Idream media
Idream media
కుటుంబపరంగానే కాదు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరంగా కూడా ఆర్థిక, ఆదాయ పరిస్థితులను కోవిడ్ కు ముందు.. ఆ తర్వాత అంటూ బేరీజు వేసుకోవాల్సిన అవసరం వస్తోంది. ఎందుకంటే.. కరోనా, అది తీసుకొచ్చిన లాక్ డౌన్ పరిస్థితులను అంతలా చిన్నాభిన్నం చేశాయి. ఆర్థికంగా దేశమే కుదేలైపోయింది. నిలదొక్కుకోవడానికి చాలా అవస్థలు పడాల్సి వచ్చింది. కేంద్రమే కాదు.. అన్ని రాష్ట్రాలూ అప్పులపైనే ఆధారపడ్డాయి. కోవిడ్ తో తగిన ఆర్థిక వనరులు లేని కారణంగా రాష్ట్రాలను ఆదుకోవడంలో కేంద్రం విఫలమైంది. పన్నుల వాటా తగ్గిస్తూ వచ్చింది. అలాగే.. ఆంధ్రప్రదేశ్ కు వచ్చే వాటాలో కూడా గణనీయమైన తగ్గింపులు ఏర్పడ్డాయి.
అసలే ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం తీవ్ర ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయింది. దీనికి ఏ ముఖ్యమంత్రితోనూ సంబంధం లేదు. అయితే.. నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన అనుభవంతో పరిస్థితులను చక్కదిద్దడంలో విఫలం అయ్యారు. దీంతో రాష్ట్రం మరింత అప్పుల పాలైంది. ఉమ్మడి రాజధాని హైదరాబాద్ పై పదేళ్ల పాటు ఏపీకి హక్కు ఉన్నప్పటికీ హడావిడిగా రాజధానిని అమరావతికి తరలించడం కూడా రాష్ట్రానికి ఆర్థికంగా భారంగా మారింది. తాత్కాలిక నిర్మాణాలకే వేలాది కోట్ల రూపాయలను వెచ్చించడం కూడా ఖజానా ఖాళీ కావడానికి కారణమైంది. అనంతరం అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఆర్థిక నిపుణుల సూత్రాల ఆధారంగా రాష్ట్రాన్ని గాడిన పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ కోవిడ్ కాలంలో ఆదాయం గణనీయంగా తగ్గడంతో అప్పులు అనివార్యమయ్యాయి. దీనికి తోడు కేంద్రం నుంచి రావాల్సిన వాటాలు కూడా తగ్గుతూ వచ్చాయి.
కేంద్రం పన్నుల్లో రాష్ట్రానికి వచ్చే వాటాను గమనిస్తే 2018–19లో రూ.32,781 కోట్లుగా ఉంది. వాస్తవానికి కోవిడ్‌లాంటి విపత్తు లేని సందర్భాల్లో ఏటా 10 నుంచి 15 శాతం వాటాలు పెరుగుతాయి. కానీ, 2019–20లో అది రూ. 28,012 కోట్లకు పడిపోయింది. అలాగే 2020–21 నాటికి రూ.24,460 కోట్లకు పడిపోయింది. 2022–23 నాటికి కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటా అంచనా రూ.33,050 కోట్లు చూపిస్తున్నారు. అంటే 2018–19లో వచ్చిన పన్నుల వాటానే 2022–23లో కూడా చూపిస్తున్నారు. దీన్నిబట్టి దాదాపుగా నాలుగు సంవత్సరాలపాటు వృద్ధిని కోల్పోయామని ఇక్కడ స్పష్టమవుతోంది. సాధారణ పరిస్థితుల్లో ఎనిమిది శాతం వృద్ధి ఉందని అంచనా వేసుకున్నా కూడా కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే పన్నుల వాటా 2022–23కి సంబంధించి కనీసంగా రూ.44,600 కోట్లు ఉండాలి. అలా ఉండడం లేదంటే ఎంతటి కష్టకాలంలో ఉన్నామో అర్థం చేసుకోవచ్చు.
ఆర్థిక సమస్యలు ఎల్లకాలం ఉండకపోవచ్చు. ఉండవని కోలుకుంటున్న తాజా పరిస్థితులు కూడా తెలియజేస్తున్నాయి. కానీ.. అప్పులు, ఆర్థిక పరిస్థితులపై ఇప్పుడు వెల్లువెత్తుతున్న ప్రచారాలు రాష్ట్ర ఉనికికే ప్రమాదం. ఈరోజు ప్రతిపక్షం.. రేపు అధికారపక్షం కావచ్చు. నేటి అధికారపక్షం రేపు ప్రతిపక్షం కావచ్చు. అధికారంలో ఉన్నా లేకపోయినా రాష్ట్ర ప్రతిష్ఠ కు భంగం వాటిల్లేలా చేసే ప్రచారాలు మంచిది కాదనే విషయం అందరూ గుర్తెరగాలి.
Also Read : ఇవిగో లెక్కలు.. అవన్నీ తప్పుడు రాతలు : అప్పులపై దుష్ప్రచారంపై దుకుటుం