? అక్కడ రాధాకృష్ణ ఆధ్వర్యంలో ఆయన సిబ్బంది వీడియో తీయడం అంటే అధికారుల విచారణకు ఆటంకం కలిగించడం కాక మరేమిటి? ఓ మీడియా హౌస్ అధినేతగా ఆయనను అధికారులు గౌరవించి గేటు తీసి లోపలకు అనుమతిస్తే ఆయన మిత్రుడికి ధైర్యం చెప్పి వచ్చేయకుండా మొత్తం పంచనామా పూర్తయ్యేవరకు అక్కడే ఉన్నారు? బయటకు వచ్చి అధికారులే తమను అక్కడ ఉండమని రిక్వెస్ట్ చేసినట్టు బిల్డిప్ ఇచ్చారు.
Also Read : సీఐడీ కేసు.. లక్ష్మీనారాయణకు ‘ముందస్తు’ రక్షణ
బయటకు వచ్చాక తాను తీయించిన వీడియోలో తనకు అనుకూలమైన పుటేజీని ఏబీఎన్ చానల్‌లో ప్రసారం చేయించారు. ఇలా మిత్రుడు ముసుగులో అక్కడికి వెళ్లి పచ్చపాత పాత్రికేయం చేయడం ఏం పద్ధతి? అసలు ఒక అవినీతి కేసులో విచారణ జరిగేటప్పుడు హఠాత్తుగా అక్కడ రాధాకృష్ణ వాలిపోయి ధైర్యం చెప్పడానికి వెళ్లానని బుకాయింపులేమిటి? తీరా ఇప్పుడు సీఐడీ అధికారులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసే సరికి మీడియా సంకెళ్లు అంటూ చంద్రబాబు నుంచి గల్లీ లీడర్ వరకు మొత్తం తెలుగుదేశం పార్టీ గగ్గోలు పెట్టేస్తే అది నిజం అయిపోతుందా? అసలు అక్కడ జరిగిన అంశానికి పాత్రికేయ స్వేచ్ఛకు ముడిపెట్టడం ఎంతవరకు న్యాయం..?
తప్పుదోవ పట్టిస్తున్న చంద్రబాబు
ఏపీలో మునుపెన్నడూ లేని విధంగా రెండున్నరేళ్లుగా మీడియా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ వైఫల్యాల్ని, ఆ పార్టీ నేతల అవినీతిని ఏబీఎన్ సంస్ధలు ఎప్పటికప్పుడు వెలికితీసి ప్రజలకు తెలియజేస్తున్నారన్న కారణంతో జగన్ రెడ్డి కక్ష సాధిస్తున్నారని చంద్రబాబు చేస్తున్న ఆరోపణలు జనాన్ని తప్పుదోవ పట్టించడం కాదా? రాధాకృష్ణ ఏం అవినీతిని వెలికితీస్తున్నారని సీఎం జగన్ కక్ష పెంచుకుంటారు. గాలిపోగేసి ప్రభుత్వంపై రోజూ నిరాధారమైన రాతలు రాయడం, అసత్యాలను ప్రసారం చేయడమే కదా ఏబీఎన్, ఆంధ్రజ్యోతి చేస్తున్న పని. పాత్రికేయ విలువలకు తిలోదకాలిచ్చిన ఆ మీడియా గ్రూపును అటు ప్రభుత్వం, ఇటు వైఎస్సార్ సీపీ ఎప్పుడో పట్టించుకోవడం మానేశాయి. నిత్యం తన భజన చేస్తున్న రాధాకృష్ణ రుణం తీర్చుకోవడానికే చంద్రబాబు, టిడిపి నేతలు పోటీ పడి మరీ.. ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారు. కాని రాష్ట్రంలో మీడియా స్వేచ్ఛకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదని పలువురు పాత్రికేయులే వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం.
Also Read : ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం.. మాజీ ఐఏఎస్ ఇంట్లో సోదాలు.. సీఐడీని అడ్డుకున్న ఏబీఎన్ రాధాకృష్ణ