iDreamPost
iDreamPost
అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు పై గవర్నర్ సంతకం చేయటం పట్ల తీవ్రాతితీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు , ఇది దుర్మార్గం అని వైసీపీ రాష్ట్రానికి అన్యాయం చేస్తుందని ఈ నిర్ణయం పై రిఫరెండానికి వెళ్లాలని వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు రాజీనామా చేసి మళ్లీ పోటీ చేసి తమది సరైన చర్య అని నిరూపించుకోవాలని అందుకు 48 గంటల సమయం ఇస్తున్నానని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే .
చంద్రబాబు ఆ తర్వాత ఏమి చేయనున్నాడు . టీడీపీ ఎమ్మెల్యేలు , ఎంపీలు రాజీనామాలు చేసి ప్రత్యక్ష పోరాటాలు చేస్తారా అని టీడీపీ శ్రేణులు ఆసక్తిగా ఎదురు చూడగా , అన్ని ప్రాంతాల అభివృద్ధి మాకు ముఖ్యం ఒక్క అమరావతి కాదు . అలా కాకుండా అన్ని ప్రాంతాల ప్రజలు తమ ప్రాంత అభివృద్ధి కాక ఒక్క అమరావతి ప్రాంత అభివృద్ధి మాత్రమే కోరుకొంటున్నారు అంటున్న బాబు మాటలు నిజమైతే ఆయన , అన్ని ప్రాంతాల టీడీపీ నాయకులు రాజీనామా చేసి మళ్లీ గెలిచి తమ వాదం నిజం అని వారే నిరూపించాలి కానీ మేము కాదు , మా నిర్ణయం తప్పైతే ఈ రోజు అధికారం ఇచ్చిన ప్రజలే 2024 లో తీర్పు చెబుతారు అని వైసీపీ శ్రేణులు తేల్చిచెప్పగా , మిగతా పార్టీలు , ప్రజా సంఘాలు ఈ వ్యవహారంలో పెద్దగా జోక్యం చేసుకోకుండా 48 గంటల తర్వాత బాబు ఏం చేస్తాడా అని ఆసక్తిగా ఎదురు చూశాయి .
48 గంటల తర్వాత అనుకొన్న సమయానికి జూమ్ లో ఎంచుకున్న మీడియా ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసిన బాబు హావభావాల్లో తీవ్ర ఆగ్రహావేశాలు , ఆవేదన వెళ్లగక్కారు కానీ ఇదిమిద్దంగా ఏ విషయం తేల్చకుండానే మీటింగ్ ముగించేసి ఆసక్తిగా ఎదురుచూస్తోన్న టీడీపీ శ్రేణుల్ని ఉసూరుమనిపించారని చెప్పొచ్చు .
వికేంద్రీకరణ బిల్లు పై గవర్నర్ ఆమోదముద్రకి నిరసనగా బాబు గానీ , టీడీపీ నాయకులు కానీ రాజీనామాలు చేయలేదు , పోరాట కార్యాచరణ ప్రకటించలేదు . ఎలా ముందుకెళ్తారో చెప్పలేదు . రైతులకు ఏమి చేయాలో కోరలేదు . 48 గంటల గడువు తర్వాత పెట్టిన మీటింగ్ లో అసలు బాబు గారు ఏం చెప్పారో చాలా మందికి అర్థం అయ్యుండక పోవచ్చు .
48 గంటలలో వైసీపీ నేతలు రాజీనామాలు చేసి ఎన్నికలకు పోవాలని మళ్లీ డిమాండ్ చేసిన బాబు , 48 గంటల తర్వాత జూమ్ మీటింగ్ లో సైతం మళ్లీ వైసీపీ నేతలే రాజీనామాలు చేయాలని డిమాండ్ చేస్తూ తాము రాజీనామాలు చేయమని తేల్చిచెప్పారు . వైసీపీ ప్రజల్ని మోసం చేసిందని , మాట తప్పిందని , అమరావతి ఇక్కడ నిర్మిస్తామన్న హామీ నెరవేర్చకుండా ప్రజలకు ద్రోహం చేస్తుందన్న బాబు , పనిలో పనిగా కరోనా విషయంలో కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారని , రాష్ట్రంలో కరోనా మరణాలు అత్యధికంగా ఉన్నాయంటూ గణాంకాల ప్రకారం ఉన్న జాతీయ మరణాల సగటు కన్నా రాష్ట్ర సగటు తక్కువగా ఉన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఆరోపణలు చేసారు .
