iDreamPost
android-app
ios-app

బంద్ స‌క్సెస్ తో ప్లాన్ బీ బాట‌లో బీజేపీ?

బంద్ స‌క్సెస్ తో ప్లాన్ బీ బాట‌లో బీజేపీ?

నూత‌న వ్య‌వ‌సాయ చ‌ట్టాలను రూపొందించిన‌ప్ప‌టి నుంచీ భారతీయ జ‌న‌తా పార్టీకి ఏదో రూపంలో నిర‌స‌న‌ల తాకిడి త‌గులుతూనే ఉంది. ఢిల్లీలో రైతు మ‌హోద్య‌మం నేటికీ కొన‌సాగుతూనే ఉంది. చ‌ట్టాలు ఉప‌సంహ‌రించే వ‌ర‌కు ఆపేది లేద‌ని రైతు సంఘాలు స్ప‌ష్టం చేస్తున్నాయి. ప‌ది సార్ల‌కు పైగా రైతుల‌తో కేంద్రం చ‌ర్చ‌లు జ‌రిపినా ఆ అంశం కొలిక్కి రాలేదు. ఈ ఏడాదిలో జ‌రిగిన ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల్లో ఇత‌ర అంశాల‌తో పాటు రైతు చ‌ట్టాల ప్ర‌భావం కూడా బీజేపీపై ప‌డింద‌న్న అభిప్రాయాలు వ్య‌క్తం అయ్యాయి. అనంతరం రైతుల‌తో మ‌ళ్లీ చ‌ర్చ‌ల‌కు సిద్ధ‌మంటూ కేంద్ర పెద్ద‌లు సంకేతాలు పంపినా.. ఇప్ప‌టి వ‌ర‌కు అది కార్యరూపం దాల్చ‌లేదు. ఇదిలా ఉండ‌గా.. నూత‌న రైతు చ‌ట్టాలకు నిర‌స‌న‌గా.. సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపు మేర‌కు భార‌త్ బంద్ కొన్ని రాష్ట్రాల్లో విజ‌య‌వంత‌మైంది. అందులో వ‌చ్చే ఏడాదిలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న కొన్ని రాష్ట్రాలు కూడా ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో ఏదో ఒక‌టి చేయ‌క‌పోతే.. ఆ ఎన్నిక‌ల్లో కూడా ప‌రాభ‌వం త‌ప్ప‌ద‌న్న అభిప్రాయాలు పార్టీలో వ్య‌క్తం అవుతున్నాయి.

ఏం చేద్దాం..?

సాధార‌ణంగా భార‌త్ బంద్ అనే దాన్ని ప్ర‌జ‌లు పెద్ద‌గా ప‌ట్టించుకోరు. సంబంధిత ఇష్యూ ప్ర‌భావిత రాష్ట్రాల‌లో మాత్రం విజ‌య‌వంతం అవుతూ ఉంటుంది. కానీ రైతు సంఘాలు ఇచ్చిన పిలుపున‌కు మెజార్టీ రాష్ట్రాలు బాగానే స్పందించాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం కూడా రైతుల‌కు మ‌ద్ద‌తు ఇచ్చింది. ఇదిలా ఉంటే.. ప్ర‌ధానంగా ఉత్తరాది రాష్ట్రాల్లో బంద్ సక్సెస్ అవ్వటం బీజేపీకి బాగా ఇబ్బందిగా మారింది. దక్షిణాది రాష్ట్రాల్లో కూడా బంద్ పాక్షికంగా విజయం సాధించింది. వ్యవసాయరంగానికి సంబంధించి నరేంద్రమోడి సర్కార్ రూపొందించిన మూడు నూతన చట్టాలకు వ్యతిరేకంగా గడచిన పదినెలలుగా భారతీయ కిసాన్ సంఘ్ నాయకత్వంలో ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. ఆందోళ‌న‌లో భాగంగా సంఘ్ ఇచ్చిన బంద్ విజ‌య‌వంతంపై బీజేపీలో చ‌ర్చ జ‌రుగుతోంది. నూత‌న చ‌ట్టాల సెగ ను చ‌ల్లార్చేందుకు ఏం చేద్దామ‌ని పార్టీ పెద్ద‌లు మంత‌నాలు జ‌రుపుతున్న‌ట్లు తెలుస్తోంది.

