iDreamPost
android-app
ios-app

రాష్ట్రాలకు వ్యాక్సిన్‌ మేమే ఇస్తాం

రాష్ట్రాలకు వ్యాక్సిన్‌ మేమే ఇస్తాం

వ్యాక్సిన్‌ పాలసీపై కేంద్ర ప్రభుత్వం దిగివచ్చింది. వ్యాక్సిన్‌ విధానంపై సర్వత్రా విమర్శలు రావడంతో కేంద్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. మే 1వ తేదీ నుంచి 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు అనుమతించిన కేంద్ర ప్రభుత్వం.. అదే సమయంలో వ్యాక్సిన్‌ నూతన పాలసీని ప్రకటించింది. వ్యాక్సిన్‌ తయారు చేసే సంస్థలు 50 శాతం కేంద్ర ప్రభుత్వానికి విక్రయించేలా, మిగతా 50 శాతం రాష్ట్ర ప్రభుత్వాలకు, బహిరంగ మార్కెట్లలో విక్రయించేందుకు అనుమతి ఇచ్చింది.

ఈ నేపథ్యంలో కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ తయారు చేసే సీరం ఇన్సిస్టిట్యూట్‌ వ్యాక్సిన్‌ధరను ప్రకటించింది. ఒక డోసును కేంద్ర ప్రభుత్వానికి 150 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వాలకు 400 రూపాయలు, ప్రైవేటు సంస్థలు, ఆస్పత్రులకు 600 రూపాయల చొప్పన ధరను నిర్ణయించి ప్రకటించింది.

ఇక కోవాక్సిన్‌ తయారు చేసే భారత్‌బయోటెక్‌ తమ వ్యాక్సిన్‌ ధరను ప్రకటించలేదు. అయితే ధర ప్రకటించక ముందు ఈ సంస్థ తమ వ్యాక్సిన్‌ ప్రభావశీలత, ఇతర అంశాలపై ప్రచారం చేస్తోంది. ఏడాదికి 70 కోట్ల డోసులు తయారు చేసేందుకు ప్రణాళికలు రచించింది. రేపోమాపో ధరను ప్రకటించేందుకు సిద్ధమైంది.

అయితే వ్యాక్సిన్‌ ధరలలో వ్యత్యాసం ఉండడంపై రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ నేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ సహా పలు బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర తీరును నిరశించాయి. అదే సమయంలో సోషల్‌ మీడియాలోనూ కేంద్ర తీరుపై నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఉచితంగా ఇవ్వాల్సిన వ్యాక్సిన్‌ను వ్యాపారంగా కేంద్ర ప్రభుత్వమే మార్చివేసిందని, బీజేపీ కార్పొరేట్‌ ప్రభుత్వమని, బాధ్యత నుంచి తప్పించుకుని భారం రాష్ట్ర ప్రభుత్వాలపై నెట్టివేసిందని.. ఇలా పలు రకాల విమర్శలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి.

కేంద్ర ప్రభుత్వం ఇలా ఉంటే.. ఏపీ లాంటి రాష్ట్రాలు ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు సిద్ధమయ్యాయి. విమర్శలు, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాన్ని గమనించిన కేంద్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలను ప్రారంభించింది. వ్యాక్సిన్‌ను ఉత్పత్తి సంస్థలను 150 రూపాయలకే తాము కొనుగోలు చేసి రాష్ట్ర ప్రభుత్వాలకు ఉచితంగా అందిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటన విడుదల చేసింది. తాజా నిర్ణయంతో వ్యాక్సిన్‌ ఉత్పత్తి సంస్థలు ఒక డోసును 150 రూపాయలకు కేంద్ర ప్రభుత్వానికి, 600 రూపాయల చొప్పన బహిరంగ మార్కెట్‌లో విక్రయించబోతున్నాయి.

Also Read : వ్యాక్సిన్ వార్ : కొత్త టీకా పాల‌సీ.. స‌రికొత్త వివాదాలు