iDreamPost
android-app
ios-app

కాదంటూనే అందరూ అవునంటున్నారు..!

కాదంటూనే అందరూ అవునంటున్నారు..!

అమరావతి వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ ఒకటి తలిస్తే.. దైవం ఒకటి తలిచింది. రాజధాని ప్రకటించక ముందే వేల ఎకరాలు కొనుగోలు చేసి వేల కోట్ల రూపాయల సంపదకు వారసులం అవుదామని ఆశించిన టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన అనునూయలకు ఇప్పుడు అదే అమరావతి చావుబతుకుల సమస్యగా మారింది.

అమరావతి ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌లో జరిగిన భారీ భూ కుంభకోణం నుంచి తప్పించుకునేందుకు టీడీపీ, దాని అనుకూల మీడియా చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. ఇన్‌సైడర్‌ట్రేడింగ్‌ను పక్కదోవపట్టించేందుకు.. విశాఖలో ఒన్‌సైడ్, ఇన్‌ అండ్‌ ఔట్‌ సైడ్‌.. అంటూ సరికొత్త పదాలతో ప్రజలను తికమక పెట్టే ప్రయత్నం టీడీపీ అనుకూల మీడియా చేస్తోంది. అవే మాటలను చంద్రబాబు అండ్‌ కో మాట్లాడుతూ అమరావతి భూ కుంభకోణం నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.

అమరావతిలో తప్పు జరగలేదని చెబుతున్న చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి అదే సమయంలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందంటూ అంతర్లీనంగా ఒప్పుకుంటున్నాయి. వివిధ సందర్భాల్లో చంద్రబాబు తన మాటల్లో అసలు నిజం ఒప్పుకుంటున్నారు. అదే విధంగా ఈనాడు, ఆంధ్రజ్యోతిలు కూడా తమ కథనాల్లో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ కాదంటూనే ఔనంటున్నాయి.

2015లో అమరావతిలో జరిగిన ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ను సాక్షి పత్రిక బట్టబయలు చేసింది. సర్వే నంబర్లు, ఎవరు పేర్లతో రిజిస్ట్రేషన్, ఎప్పుడు జరిగింది..? అనే విషయాలు సమగ్రంగా వరుస కథనాలలో వెల్లడించింది. ఒక్కసారిగా ఉలిక్కిపడిన చంద్రబాబు.. మీడియా సమావేశంలో విలేకర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా.. కొంటే తప్పేంటి.. డబ్బులున్నాయి.. కొనుక్కుంటారు.. అంటూ అసలు నిజం ఒప్పేసుకున్నారు. అదే సమయంలో తాను తన భార్య పేరుమీద భూములు కొన్నామని అప్పటి మంత్రి రావెల కిషోర్‌ బాబు కూడా ఒప్పుకున్నారు.

మూడు రాజధానులు ప్రతిపాదన చేసిన తర్వాత.. అమరావతియే ఏకైక రాజధానిగా కొనసాగించాలనే లక్ష్యంతో ఈనాడు కథనాలు రాస్తోంది. ఈ క్రమంలో.. రాజధానికి 33 వేల ఎకరాలు రైతులు ల్యాండ్‌ పూలింగ్‌ కింద ఇచ్చారని, అందులో 7 వేల ఎకరాలు బయట వ్యక్తులు రైతుల వద్ద కొనుగోలు చేసి ఇచ్చారంటూ రాసుకొచ్చింది. మంచి ధర వస్తుందని 7 వేల ఎకరాల భూములు కొనుగోలు చేసి ఇచ్చిన వారు ఇప్పుడు మూడు రాజధానుల ప్రతిపాదన వల్ల నష్టపోతున్నారని కథనంలో పేర్కొంది. రాజధానికి ల్యాండ్‌ పూలింగ్‌లో భూములు సేకరించక ముందే వాటిని బయట వ్యక్తులు కొనుగోలు చేసినట్లు ఈనాడు చెప్పకనే చెప్పింది.

ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ కూడా ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందని తన కొత్త పలుకులో ఒప్పుకున్నారు. పోయిన ఆదివారం ‘బరితెగించి బెదిరింపులు’ పేరున రాసిన కొత్తపలుకులో.. ప్రభుత్వ నిర్ణయం వెలువడడానికి కొద్దిగా ముందు భూములు కొని ఉంటే అది అనైతికం అవుతుంది కానీ చట్ట విరుద్ధం అని చెప్పలేం… అంటూ అసలు విషయం చెప్పేశారు. భూములు కొన్నారు. అయితే అది అనైతికం అవుతుంది కానీ చట్టవిరుద్ధం కాదు. ప్రభుత్వం దర్యాప్తు చేయజాలదు. కోర్టులు విచారించలేవు.. అని చెప్పడమే రాధా కృష్ణ ఉద్దేశంలా ఉంది. నైతికంగా పాలన చేయాల్సిన చంద్రబాబు.. అనైతికంగా వ్యవహరించారని రాధా కృష్ణ చెబుతున్నారు. అనైతికంగా వ్యవహరిస్తే నేరం కాదని.. చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తేనే నేరం అవుతుందని రాధా కృష్ణ ఉద్దేశం కాబోలు. అందుకే తన కొత్త పలుకులో.. పై విధంగా వ్యాఖ్యానించి.. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందని చెప్పకనే చెప్పారు.

Read Also; తండ్రిని మించిన తనయుడు