రాష్ట్రాల‌ వారీగా స‌మీక్ష‌?

ఈ చ‌ట్టాల‌పై వెన‌క్కి త‌గ్గితే మ‌రిన్ని నిర్ణ‌యాల‌పై ఆ ప్ర‌భావం ఉంటుంద‌నే నేప‌థ్యంలో బీజేపీ పెద్ద‌లు ప్లాన్ బీని రూపొందిస్తున్న‌ట్లుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇందులో భాగంగా రైతు ఉద్య‌మ ప్ర‌భావం ఎక్క‌డ ఎక్కువ ఉంద‌నే దానిపై ప‌రిశీల‌న‌కు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు తెలుస్తోంది. దాన్ని బ‌ట్టి ఆయా రాష్ట్రాల‌లో ప్ర‌త్యామ్నాయ విధానాల‌ను అవ‌లంబించాల‌నేది బీజేపీ ప్లాన్ గా ప‌రిశీల‌కులు భావిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ పంజాబ్ హర్యానాలోని రైతు సంఘాల ఆధ్వర్యంలో వేలాదిమంది రైతులు దాదాపు పదినెలలుగా తమ ఊళ్ళను కుటుంబాలను పొలాలను వదిలేసి ఢిల్లీ శివార్లలో ఉద్యమం చేస్తున్నారు. దీంతో బీజేపీ అగ్రనేతలను ఆ టెన్ష‌న్ వెంటాడుతోంది. దీంతో ప్ర‌త్యామ్నాయ మార్గాల‌నే అన్వేషిస్తోంది.

ఇప్పటికే స్థానిక ఎన్నిక‌ల‌పై ఎఫెక్ట్

వచ్చే ఏడాదిలోనే పంజాబ్, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. రైతు ఉద్యమాలు ఎంతగా విజయం సాధిస్తే బీజేపీకి అంత ఇబ్బంది అన్న విషయం తెలిసిందే. రైతు సంఘాల ఆందోళన దెబ్బకు యూపీ, పంబాజ్ లో ఈమధ్యనే జరిగిన స్ధానిక సంస్ధల ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది. యూపీలో అయినా పర్వాలేదు కానీ పంజాబ్ లో అయితే నామినేషన్లు వేయటానికి కూడా బీజేపీ నేతలు చాలా ఇబ్బందులు పడాల్సొచ్చింది. ఈ కారణంగానే పంజాబ్ ఎన్నికల్లో కాంగ్రెస్ స్వీప్ చేసేసింది. అన్నింటికన్నా ముఖ్యమైన సమస్య ఏమిటంటే రైతుల ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తున్న రాకేష్ తికాయత్ ది ఉత్తరప్రదేశే. పైగా తికాయత్ జాట్ సామాజికవర్గానికి చెందిన నేత. ఇపుడు జాట్లంతా బీజేపీ అంటేనే మండిపోతున్నారు. పోయిన ఎన్నికల్లో బీజేపీకి అంతటి అఖండ విజయం దక్కిందంటే జాట్ల మద్దతు సంపూర్ణంగా దక్కటమే. అలాంటి జాట్లే ఇపుడు బీజేపీకి ఎదురుతిరిగారు.

ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో బీజేపీ పెద్ద‌లు వ్యూహ‌ప్ర‌తివ్యూహాల్లో బిజీగా గ‌డుపుతున్నారు. ఎప్పుడైతే రైతు ఉద్యమం మొదలైందో అప్పటినుండే బీజేపీ నేతల్లో టెన్షన్ మొదలైంది. ఉద్యమ ప్రభావం అసెంబ్లీ ఎన్నికలపై పడుతుందని అనుమానిస్తున్నారు. ఈ క్ర‌మంలో కొత్త మార్గాల‌ను అన్వేషిస్తున్నారు. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న కొద్దీ ఈ చ‌ట్టాల‌పై ఎటువంటి నిర్ణ‌యం తీసుకుంటారో వేచి చూడాలి.