iDreamPost
iDreamPost
ప్రకృతికి ఎదురొడ్డి పంటను పండించి, ఇంటికి తెచ్చుకోవాలంటే మాటలు కాదు. రాజకీయం అయినా అంతే ప్రజల్ని నమ్ముకుని పోరాడాలి, వారి నమ్మకం పొందాలి, వారిచ్చే అధికారాన్ని దక్కించుకోవాలి. అంతేగానీ నేనేమో జూమ్ మీటింగ్‌లు పెడతాను.. నువ్వేమో ట్విట్టర్లో చెలరేగిపో అంటే.. ఎంత వరకు సమంజసం. ఎందుకు చెబుతున్నామంటే.. చినబాబు, పెదబాబుల గురించే ఇదంతా. యాతం వేసి బావిలో నీళ్ళుతోడాలి, ఆ నీరు చేలోకి పారించాలి, దుక్కిదున్నాలి, విత్తనాలు వెయ్యాలి, పంట ఎదగాలి, కొయ్యాలి, ధాన్యం ఇంటికి తెచ్చుకోవాలి. సాగు బాగా జరిగి పంట చేతికి రావాలంటే ఇన్నిదశలున్నాయి. అది కూడా వాతావరణం అనుకూలంగా ఉంటేనూ. అంతే గానీ యాతం ఏసేస్తున్నాను నాన్నా అంటే.. పంట కోతకు రెడీ అయిపోనా కొడుకా అనడిగితే చూసే వాళ్ళ మాట అటుంచితే విన్నవాళ్ళు కూడా నవ్విపోతారు.
పాపం ఏపీలో పెదబాబు, చినబాబుల పరిస్థితి అలాగే ఉంది. యేడాది కాలంలో సీయం జగన్ ఏం చేసారు? అనడుగుతున్న వీళ్లు, వీళ్ళ పార్టీ నాయకులు, అసలు మీరేం చేస్తున్నారు? అంటే చెప్పగలిగేందుకు సమాధానం ఉందా అన్నదే ప్రశ్న. ఓ పక్క కోవిడ్ 19 కారణంగా జనం నానా పాట్లు పడుతున్నారు. అందుబాటులో ఉన్న సర్వశక్తులు ఒడ్డి వాళ్ళను కాపాడేందుకు అధికార పార్టీ శతవిధాలా ప్రయత్నిస్తోంది. మరి ప్రతిపక్షంగా, మరీ ప్రధాన ప్రతిపక్షంగా మీరేం చేస్తున్నారు? అంటే చెప్పేందుకు సమాధానమే దొరకదు. పార్టీ స్థాయిలతో సంబంధం లేకుండా ఇతర పార్టీల వాళ్లు తమ శక్తిమేరకు కోవిడ్ బాధితులక సాయమందిస్తున్నారు. కానీ ఐదేళ్లు అధికారం ఇచ్చిన ప్రజలకు పచ్చపార్టీ నాయకులు ఏం సాయం చేస్తున్నారు అంటే జవాబు తడుముకోవాల్సిందే.
జూమ్ మీటింగ్‌లు పెడుతున్నాం, ట్విట్టర్లో ప్రభుత్వాన్ని ఏకిపారేస్తున్నాం అంటారా.. వాటి ఫలితాలు, తద్వారా మీ పార్టీకి, మీకు వచ్చే ప్రయోజనాలు ఏంటో మీకే తెలియాలి లేదా మీకీ తరహా సలహాలిస్తున్నవారికైనా తెలిసుండాలి. జగన్ ప్రభుత్వం చేస్తున్న, చేయబోతున్న, ఇప్పటి వరకు అమలులో ఉన్న ఏ ఒక్క పథకం గురించైనా శాస్త్రీయంగా విమర్శ లేదా సూచన చేసే ప్రయత్నమైనా ఇప్పటి వరకు చేయగలిగారా? అంటే లేదన్న సమాధానమే జనం నుంచి వస్తుంది. మంచిచేస్తే మొచ్చుకోవచ్చు, చెడు చేస్తే ప్రతిపక్ష హోదాలో చీల్చి చెండాడ వచ్చు. కానీ ఈ రెండూ ఇప్పటి వరకు పెదబాబు, చినబాబు పార్టీ చేసిందే లేదన్నది జనం చెబుతున్న మాట. రాష్ట్రంలో తామున్నాము అని చెప్పుకునేందుకు మాత్రమే ఇప్పటి వరకు చేసిన ఏ కార్యక్రమమైనా అన్నది సొంత పార్టీ వారి నుంచే వస్తున్న విమర్శ.
అధికారంలో ఉండగా పదవులు అనుభవించిన వాళ్ళు, ప్రతిఫలాలు పొందిన వాళ్ళు ఎవరి దారిని వాళ్ళు చూసుకున్నట్లుగానే తోస్తోంది. అటువంటప్పుడు పార్టీని, పార్టీని నమ్ముకున్న వాళ్ళను కాపాడుకునే ప్రయత్నాలు చేయాలి. అది జనాన్ని నమ్ముకుని, జనంలోకి వెళితేనే సాధ్యమవుతుంది. కానీ జూమ్లు, ట్విట్టర్లను నమ్ముకుంటే జరిగే పనికాదని ఇప్పటి వరకు మన దేశంలో జరిగిన అనేక రాష్ట్రాల్లోని ఎన్నికలే నిరూపించాయి. ఇటువంటి సాకేంతికత ఓటర్లలోని కొద్ది శాతం మేరకు మాత్రమే చేరుతుందన్నది బహిరంగ సత్యం. పైగా అలా చేరిన వాళ్ళలో పోలింగ్ బూత్‌కు వచ్చి ఓట్లేసే వాళ్ళెంత మంది ఉంటారు? అన్నది అంచనాకి దొరకని లెక్కలాంటిది. ట్విట్టర్లో ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో ఓటు ఉండాలన్న రూలేం లేదుగా.. అంచేత ఇప్పటికైనా కొంచె నేలమీదకి వచ్చి, సాంకేతికతను పక్కన బెట్టి, జనాన్ని నమ్ముకోవాల్సిన అవసరం పెదబాబు, చినబాబు అండ్ పార్టీకి ఎంతైనా ఉందన్నది రాజకీయ విశ్లేషకుల సూచన.