Idream media
Idream media
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను వ్యతిరేకించేందుకు కొన్ని బీజేపీయేతర ప్రభుత్వాలు కూడా వెనుకంజ వేస్తున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలను పప్పుబెల్లాల్లా అమ్మేస్తున్నా పట్టించుకోవడం లేదు. కానీ.. ఏపీలో విశాఖపట్నం ఉక్కు కర్మాగారం విక్రయాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. కేంద్ర తీరుకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసి పంపింది. వైసీపీ ఎంపీలు కార్మికులకు మద్దతుగా ప్రత్యక్ష ఆందోళనల్లో పాల్గొనడమే కాదు.. పార్లమెంట్ లోనూ నిరసన స్వరం వినిపిస్తున్నారు.
అయితే రాష్ట్రానికే చెందిన బీజేపీ నాయకులు మాత్రం విశాఖ ఉక్కును అమ్మేస్తున్నా.. నోరు విప్పడం లేదు. పైగా.. పురందేశ్వరి వంటివారు అమ్మేయడం మంచిదే అన్నట్లుగా మాట్లాడుతున్నారు. కానీ అనూహ్యంగా కేంద్రంలో మంత్రిగా ఉన్న రామ్దాస్ అథావలే మాత్రం విశాఖ ఉక్కు విక్రయంపై నిరసన స్వరం వినిపించడం చర్చనీయాంశంగా మారింది. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేట్ పరం చేయాలని కేంద్రం తెగ ఉవ్విళ్ళూరుతున్న సమయంలో కేంద్ర క్యాబినేట్ మంత్రిగా ఉన్న రామ్ దాస్ అథవాలే ఈ పరిశ్రమను ప్రైవేట్ పరం చేయడం తప్పని చెప్పడం ఆసక్తిగా మారింది. రెండు రోజుల పాటు విశాఖలో పర్యటించిన ఆయన.. విశాఖ ఉక్కుపై సంచలన కామెంట్లు చేశారు. మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన తప్పుబట్టారు.
Also Read : 3 Capitals – Centrel Minister Ramdas -మూడు రాజధానులపై రాందాస్ వ్యాఖ్యలు టీడీపీ నేతలనెందుకు కలవరపరుస్తున్నాయి
ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవెట్ పరం చేస్తే ఎస్సీ ఎస్టీలకు రిజవేషన్లతో పాటు ఎన్నో అవకాశాలు పూర్తిగా పోతాయని అథావలే ఆందోళన వ్యక్తం చేయడం సంచలనంగా మారింది. ఇది.. రాష్ట్ర స్థాయిలోనే కాకుండా.. జాతీయ స్థాయిలోనూ సంచలనంగా మారడం గమనార్హం. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుకు ధారదత్తం చేస్తే.. ఉపాధి అవకాశాలు బడుగులకు దక్కవని అథావలే అభిప్రాయపడ్డారు. అంటే ఉక్కు ప్రైవేట్ పై దూకుడు కొందరు కేంద్ర మంత్రులకు అసలు సహించలేని విషయంగా ఉందని అర్ధమవుతోంది. అయితే రామ్ దాస్ అథవాలే దీని మీద మాట్లాడుతూ ప్రైవేట్ రంగంలో ఉక్కు వంటివి వెళ్లినా ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు అమలు అయ్యేలా చూస్తామని హామీ మాత్రం ఇచ్చారు.
మొత్తానికి కేంద్రం తీసుకుంటున్న చర్యలకు ఇన్నాళ్ళూ విపక్షాల నుంచి అది కూడా ఒకటి రెండు పార్టీల నుంచి కామెంట్లు వినిపించినా.. ఇపుడు ఏకంగా కేంద్ర మంత్రి ఈ జాబితాలో చేరడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అయితే.. ఇక్కడ కొసమెరుపు ఏంటంటే.. అథావలే.. బీజేపీ నాయకుడు కాదు. ఆయన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాకు అధ్యక్షుడు. అంటే.. సొంతపార్టీ ఉంది. మహారాష్ట్ర కు చెందిన అథావలే.. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఈ పార్టీ.. బీజేపీకి మద్దతిస్తోంది. అంటే..ఎన్డీయే భాగస్వామ్య పార్టీగా ఉంది. మరి ఈ నేపథ్యంలో అథావలే చేసిన కామెంట్లను బీజేపీ నేతలు ఎలా చూస్తారో చూడాలి.
Also Read : Lakhimpur Kheri – కేంద్ర మంత్రిపై వేటు తప్పదా?