Idream media
Idream media
బిహార్ ఎన్నికల సందర్భంగా బీజేపీ తన మేనిఫెస్టోలో పెట్టిన కోవిడ్‌కు ఉచిత టీకా హామీపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. రాజకీయ పార్టీలు ఇలా హామీ ఇవ్వడం ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు రాదని తెలిపింది. సంక్షేమంలో భాగంగా ఇలాంటి హామీ ఇవ్వడం సరైనదేనని స్పష్టం చేసింది.
బిహార్ ఎన్నికల సందర్భంగా బీజేపీ తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రధాన హామీగా బిహారీలకు ఉచితంగా కోవిడ్ టీకా అందిస్తామని పేర్కొంది. దీనిపై రాజకీయంగా పెద్ద దుమారమే రేగింది. కాంగ్రెస్, ఆర్‌జేడీ సహా అన్ని రాజకీయ పార్టీలు బీజేపీపై విమర్శలు ఎక్కుపెట్టాయి. బీజేపీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిందని ఆరోపించాయి. బీజేపీ ఇచ్చిన హామీపై ఓ సమాచార హక్కు కార్యకర్త ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కేంద్ర ఎన్నికల కమిషన్.. ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు రాదని పేర్కొంది.
మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌లోని ఎనిమిదో భాగంలో పార్టీల ఎన్నికల ప్రణాళికకు సంబంధించిన మార్గదర్శకాలున్నాయి. వీటి ప్రకారం చూస్తే ఉచిత కరోనా టీకా హామీ ఆ మార్గదర్శకాలను ఉల్లంఘించలేదని ఈసీ పేర్కొంది. ప్రజల సంక్షేమం కోసం ఈ హామీని రాజకీయ పార్టీలు తమ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చడం తప్పేమీకాదని స్పష్టం చేసింది.
బీజేపీ హామీ ఇచ్చిన తర్వాత వివిధ రాష్ట్రాలలోని ప్రభుత్వాలు తమ రాష్ట్ర ప్రజలకు ఉచితంగా కరోనా టీకాను అందజేస్తామని హామీ ఇచ్చాయి. తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, పంజాబ్ ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్‌లు ప్రజలకు ఉచితంగ టీకా అందజేస్తామని ప్రకటించారు. మన దేశంలోనే కాకుండా.. అమెరికా ఎన్నికల్లోనూ డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ కూడా బీజేపీ తరహాలోనే ఆ దేశ ప్రజలకు ఉచితంగా కరోనా టీకాను అందిస్తామని హామీ ఇచ్చారు.