Dharani
Dharani
మనలాంటి అధిక జనాభా ఉన్న దేశంలో.. చదువు పూర్తి చేసుకున్న వెంటనే ఉద్యోగం రావడం అంటే మాటలు కాదు. చాలా మంది.. డిగ్రీ, పీజీ పూర్తయిన తర్వాత.. ఎంట్రెన్స్ ఎగ్జామ్స్, ప్రభుత్వ ఉద్యోగాల కోసం శిక్షణ తీసుకుంటూ ఉంటారు. ఇక ఇలాంటి కోచింగ్‌లకు ఎన్ని డబ్బులు ఖర్చవుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వేలకు వేలు కోచింగ్ సెంటర్లకు ఫీజు రూపంలో చెల్లించాలి. కోచింగ్ కోసం హాస్టల్, రూమ్‌లో ఉండటం వంటి అదనపు ఖర్చులు కూడా తోడవుతాయి. దాంతో చదువు అయ్యాక యువతీయువకులు ఉద్యోగం సాధించాలంటే.. భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. మరి పేద, మధ్యతరగి జనాలు ఇంత ఖర్చు భరించగలరా అంటే.. లేదనే చెప్పవచ్చు. అదిగో అలాంటి నిరుద్యోగ యువతీయువకులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
యూపీఎస్సీ, ఆర్ఆర్‌బీ, ఎస్ఎస్‌సీ, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, నీట్, క్యాట్, టోఫెల్, సీఏ, బ్యాంకింగ్ వంటి ఉద్యోగ పరీక్షలకు ఇంటర్, డిగ్రీ వంటి కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు పోటీపడుతున్న విషయం తెలిసిందే. వీరిలో చాలా మంది ప్రైవేట్ కోచింగ్ సెంటర్లలో జాయిన్ అయ్యి.. శిక్షణ తీసుకుంటూ ఉంటారు. ఇలాంటి విద్యార్థుల కోసం కేంద్ర ప్రభుత్వం సరికొత్త పథకాన్ని తీసుకువచ్చింది. దీనిలో భాగంగాఎంట్రెన్స్ ఎగ్జామ్స్, ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతోన్న నిరుద్యోగ యువతీయువకులకు ప్రతి నెలా రూ.4000 ఉపకార వేతనం ఇవ్వడమే కాక ఈ పోటీ పరీక్షలకు ఉచితంగా శిక్షణ ఇప్పిస్తుంది.అయితే ఈ పథకం కేవలం ఎస్సీ, బీసీ విద్యార్థులకు మాత్రమే వర్తిస్తుంది. ఏటా వేల మందికి లబ్ధి చేకూర్చుతున్న ఈ పథకం పేరు ఎస్సీ, ఓబీసీ విద్యార్థులకు ఉచిత శిక్షణ పథకం. మరి దీనికి ఎలా అప్లై చేయాలి.. ఏమేం కావాలి వంటి పూర్తి వివరాలు..
ఈ పథకం ద్వారా అర్హత పొందడానికి ఇంటర్మీడియెట్, డిగ్రీ విద్యార్థులు పరీక్షల్లో విద్యార్థి 50 శాతానికి తగ్గకుండా మార్కులు సాధించి ఉండాలి. అంత కంటే తక్కువ మార్కులు వ ఉంటే అర్హులు కారు.
అంతేకాక ఈ పథకం కింద కేవలం రెండు సార్లు మాత్రమే ఇలా పోటీ పరీక్షలు, ఎంట్రెన్స్ ఎగ్జామ్స్‌కు కోచింగ్ పొందడానికి అర్హులు. అంటే కేంద్ర నుంచి కేవలం రెండు సార్లు మాత్రమే ఈ ఉపకార వేతనం లభిస్తుంది. కేంద్రం ప్రతి యేటా 3,500 మంది విద్యార్థులను ఈ పథకం కింద ఎంపిక చేసి.. వారికి ప్రతి నెల రూ.4 వేలు ఆర్థిక సాయం అందిస్తోంది. కేంద్రం సెలక్ట్ చేసిన 3500 మందిలో ఎస్సీలు 70 శాతం, ఓబీసీ విద్యార్థులకు 30 శాతం కేటాయిస్తారు. ఒక వేళ ఇంతకంటే తక్కువ శాతంలో ఆయా కేటగిరీల నుంచి విద్యార్థులు ఉంటే అప్పుడు నిబంధనలను కొంత సడలిస్తారు. విద్యార్థులు తమకు ఇష్టమొచ్చిన ఇన్‌స్టిట్యూట్‌లో చేరొచ్చు. అయితే కేంద్ర ప్రభుత్వం తొలగించిన కొన్ని సంస్థలున్నాయి. వాటిలో మాత్రం చేరకూడదు.
