iDreamPost
android-app
ios-app

కుట్ర‌లు చేస్తున్నారు సార్.. కేసీఆర్ లేఖ‌..!

కుట్ర‌లు చేస్తున్నారు సార్..  కేసీఆర్ లేఖ‌..!

వ‌రి కొనుగోలు అంశంపై కేంద్రానికి వ్య‌తిరేకంగా పోరాటం మొద‌లుపెట్టిన తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్.. రైతులు, వ్య‌వ‌సాయ‌రంగమే కీల‌కంగా ఆందోళ‌న‌లు కొన‌సాగిస్తున్నారు. తాజాగా ఎరువుల ధ‌ర‌ల పెంపు నిర్ణ‌యంపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. రైతుల ఆదాయాన్ని 2022 కల్లా రెట్టింపు చేస్తామని గొప్పలు చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఎరువుల ధరలు విపరీతంగా పెంచి దేశ రైతాంగం యొక్క నడ్డి విరిచిందని మండిపడ్డారు. బీజేపీ సర్కార్.. దేశంలో రైతులను బతకనిచ్చేట్లుగా లేదని తీవ్రంగా స్పందించారు. అంతేకాదు.. మోడీకి ఓ లేఖ కూడా రాశారు.

పెరిగిన ఎరువుల ధరలు తగ్గించాలని లేఖలో కోరారు. ఆరేళ్లలో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని 2016లో హామీ ఇచ్చారని… ఐదేళ్లు గడిచినా రైతుల ఆదాయం రెట్టింపు అయ్యే పరిస్థితి కనిపించడం లేదని లేఖలో సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. రైతాంగం తీవ్ర నష్టాల్లో ఉందని.. ఇలాంటి సమయంలో ఎరువుల ధరలు 50 నుంచి 100 శాతం పెరగడం సరికాదని కేసీఆర్ అభిప్రాయపడ్డారు.

ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అనేక రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుందని… వ్యవసాయాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు కుట్రలు చేస్తున్నారని లేఖలో కేసీఆర్ ఆరోపించారు. గత ఐదేళ్లలో ఇన్‌ఫుట్ కాస్ట్ రెట్టింపు అయినట్లు లేఖలో గుర్తుచేశారు. ఎరువులు, పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం తప్ప రైతులకు వచ్చిన ఆదాయమేమీ లేదని కేసీఆర్ అన్నారు. ఎరువులపై సబ్సిడీ ఇవ్వాలని దేశంలో కోట్లాది మంది రైతుల తరపున కోరుతున్నట్లు లేఖలో కేసీఆర్ తెలిపారు. నరేగాతో వ్యవసాయాన్ని అనుసంధానం చేయాలని తెలంగాణ ప్రభుత్వం తీర్మానం పంపినా కేంద్రం నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదని కేసీఆర్ పేర్కొన్నారు.

కరెంటు మోటార్లు బిగించి బిల్లులు వసూలు చేయడం, ఎన్‌ఆర్‌జీఈ ని వ్యవసాయానికి అనుసంధానం చేయమంటే చేయకుండా నాన్చడం, విపరీతంగా ఎరువుల ధరలు పెంచడం, రైతులు తాము పండించిన ధాన్యాన్ని కూడా కొనకుండా దుర్మార్గపు చర్యలకు పూనుకోవడం వెనక భారీ కుట్ర దాగి వుందన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. రైతులను వారి పొలాల్లో వారినే కూలీలుగా మార్చే కుట్రలను ఎదుర్కోవాలని, నాగ‌లి ఎత్తాల‌ని రైతాంగానికి పిలుపునిచ్చారు.