iDreamPost
iDreamPost
దేశ రక్షణలో విశేషంగా సేవ చేస్తున్న వారికి అందించే పెన్షన్ల ఖర్చు తగ్గించుకునే దిశలో కేంద్రం అడుగులు వేస్తోంది. దానికి తగ్గట్టుగానే తాజాగా సైన్యాధిపతి బీపీ రావత్ పేరుతో విడుదల నోట్ ఒకటి హల్ చల్ చేస్తోంది. అక్టోబర్ 29 నాడు విడుదల అయిన నోట్ ప్రకారం పదవీ విరమణ, పెన్షన్ అర్హతల్లో మార్పుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలుస్తోంది.
ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ మూడు విభగాల్లోని సమాన హోదాల్లో ఉన్న వారికి ఇవి వర్తిస్తాయని నోట్ లో పేర్కొన్నారు. దాని ప్రకారం కల్నల్ పదవీ విరమణ వయస్సు (మెడికల్ మరియు నర్సింగ్ విభాగాల్లో ఉన్న వారు మినహా) ప్రస్తుతం 54గా ఉంది. దానిని 57 సంవత్సరాలకు పెంచే యోచనలో ఉన్నారు.
బ్రిగేడియర్ల పదవీ విరమణ వయస్సు ప్రస్తుత 56 సంవత్సరాల నుండి 58 సంవత్సరాలకు పెంచే ప్రతిపాదన చేశారు. మేజర్ జనరల్స్ ప్రస్తుత 58 నుండి 59 కి పెంచాలని ప్రతిపాదించబడింది. లెఫ్టినెంట్ జనరల్ ర్యాంకులో ఎటువంటి మార్పు ప్రతిపాదించబడలేదు, ఇది 60 సంవత్సరాలుగా కొనసాగుతుంది.
జూనియర్ కమీషన్డ్ ఆఫీసర్స్ (JCO లు) మరియు ఇతర ర్యాంకులు (OR లు) పదవీ విరమణ 57 సంవత్సరాలు కావాలని ప్రతిపాదించబడింది. OR లు ప్రస్తుతం 17 సంవత్సరాల సేవ తర్వాత పదవీ విరమణ చేయాల్సి వస్తోంది.
ప్రస్తుతం ఈ నోట్ మీద సైనిక విభాగాల్లో తీవ్ర ఆందోళనకు ప్రధాన కారణం పెన్షన్ సదుపాయాల్లో మార్పులుకు ప్రతిపాదన చేయడమే. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం 20 సం.ల సర్వీసు చేసిన అధికారి ప్రస్తుతం తన చివరి వేతనంలో 50 శాతం పెన్షన్ గా లభిస్తోంది. కానీ దానిని 25 సం.లు నిండి సర్వీసు అందించిన వారికి మాత్రమే వర్తింపజేయాలని ప్రతిపాదించారు. 20 సం.ల కే రిటైర్ అయితే వారికి 25శాతం పెన్షన్ మాత్రమే దక్కుతుంది. దాని ప్రకారం ఎవరైనా అధికారి ప్రస్తుతం 20 సం.లు నిండి లక్ష రూపాయల వేతనంతో పీఎంఆర్ తీసుకుంటే ఆయనకు రూ. 50లుగా ఉండాల్సిన పెన్షన్ ఇకపై కేవలం రూ. 25వేలు మాత్రమే దక్కుతుంది.
26-30 సంవత్సరాల సర్వీసు ఉన్నవారికి 60 శాతం పెన్షన్, 31-35 సంవత్సరాల సర్వీసు ఉన్నవారికి 75 శాతం పెన్షన్ లభిస్తుందని పేర్కొన్నారు. ప్రతిపాదిత మార్పుల ప్రకారం పిఎంఆర్ తీసుకుంటే 35 ఏళ్లు పైబడిన సర్వీసు ఉన్నవారికి మాత్రమే పూర్తి పెన్షన్ లభిస్తుంది. మిగిలిన వారికి పెన్షన్లలో కోత తప్పేలా లేదు. దేశరక్షణలో ఉన్న వారికి అందిస్తున్న పెన్షన్ల వ్యయంలో కోత కోసే ప్రతిపాదనలో భాగంగానే ఇలాంటి ఆలోచన చేస్తున్నారనే ఆందోళన సంబంధిత వర్గాల్లో వినిపిస్తోంది.
డిఫెన్స్ మేనేజ్ మెంట్ అథారిటీ ప్రతిపాదించించిన ఈ మార్పులపై పలు అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. నియమకాలపై దాని ప్రభావం ఉంటుందని కూడా అంటున్నారు. రక్షణ శాఖ చేస్తున్న వ్యయంలో పెన్షన్లకు పెద్ద మొత్తంలో వెచ్చించాల్సిన రావడంతోనే ఇలాంటి నిర్ణయానికి ప్రతిపాదనలు చేస్తున్నారని అంటున్నారు.
పదవీ విరమణ వయస్సును పెంచడం ద్వారా ఖర్చులను తగ్గించడం లక్ష్యంగా కనిపిస్తోంది.
ఆర్మీలో రిటైర్మెంట్ తర్వాత తిరిగి ఉపాధి అవకాశాలపై ఇది దెబ్బతీస్తుందని అంటున్నారు. కెప్టెన్లు మరియు మేజర్ల స్థాయిని కలిగి ఉన్న నియామకాల్లో అధిక అర్హత కలిగిన అధికారులు వివిధ స్థాయిలలో నియామకాలు పొందుతున్నారు. కానీ ప్రస్తుతం రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం రిటైర్మెంట్ వయసు పెంపుదల మూలంగా ఆర్మీ నుంచి బయటకు వచ్చిన తర్వాత మరో ఉపాధి కోసం చేసే ప్రయత్నాలపై ప్రభావం పడుతుందని కూడా చెబుతున్నారు. పెరిగిన జీవన ప్రమాణాల రీత్యా ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నట్టు సర్క్యులేట్ అవుతున్న పత్రంలో పేర్కొన్నారు.
వాస్తవానికి ఆర్మీ జవాన్లు రిటైర్మెంట్ విషయంలో అనేక అంశాలు ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా అత్యంత క్లిష్ల పరిస్థితుల మధ్య విధులు నిర్వహించే వారికి శారీరక, మానసిక సమస్యలు మూలంగా రిటైర్మెంట్ కి ప్రాధాన్యతనిస్తారు. కానీ ఇప్పుడు రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావాలంటే రిటైర్మెంట్ వయసు పెంచాలని కేంద్రం ఆలోచన చేస్తున్న రీత్యా వారు ఎక్కువ కాలం సర్వీసులు కొనసాగాల్సి ఉంటుంది. దాని మూలంగా ఓవైపు కొత్త వారికి అవకాశాలు రాకపోవడం, రెండోవైపు సరిహద్దు దళాల్లో వయసు ప్రభావం కూడా ఉంటుందనే వాదనలున్నాయి. ఏమయినా దేశభక్తి, వీర జవాన్లు అంటూ మీడియాలో పెద్ద స్థాయిలో ప్రచారం చేసుకునే మోడీ ప్రభుత్వం ఇలాంటి మార్పులకు పూనుకోవడం మాత్రం భద్రతా దళాల్లో అసంతృప్తికి దారితీసే అవకాశాలున్నాయని అంచనాలేస్తున్నారు.