iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్ లో ఈసారి రైతాంగం అధిక వర్షాలతో అష్టకష్టాలు పడ్డారు. తీవ్రంగా నష్టాలు పాలయ్యారు. ఖరీఫ్ సీజన్ పంటలన్నీ దెబ్బతిన్నాయి. ప్రధానంగా గోదావరి, కృష్ణా, గుంటూరు , కడప, అనంతపురం జిల్లాల్లో అపార నష్టం సంభవించింది. వరదల మూలంగా నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవడానికి ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఇన్ ఫుట్ సబ్సిడీ అందించింది. అక్టోబర్ లో వచ్చిన వరదల నష్టాన్ని అంచనా వేసి నవంబర్ లో అందించేందుకు చర్యలు తీసుకుంటుంది. ఈలోగా కేంద్రం సహాయం కోసం ఏపీ ప్రభుత్వం పలుమార్లు విన్నవించింది.
ఈ మేరకు మొత్తం వివిధ పంటలకు రూ. 6,386 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ఏపీ ప్రభుత్వం అంచనా వేసింది. నష్టపోయిన పంటల వివరాలను కేంద్రానికి అందించింది. కేంద్ర ప్రభుత్వ బృందం ఏపీలో పర్యటించింది. ఈనెల 10,11 తేదీలలో రెండు రోజుల పాటు వివిధ జిల్లాల్లో క్షేత్రస్థాయిలో పరిశీలించింది. రైతులతో మాట్లాడింది. పంట నష్టంపై అధికారుల నివేదికలను అధ్యయనం చేసింది. ఈ మేరకు తాజాగా కేంద్రం నుంచి రూ. 500 కోట్ల నుంచి రూ. 600 కోట్ల వరకూ తక్షణ సహాయం విడుదల చేయాలని సూచనలు చేసింది. దాంతో కేంద్రం నుంచి ఏపీకి వరద సహాయ నిధి అందించేందుకు రంగం సిద్దమయ్యింది.
కేంద్ర బృందం నివేదిక ప్రాధమిక అంచనాలు 4.72లక్షల హెక్టార్లలో పంట నష్టం సంభవించింది. అనంతపురం జిల్లాలోని 17 మండలాల్లో వేరుశనగ పంట కూడా తీవ్రంగా నష్టపోయింది. అయితే ఏపీ ప్రభుత్వం తక్షణ సహాయం కింద రూ, 1200 కోట్లు ఇవ్వాలని అభ్యర్థించింది. కానీ కేంద్ర బృందం మాత్రం దానిని రూ. 500 కోట్లకే పరిమితం చేయడం విశేషం. ఈ నిధులు ఒకటి రెండు రోజుల్లో ఏపీ ప్రభుత్వానికి అందుతాయని అధికారులు చెబుతున్నారు. దాంతో ఇప్పటికే వరద ప్రభావిత ప్రాంతాల్లో నష్టపోయిన రైతులకు అండగా ఉండేందుకు పరిహారం చెల్లించే ప్రయత్నంలో ఉన్న ఏపీ ప్రభుత్వానికి తోడ్పడుతుంది. రైతులకు సహాయం తక్షణమే అందించేందుకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.