ఈ పథకం నుంచి నేరుగా లబ్ధిదారుడి ఖాతాకే డబ్బులు చెల్లిస్తారు. ఆయా కోర్సుకు కోచింగ్ సెంటర్ ఎంత ఫీజు నిర్ణయించిందో అంత ఫీజూ పూర్తిగా చెల్లిస్తారు. అయితే గరిష్ఠంగా మాత్రం ఒక్కో కోర్సుకు ఇంత ఫీజు అని కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఆ ఫీజు పరిమితికి మించి ఉంటే..మొత్తాన్ని కేంద్ర చెల్లించదు. అదనపు ఫీజ్‌ను విద్యార్థే చెల్లించుకోవాలి.
విద్యార్థి ముందుగా తాను జాయిన్ అయిన కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌కు ఫీజు చెల్లించి.. తర్వాత సంబంధిత వెబ్‌సైట్‌కు వెళ్లి.. ఆ రసీదును ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలి . ఆ తర్వాత రెండు వారాల్లోపు ఈ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం విద్యార్థి బ్యాంకు ఖాతాలో జమ చేస్తుంది. పోటీ పరీక్షలకు కోచింగ్ తీసుకునే విద్యార్థికి కేవలం కోచింగ్ ఫీజు మాత్రమే చెల్లించకుండా ఆ విద్యార్థికి ఆ పోటీ పరీక్ష రాసే వరకు ప్రతి నెలా రూ.4000 స్కాలర్‌షిప్ కూడా ఇస్తుంది.
అయితే ఈ స్కాలర్‌షిప్ మొత్తాన్ని.. కోచింగ్ పూర్తయిన తరువాత ఒకేసారి విద్యార్థి ఖాతాలో జమ చేస్తారు. కోచింగ్ పూర్తయినట్లు, తాను రాయబోయే పోటీ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్‌ను విద్యార్థి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలి. పోటీ పరీక్ష రాసిన తర్వాత ఉపకార వేతనం ఇవ్వరు. ఒకవేళ పోటీ పరీక్ష నిర్వహణ ఏదైనా కారణాల వల్ల ఏడాదికి మించి సమయం తీసుకుంటే ఆ విషయాన్ని ముందుగానే తెలియజేయాలి. లేకపోతే కేంద్ర ప్రభుత్వం విధించిన నిర్ణీత గడువు తరువాత ఉపకార వేతనం ఆపేస్తారు.
ప్రతి ఏటా మే నెలలో ఈ పథకానికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ప్రతి సంవత్సరం మే 1వ తేదీ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియకు అనుమతిస్తారు. మే నెల 31వ తేదీ లోపు విద్యార్థులు దరఖాస్తు పక్రియను పుర్తి చేసుకోవాల్సి ఉంటుంది. మే 31వ తేదీ తరువాత ఈ వెబ్‌సైటు దానికదే క్లోజ్ అవుతుంది.
ఈ పథకానికి సంబంధించి దరఖాస్తు, ఎంపిక ప్రక్రియ పూర్తీగా ఆన్‌లైన్‌లోనే జరుగుతుంది. ఎంపిక కూడా పూర్తీగా మెరిట్ ఆధారంగానే నిర్వహిస్తారు. సెలక్ట్ అయిన అభ్యర్థుల జాబితా కూడా ఆన్‌లైన్‌లో ప్రదర్శిస్తారు. పూర్తి వివరాల కోసం విద్యార్థులు సంబంధిత వెబ్‌సైట్‌కు వెళ్లాల్సి ఉంటుంది.