iDreamPost
android-app
ios-app

చాయ్ వాలా నుంచి పీఎం దాకా.. మోదీ ప్ర‌స్థానం..!

చాయ్ వాలా నుంచి పీఎం దాకా.. మోదీ ప్ర‌స్థానం..!

దేశ రాజ‌కీయ య‌వ‌నిక‌పై ఎన్నో సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకున్నారు. వాటిలో కొన్ని వివాదాస్ప‌ద‌మూ ఉన్నాయి.. అయిన‌ప్ప‌టికీ తాను న‌మ్మిన సిద్ధాంతం కోసం ముందుకే సాగారు.. సాగుతున్నారు. ఆటుపోట్ల‌కు అద‌ర‌రు.. దేనికీ బెద‌ర‌రు. అత్యధిక కాలం ప్రధాన మంత్రిగా సేవలందించిన నాలుగో వ్యక్తిగా రికార్డులకెక్కారు. జవహర్‌లాల్‌ నెహ్రూ, ఇందిరా గాంధీ, మన్మోహన్‌ సింగ్‌ల తర్వాత కాంగ్రెసేతర ప్రధానిగా అత్యధిక కాలం పనిచేసిన ఘనతను సొంతం చేసుకున్నారు. ఆయ‌నే.. నరేంద్ర దామోదర్ దాస్ మోదీ. అలియాస్ న‌రేంద్ర మోదీ. చాయ్ వాలా నుంచి పీఎం దాకా మోదీ ప్ర‌స్థానంలో ఎన్నో సంచ‌ల‌నాలు.. కొన్ని మ‌ర‌క‌లు కూడా. గుజ‌రాత్ రాష్ట్రానికి నాలుగు సార్లు ముఖ్య‌మంత్రిగా.. సుస్థిర ఎన్డీయే పాల‌న‌కు ప‌ట్టం క‌ట్టిన ప్ర‌ధానిగా మోదీ కీర్తి అచంచ‌ల‌మైన‌ది.

అందుకే చాయ్ వాలా అయ్యారు..

1987 లో భార‌తీయ జ‌న‌తా పార్టీలో చేరిన మోదీ 2014 మే 26న తొలిసారిగా ప్రధానమంత్రి పీఠాన్ని అధిష్టించే వ‌ర‌కూ ఆయ‌న సుదీర్ఘ రాజ‌కీయ ప్ర‌యాణం చేశారు. ఆ ప్ర‌యాణంలో ఎన్నో ఎత్తు ప‌ల్లాలు చ‌విచూశారు. 1950, సెప్టెంబర్ 17న గుజరాత్‌లోని మెహ్సానా జిల్లాలోని వాద్‌నగర్‌లో ఒక మధ్యతరగతి కుటుంబంలో జ‌న్మించారు. తల్లి తండ్రులు శ్రీమతి హీరాబా మోదీ. శ్రీ దామోద‌ర్ దాస్ మోదీ. వీరికి ఆరుగురు సంతానం కాగా అందులో మూడ‌వ వారు న‌రేంద్ర మోదీ.

1967 వ‌ర‌కు వాద్‌న‌గ‌ర్‌లోనే హ‌య్య‌ర్ సెకండ‌రీ ఎడ్యుకేష‌న్ పూర్తి చేశారు. ఆ త‌రువాత 1978లో యూనివ‌ర్సిటీ ఆఫ్ ఢిల్లీలోని స్కూల్ ఆఫ్ ఓపెన్ లెర్నింగ్ నుంచి పొలిటిక‌ల్ సైన్స్‌లో బ్యాచిల‌ర్స్ డిగ్రీ పొందారు. ఆ త‌రువాత 1983లో గుజ‌రాత్ యూనివ‌ర్సిటీ నుంచి డిస్ట‌న్స్‌లో పొలిటిక‌ల్ సైన్స్‌లో మాస్ట‌ర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ పొందారు. స‌మాజంలోని అట్ట‌డుగు వ‌ర్గాల నుండి వ‌చ్చిన కుటుంబం కావ‌డంతో జీవితం గ‌డ‌వ‌డానికి ఎంత‌గానో క‌ష్ట‌ప‌డ్డారు. కుటుంబం మొత్తం ఒక చిన్న ఇంట్లో ఉండే వారు. మోడీ తండ్రి స్థానిక రైల్వే స్టేష‌న్‌లో ఏర్పాటు చేసుకొన్న‌ టీ స్టాల్‌లో టీ ని విక్ర‌యించే వారు. చిన్న‌ప్పుడు నరేంద్ర మోడీ త‌న తండ్రి ఏర్పాటు చేసిన టీ స్టాల్‌లో ఆయ‌న‌కు సహాయ‌ప‌డుతూ ఉండేవారు. ఆ త‌రువాత అక్క‌డే సొంతంగా టీ స్టాల్‌ను మోడీ ఏర్పాటు చేసుకుని న‌డిపాడు. అందుకే ఆయన చాయ్ వాలా అయ్యారు.

విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలు

అయితే స్కూల్‌, కాలేజీ రోజుల్లోనే మోదీ అప్ప‌టి దేశ ప‌రిస్థితులు, రాజ‌కీయాలు, ఇత‌ర అంశాల‌పై త‌న తోటి విద్యార్థులతో నిర్వ‌హించే డిబేట్ల‌లో అన‌ర్గ‌ళంగా మాట్లాడేవారు. ఆయ‌నకు ఆ ప‌రిజ్ఞానం బాగా ఉండేది. అన్ని అంశాల‌పై ఆయ‌న బాగా అవ‌గాహ‌న క‌లిగి ఉండేవారు. అలాగే స్కూల్ రోజుల్లో వేసిన ప‌లు నాట‌కాల్లోనూ ఆయ‌న రాజ‌కీయ నాయ‌కుల పాత్ర‌ల‌లో మెప్పించారు. దీంతో ఆయ‌న‌లో నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలు ఉన్నాయ‌ని అధ్యాప‌కులు అప్ప‌ట్లోనే గ్ర‌హించారు. విద్యార్థి దశలో ఉన్నప్పుడే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తు నాయకుడిగా పనిచేశారు. ఆ తర్వాత రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క్ సంఘ్ (ఆర్ఎస్ఎస్‌)లో మొద‌ట‌గా చేరి, అటు నుంచి బీజేపీలో సాధార‌ణ కార్య‌క‌ర్త స్థాయి నుంచి కీల‌క బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించే ప‌ద‌వుల్లో చేరి.. ఆ త‌రువాత గుజ‌రాత్ సీఎం అయి, అక్క‌డి నుంచి.. దేశ రాజ‌కీయాల వైపు మ‌ళ్లి ప్రధాని అయ్యారు.

వ‌ర‌స‌గా నాలుగు సార్లు..

2001లో కేశూభాయి పటేల్, ఉప ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయడంతో నరేంద్ర మోదీకి అధికార పగ్గాలు లభించాయి. ఆయన వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన ఆయన..2001-14 కాలంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా కొనసాగారు. వరుసగా మూడు సార్లు గుజరాత్ సీఎంగా గెలిచి హ్యాట్రిక్ సీఎంగా పేరు తెచ్చుకున్నారు. అలాగే 2012 శాసనసభ ఎన్నికలలో విజయభేరి మ్రోగించి వరుసగా నాల్గవసారి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు.

ప్రధానిగా ప్రస్థానం

2014 సార్వత్రిక ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎన్డీఏను విజయపథంలో నడిపించి పూర్తి మెజారిటీ సాధించిపెట్టి 2014 మే 26న ప్రధానమంత్రి పీఠంపై అధిష్టించారు. సంచలన నిర్ణయాలు తీసుకుంటూ దేశాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నారు. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి, ప్రధాన మంత్రి ఉజ్వల యోజన,శ్రమయోగి మాన్ ధన్ యోజన, ఆరోగ్య సంరక్షణ కార్యక్రమం ఆయుష్మాన్ భారత్, ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన, జన్ సురక్ష, పిఎం కిసాన్ సమ్మాన్ నిధి, మేక్ ఇన్ ఇండియా, యోగా దివస్ వంటి పథకాలతో ప్రజలకు మరింత చేరువ అయ్యారు. తిరిగి 2019 ఎన్నికలలో గెలిచి రెండో సారి ప్రధానమంత్రిగా కొనసాగుతున్నారు.

