iDreamPost
android-app
ios-app

రాజకీయ ప్రయోజనాల కోసమే జేడీ లక్ష్మీనారాయణ ఆ పని చేశారట..!

రాజకీయ ప్రయోజనాల కోసమే జేడీ లక్ష్మీనారాయణ ఆ పని చేశారట..!

ప్రభుత్వ సంస్థలను విక్రయిస్తోన్న కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ప్రజల ఆందోళనలను, ఆకాంక్షలను ఏ మాత్రం పరిగణలోకి తీసుకోకుండా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తున్న నరేంద్ర మోదీ ప్రభుత్వం.. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పైనా ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు మరోసారి స్పష్టం చేసింది. స్టీల్‌ ప్లాంట్‌ను అమ్మేస్తామని, ఇందులో మరో ఆలోచన లేదని పార్లమెంట్‌లో చెప్పిన విషయాన్నే.. తాజాగా న్యాయస్థానాలకు తెలిపింది.

స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటుపరం చేయకుండా అడ్డుకోవాలని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఏపీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ రోజు కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్‌ దాఖలు చేసింది. ప్రభుత్వ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరించేందుకు విధానపరమైన నిర్ణయం తీసుకున్నామని చెప్పిన కేంద్రం.. స్టీల్‌ ప్లాంట్‌పై తన వైఖరిని మరోమారు స్పష్టం చేసింది. ఉన్నతాధికారులు పర్యవేక్షణలో ఈ ప్రక్రియ కొనసాగుతోందని తెలిపింది. ప్రైవేటీకరణ ద్వారా నిధులు సమకూర్చుకోవాలనే లక్ష్యంతో ఉన్నట్లు పేర్కొంది. దేశ ఆర్థిక ప్రయోజనాల కోసమే ఇలా చేస్తున్నట్లు అఫిడవిట్‌లో కేంద్ర ప్రభుత్వం తెలపడంతో.. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై కార్మికులు, వివిధ ప్రజా సంఘాల ఆకాంక్షలను ఏ మాత్రం పరిగణలోకి తీసుకోలేదని స్పష్టమవుతోంది.

పిటిషన్‌ దాఖలు చేసిన జేడీ లక్ష్మీనారాయణపైనా తన అఫిడవిట్‌లో కేంద్ర ప్రభుత్వం పలు విమర్శలు, ఆరోపణలు చేసింది. రాజకీయ ప్రయోజనాల కోసమే జేడీ లక్ష్మీ నారాయణ ఈ పిటిషన్‌ దాఖలు చేశారని ఆరోపించింది. విశాఖ ఎంపీగా గత ఎన్నికల్లో జేడీ లక్ష్మీ నారాయణ పోటీ చేశారని పేర్కొంది. స్టీల్‌ ప్లాంట్‌పై పిటిషన్‌ దాఖలు చేసే అర్హత జేడీ లక్ష్మీ నారాయణకు లేదని విమర్శించింది. విచారణ అర్హతలేని ఈ పిటిషన్‌ను పరిగణలోకి తీసుకోవద్దని ఏపీ హైకోర్టును కోరింది.

ప్రభుత్వ సంస్థల విక్రయంపై సుప్రిం కోర్టు తీర్పులు ఉన్నాయని, వాటిని పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వం హైకోర్టును కోరడం.. ప్లాంట్‌ను విక్రయించే ప్రక్రియకు అడ్డుచెప్పవద్దనేలా ఉంది. స్టీల్‌ ప్లాంట్‌ను విక్రయించవద్దని ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది. సీఎం వైఎస్‌ జగన్‌ ప్రధానికి లేఖ రాశారు. మరో వైపు కార్మికులు తమ నిరసనలను కొనసాగిస్తూనే ఉన్నారు. ప్లాంట్‌ను విక్రయించే నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే.. తమ భూములు తమకు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. భూములు వెనక్కి ఇచ్చే వరకూ ఉద్యమం చేస్తామని హెచ్చరిస్తున్నారు. అయినా ఇవేమీ పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం స్టీల్‌ ప్లాంట్‌ విక్రయంపై ముందుకే సాగుతోంది.

Also Read : బిజెపికి మమతా పెగసిస్ కమీషన్ సెగ.