iDreamPost
android-app
ios-app

ఏపీకి ప్రత్యేకహోదా దిశగా కేంద్రం అడుగులు, ఫలించిన జగన్ ఒత్తిడి

  • Published Feb 12, 2022 | 6:33 AM Updated Updated Feb 12, 2022 | 6:33 AM
ఏపీకి ప్రత్యేకహోదా దిశగా కేంద్రం అడుగులు, ఫలించిన జగన్ ఒత్తిడి

ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా అంశం దాదాపు కలగా భావిస్తున్న దశలో అనూహ్య నిర్ణయం వెలువడింది. కేంద్రం ఆసక్తికరంగా స్పందించింది. హోదా కి అనుగుణంగా ఓ అడుగువేసింది. ఏడున్నరేళ్లుగా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఆశిస్తున్న హోదా విషయమై చర్చకు మోదీ సర్కారు సిద్ధమైంది. ఈనెల 17న విభజన చట్టం, హామీలు అమలుపై మాట్లాడుదాం అంటూ పిలుపునిచ్చింది. ఏపీ, తెలంగాణ ప్రధాన కార్యదర్శులతో పాటుగా ఇతర అధికారులకు సమాచారం అందించారు. 

2013 ఫిబ్రవరిలో విభజన చట్టం ఆమోదం పొందింది. చట్టం ఆమోదించిన తీరు మీద ప్రధాని మోదీ సహా పలువురికి అభ్యంతరాలు ఉన్నాయి. తాజాగా పార్లమెంట్ వేదికగా మోదీ తన మనసులోమాట మరోసారి బయటపెట్టారు. ఇప్పటికే తల్లిని చంపి బిడ్డను తీశారని ఆయన పేర్కొన్నారు. ఆనాడు ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్ ఏపికి ఐదేళ్లపాటు ప్రత్యేకహోదా కల్పిస్తూ ప్రకటన చేశారు. దానిని చట్టంలో పేర్కొనలేదంటూ అమలు చేయలేదు. విభజన జరిగి ఏడున్నరేళ్లుగా అనేకమార్లు ఏపీ వాసులు ఆందోళన చేసిన కేంద్రం కనికరించలేదు. ఐదేళ్లుగా పదేళ్లు ప్రత్యేక హోదా అని చెప్పిన బీజేపీ మాట తప్పిందనే అభిప్రాయం సర్వత్రా ఉంది. 

దీనిపై చంద్రబాబు కప్పదాట్లు ఏపీకి అన్యాయం చేశాయని జగన్ విమర్శించారు. హోదాకి బదులుగా ప్యాకేజ్ కి అంగీకరించి రాష్ట్ర ప్రజల ఆశలపై నీళ్లు జల్లారని మండిపడ్డారు. అంతేగాకుండా తాను సీఎం అయిన నాటి నుంచి కేంద్రంమీద ఒత్తిడి తెస్తూనే ఉన్నారు. ఇటీవల ప్రధానిని కలిసినప్పుడు, దానికి ముందు తిరుపతిలో జరిగిన సదరన్ కౌన్సిల్ లో సైతం హోమ్ మంత్రి సమక్షంలో హోదాకోసం డిమాండ్ చేశారు. పార్లమెంట్ లో తాజాగా వైసీపీ నేతలు కేంద్రాన్ని నిలదీశారు. ఈ పరిణామాల నేపథ్యంలో తొలిసారిగా హోదా కోసం చర్చకు కేంద్రం సిద్ధంకావడం ఆసక్తిగామారింది. కీలక దిశగా ఈ పరిణామాలు సాగే అవకాశం కనిపిస్తోంది. ఏపీకి హోదా ఖాయమనే అంచనాలు చిగురిస్తున్నాయి.

త్రీమెన్ కమిటీఏర్పాటు కావడం శుభసూచికగా పలువురు భావిస్తున్నారు.కేంద్ర హోంశాఖ జాయింట్‌ సెక్రటరీ నేతృత్వంలో సమావేశం జరగబోతోంది. పరిష్కారం కాని విభజన సమస్యలపై కేంద్ర హోంశాఖ ఈ సమావేశం నిర్వహిస్తుండడం విశేషం.ఈనెల 8న జరిగిన సమావేశంలో కమిటీ ఏర్పాటు చేసినట్టు కేంద్ర హోంశాఖ వెల్లడించింది.కమిటీలో సభ్యులుగా ఏపీ నుంచి ఎస్‌.ఎస్‌.రావత్‌, తెలంగాణ నుంచి రామకృష్ణారావు ఉన్నారు.ఈనెల 17న ఉ. 11 గం.కు కమిటీ తొలి భేటీ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు.వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశం జరుగుతుంది.రెండు రాష్ట్రాల మధ్య పరిష్కారం కాని అంశాలపై ప్రధానంగా చర్చ సాగబోతోంది.

ఏ అంశాలు చర్చించాలన్న దానిపై అధికారులకు కేంద్ర హోంశాఖ సమాచారం అందించింది.షెడ్యూల్‌ 9, 10లోని సంస్థల విభజన, ఆస్తుల పంపకాలు, ఇరువురి మధ్య నెలకొన్న ఆర్థికపరమైన అంశాలపై చర్చ ఉంటుంది.

ఏపీ పునర్విభజన చట్టంతో పాటు పలు అంశాలపై చర్చకు రావాలని లేఖలో పేర్కొన్నారు.ప్రధానంగా తొమ్మిది అంశాలపై సమావేశంలో చర్చలు జరపాలని తెలిపారు.ఏపీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ విభజన, విద్యుత్ వినియోగ అంశాలు, పన్ను అంశాల్లో సవరణలు, ఏపీఎస్‌సీఎస్‌ఎల్‌,టీఎస్‌సీఎస్‌సీఎల్‌ సంస్థల్లో నగదు అంశం,వనరుల సర్దుబాటు, 7 వెనుకబడిన జిల్లాల్లో అభివృద్ధి నిధుల అంశంతో పాటుగా ప్రత్యేక హోదాని కూడా వాటిలో చేర్చారు.