సంచ‌ల‌న నిర్ణ‌యాల్లో కొన్ని..

2014 మే 26న నరేంద్రమోదీ భారతదేశ 15వ ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ పలు నిర్ణయాలు, పాలసీలు అమలు చేశారు. వాటిలో 500, 1000 రూపాయల నోట్ల రద్దు, జీఎస్టీ అమలు, అధికరణ 370 రద్దు, మూడు సార్లు తలాక్ రద్దు, పారసత్వం సవరణ చట్టం (CAA), జాతీయ పౌర జాబితా(NRC) అమలు వంటివి ఉన్నాయి. 2019 ఎన్నికలలో మ‌ళ్లీ గెలిచి ప్రధానమంత్రి అయిన త‌ర్వాత నిర్ణ‌యాల అమ‌లులో వేగం పెంచారు. కొన్ని సాహ‌సోపేత‌మైన నిర్ణ‌యాలు తీసుకుని దేశ రాజకీయాల్లో చెరగని ముద్రను వేసుకున్నారు. అయితే.. దేశ ఆర్థిక ప్ర‌గ‌తి మంద‌గించ‌డానికి నోట్ల ర‌ద్దు ఓ కార‌ణ‌మ‌ని, అందుకు మోదీయే కార‌ణ‌మ‌నే అప‌వాదు ఉంది.

లాక్ డౌన్ కాలంలో…

మోదీ రాజ‌కీయ జీవితంలో క‌రోనా కాలం ప్ర‌త్యేకంగా ఉండిపోతుంద‌నడంలో అతిశ‌యోక్తి కాదు. క‌రోనా క‌ట్ట‌డి కోసం మొట్ట‌మొద‌టి సారిగా లాక్ డౌన్ ప్ర‌క‌టించిన విధానం ప్ర‌శంస‌లందుకుంది. ప్ర‌జ‌ల్లో ధైర్యాన్ని నింపుతూ.. క‌రోనా నివార‌ణ‌కు సూచన‌లు ఇస్తూ త‌న‌దైన శైలిలో న‌డిపించారు. అంచ‌లంచెలుగా లాక్ డౌన్ పొడిగించుకుంటూ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించారు. అయిన‌ప్ప‌టికీ కేసుల సంఖ్య‌లో అగ్ర స్థానానికి చేరుకోవ‌డం ఆందోళ‌న‌క‌ర‌మే. ఇదిలా ఉండ‌గా అక‌స్మాత్తుగా లాక్ డౌన్ ప్ర‌క‌టించ‌డం కొంచెం వివాదాస్ప‌ద‌మూ అయింది. ఎక్క‌డివారు అక్క‌డే చిక్కుకుపోవ‌డం ఇబ్బందుల‌ను తెచ్చింది. ప్ర‌ధానంగా వ‌ల‌స కార్మికుల అవ‌స్థ‌లు అన్నీ ఇన్నీ కావు. త‌ర్వాత వారి కోసం ప్ర‌త్యేక రైళ్ల‌ను న‌డిపి మ‌ర‌క‌ను చెరిపేసుకునే ప్ర‌య‌త్నం చేశారు. అలాగే లాక్ డౌన్ అనంత‌రం ఆత్మ నిర్భ‌ల్ భార‌త్ పేరుతో లాక్ డౌన్ తెచ్చిన ఆర్థిక న‌ష్టాల‌ను పూడ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. దేశాన్ని మ‌ళ్లీ ఆర్థికంగా బ‌లోపేతం చేసేందుకు శాయ‌శ‌క్తులా కృషి చేస్తున్నారు.

నేడు న‌రేంద్ర మోదీ జ‌న్మ‌దినోత్స‌వం సంద‌ర్భంగా..