అంతిమంగా రాష్ట్ర ప్రజలందరూ అమరావతి కోసం ఉద్యమించాలని , ప్రజలే అమరావతిని కాపాడుకోవాలని , ప్రజల్లో చైతన్యం రావాలని , ప్రజలే పోరాడాలని , ప్రజలు తిరుగుబాటు చేయాలని పలు పిలుపులు ఇచ్చిన బాబు , పనిలోపనిగా కేంద్రానికీ పలు విజ్ఞప్తులు చేశారు .
ఓ వైపు రాజధాని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమని దాంట్లో కేంద్రం కానీ బీజేపీ కానీ జోక్యం చేసుకోదని బీజేపీ శ్రేణులు పలుమార్లు స్పష్టం చేసిన వైనాన్ని విస్మరించిన బాబు , కేంద్రం చోద్యం చూడకుండా జోక్యం చేసుకోవాలని , ప్రజలకి ఇచ్చిన మాట నిలబెట్టాల్సిన బాధ్యత కేంద్రానికి ఉందని , ఈ రోజు రామాలయానికి పలు చోట్ల నుండి మట్టీ , నీరు తెచ్చినట్టే , ఆ రోజు అమరావతి శంఖుస్థాపనకి పార్లమెంట్ నుండి మట్టీ నీరు ఇచ్చారు కాబట్టి అమరావతిని తరలించకుండా ఆదుకోవాలని సెంటిమెంట్ తో బీజేపీని వేడుకొనే ప్రయత్నం చేశారు .
సమావేశం చివర్లో రాజీనామాల పై ఓ విలేఖరి మాట్లాడుతూ .. ప్రజాతీర్పుతో అధికారంలోకి వచ్చిన మాకు మళ్లీ తీర్పు కోరాల్సిన అవసరం ఏముందీ , ప్రజాతీర్పుని అపహాస్యం చేసేవిధంగా మేమెందుకు రాజీనాలు చేస్తాము , అమరావతి మాత్రమే అభివృద్ధి చెందాలని అన్ని ప్రాంతాల్లో ప్రజలు కోరుకొంటున్నారు అని చెబుతున్న బాబు గారే తమ పార్టీ వారి చేత రాజీనామాలు చేయించి ప్రజాభిప్రాయాన్ని నిరూపించమని వైసీపీ నేతలు అంటున్నారు దీనికి మీ సమాధానం ఏంటని ప్రశ్నించగా … వాళ్ళేం మాట్లాడుతున్నారు , హామీ ఇచ్చి మోసం చేస్తే సరిపోతుందా , వాళ్ళు రాజీనామాలు చేయాలి . అమరావతి ఉంచుతాము అని చెప్పండి , అప్పుడు చేస్తాం .కావాలంటే మా పదవులు ఇచ్చేస్తాం . ప్రజలు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది లాంటి సమాధానాలతో కాస్త తికమక పెట్టినా అంతిమంగా రాజీనామాలు చేయమని , అన్ని ప్రాంతాల ప్రజలు అమరావతిని కాపాడుకోవాలని ముక్తాయించారు .
కాగా ఏబీఎన్ లో ప్రసారమైన ఈ లైవ్ ఆద్యంతం పట్టుమని వంద మందికి మించి వ్యూయర్స్ లేకపోవడం గమనిస్తే అమరావతి అంశం పట్ల టీడీపీ శ్రేణుల్లో కూడా అనాసక్తి నెలకొంది అనిపించక మానదు .