iDreamPost
android-app
ios-app

రైతు నెత్తిన పిడుగు.. ఇక దేవుడే దిక్కు..

రైతు నెత్తిన పిడుగు.. ఇక దేవుడే దిక్కు..

పాలకులు తీసుకొచ్చే సంస్కరణలు, నిర్ణయాలు ప్రజల జీవితాల్లో అభివృద్ధి వెలుగులు నింపకపోయినా ఫర్వాలేదు కానీ చీకట్లు నింపకూడదు. కానీ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం దేశ ప్రజల ఆహార భద్రతను దెబ్బకొట్టేలా ఉంది. ఇప్పటికే కరువు, ప్రకృతి విపత్తులు,అకాల వర్షాలు, నకిలీ మందులు, ఎరువులు, విత్తనాలతో తీవ్రంగా నష్టపోతున్న అన్నదాల నెత్తిన కేంద్రప్రభుత్వం మరో పిడిగు వేసింది. నకిలీ ఎరువులు, విత్తనాలను అరికట్టాల్సిన ప్రభుత్వం వాటిని మరింత ప్రొత్సహించేలా నిర్ణయం తీసుకుంది.

విత్తనాల నాణ్యత వివరాలను ఉన్నదున్నట్లు రైతులకు చెప్పనవసరం లేకుండా కంపెనీలకు వెలుసుబాటునిస్తూ కేంద్ర వ్యవసాయశాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్యాకెట్ల రూపంలో విక్రయించే విత్తనాలకు సంబంధించి.. వాటిని ఎక్కడ పండించారు..? ఎక్కడ శుద్ధి చేశారు..? ఎప్పుడు ప్యాక్‌ చేశారు..? ఎప్పుటిలోగా వినియోగించాలి..? తదితర వివరాలన్నీ బార్‌కోడ్‌ రూపంలో ఇతర వస్తువుల మాదిరిగానే ముద్రించాలి. తద్వారా నాణ్యత, జవాబుదారీతనం, నకిలీ ఉత్పత్తులను నివారించవచ్చు. ఈ విధానం తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరితే.. ఈ వినతులను తోసిరాజని కంపెనీలకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది.

పెద్ద కంపెనీల నుంచి కొన్ని చిన్న కంపెనీలు విత్తనాలను తీసుకుని తమ ప్యాకెట్లలో ముద్రిస్తూ కో మార్కెటింగ్‌ విధానంలో విక్రయిస్తున్నాయి. ఈ సమయంలోనే నకిలీ విత్తనాల బెడద తప్పడం లేదు. అలాంటి విత్తనాల ప్యాకెట్లపై క్యూ ఆర్, బార్‌కోడ్‌ లు ముద్రించనవసరం లేదంటే ఇక అక్రమాలు ఏ స్థాయిలో జరుగుతాయో, అన్నదాతలకు ఏ స్థాయిలో నష్టం జరుగుతుంతో ఊహిస్తేనే వెన్నులో వణుకుపుడుతోంది. ఇకపై ఎవరైనా సరే విత్తనాలను ప్యాక్‌ చేసేందుకు ప్యాకెట్లు ఉంటే చాలు అందులో అందుబాటులో ఉన్న విత్తనాలను పోసి విక్రయించి అన్నదాలను నిలువుదోపిడీ చేయవచ్చు.

ఊరు, పేరు లేని ఆ విత్తనాలను కొనుగోలు చేసిన రైతన్న.. దుక్కి దున్ని, విత్తు విత్తి, ఎరువు వేసి, సేద్యం చేసి ఆనక పంట చేతికి వచ్చే సమయంలో దిగుబడి లేక తీవ్రంగా నష్టపోతారు. అప్పుడు ఇక అన్నదాతలకు ఆత్మహత్యలే శరణ్యం అవుతాయనడంలో సందేహం లేదు. అక్రమాలను అరికట్టాల్సిన ప్రభుత్వాలే ఇలా వ్యవహరిస్తుంటే అన్నదాతకు రక్షణ ఎక్కడ నుంచి వస్తుంది..? ఇలాంటి పరిస్థితుల్లో రైతన్నలు నిత్యం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటి వరకూ పంటను కాపాడుకునేందుకు నిత్యం అప్రమత్తంగా ఉంటున్న రైతన్న ఇకపై తనను తాను రక్షించుకునేందుకు కూడా సిద్ధపడక తప్పదు.