iDreamPost
android-app
ios-app

మంచి ఛాన్స్‌.. అందిపుచ్చుకుంటారా..?

మంచి ఛాన్స్‌.. అందిపుచ్చుకుంటారా..?

మరో ఏడెనిమిది నెలల్లో పంజాబ్‌ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. 2022 ఫిబ్రవరి – మార్చిలో జరగబోయే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఎన్టీఏ నుంచి శిరోమణి అకాళిదల్‌ బయటకొచ్చింది. ఈ సారి బహుజనసమాజ్‌ వాదీ పార్టీతో కలసి పోటీ చేస్తోంది. బీజేపీ ఒంటరిగానే బరిలోకి దిగుతోంది. కాంగ్రెస్, ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌)లు కూడా ఒంటరిగానే బరిలో నిలుస్తున్నాయి.

117 అసెంబ్లీ సీట్లు ఉన్న పంజాబ్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు 59 సీట్లు అవసరం. ప్రస్తుతం కెప్టెన్‌ అమరిందర్‌ సింగ్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌పార్టీ అధికారంలో ఉంది. మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్న కాంగ్రెస్‌కు.. నేతల మధ్య నెలకొన్న వివాదం పెద్ద సమస్యగా మారింది. సీఎం అమరిందర్‌ సింగ్, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సిద్దూల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం సాగుతోంది. నూతన వ్యవసాయ చట్టాలతో బీజేపీ ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. ఇక శిరోమణి అకాళిదల్, బీఎస్పీతో పొత్తుతో ఎంత వరకు రాణిస్తుందనేది ప్రశ్నార్థకం.

పంజాబ్‌లో నెలకొన్న రాజకీయ పరిస్థితులు ఆప్‌కు కలసి వచ్చే అవకాశలు మెండుగా ఉన్నాయి. వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు ఆప్‌ అధినేత కేజ్రీవాల్‌ ఇప్పటికే పంజాబ్‌పై దృష్టి పెట్టారు. ఢిల్లిలో విజయవంతమైన గృహ అవసరాలకు ఉచిత విద్యుత్‌ హామీని పంజాబ్‌లో ప్రకటించేశారు. 2017 ఎన్నికల్లో 117 సీట్లు ఉన్న అసెంబ్లీలో కాంగ్రెస్‌ పార్టీ 77 సీట్లు గెలుచుకుంది. తొలిసారి పోటీ చేసిన ఆప్‌.. లోక్‌ ఇన్సాఫ్‌ పార్టీతో కలసి పోటీ చేసి సొంతంగా 20 సీట్లు గెలుచుకుని సత్తాను చాటింది. లోక్‌ ఇన్సాఫ్‌ పార్టీ మూడు సీట్లు గెలుచుకుంది. అంతకు ముందు అధికారంలో ఉన్న శిరోమణి అకాళిదల్‌ –బీజేపీ కూటమి కేవలం 18 సీట్లకు పరిమితం అయ్యాయి.

ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉన్న పార్టీలైన కాంగ్రెస్, ఆప్‌లు 117 సీట్లలో ఒంటరిగా పోటీ చేస్తున్నాయి. శిరోమణి అకాళిదల్‌ 97 సీట్టలో, భాగస్వామి అయిన బీఎస్పీ 20 సీట్లలో పోటీ చేస్తున్నాయి. బీజేపీ 177 సీట్లలో నిలుచుంటోంది. లోక్‌ ఇన్సాఫ్‌ పార్టీ.. స్థానిక పార్టీలతో కూటమి ఏర్పాటు చేసింది. గత ఎన్నికల్లో లోక్‌ ఇన్సాఫ్‌ పార్టీతో కలసి ఎన్నికలకు వెళ్లిన ఆప్‌.. ఈ సారి ఒంటరిగా వెళ్లేందుకు సిద్ధమవడం.. ప్రభుత్వ ఏర్పాటుపై ఆ పార్టీలో ఉన్న విశ్వాసాన్ని తెలియజేస్తోంది. స్థానిక పరిస్థితులను తనకు అనుకూలంగా మలుచుకుని.. ఆప్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే.. ఢిల్లీ తర్వాత ఆప్‌ జెండా ఎగిరిన రాష్ట్రంగా పంజాబ్‌ నిలుస్తుంది. ఏం జరుగుతుందనేది తెలియాలంటే మార్చి వరకు వేచి చూడాలి.

Also Read : కేజ్రీవాల్‌ వజ్రాయుధం అదేనా..?