iDreamPost
iDreamPost
మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం మరోసారి ఏపీకి టోపీ పెట్టింది. ఆంధ్రప్రదేశ్ ని ఆదుకుంటామని మాటలు, సీఎం కలిసినప్పుడు షేక్ హ్యాండివ్వడమే తప్ప ఏపీకి ఒరిగిందేమీ కనిపించడం లేదు. తాజాగా వరదలు, విపత్తుల సహాయ నిధి కింద కూడా ఆంధ్రప్రదేశ్ కి నిధులు కేటాయించలేదు. ఇటీవల కృష్ణా, గోదావరి వరదల్లో ఏపీలోని ఐదారు జిల్లాల్లో అపార నష్టం జరిగింది. కేంద్రం వరద బాధితులను ఆదుకోవడానికి ఉదారంగా వ్యవహరిస్తుందనే ఆశాభావంతో దరఖాస్తులు చేసుకున్నప్పటికీ మొండిచేయి తప్పలేదు.
తాజాగా అమిత్ షా అధ్యక్షతన జరిగిన అత్యున్నత కమిటీ సమావేశంలో దేశంలోని ఏడు రాష్ట్రాలకు సహాయం అందిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అందులో బీజేపీ పాలిత రాష్ట్రాలైన అసోం, హిమాచల్ ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, త్రిపుర, కర్ణాటక ఉండగా కాంగ్రెస్ , మిత్రపక్ష ప్రభుత్వాలు నడుస్తున్న మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ప్రభుత్వాలకు కూడా సహాయం కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
జాతీయ విపత్తుల సహాయ నిధి నుంచి రూ.5,908 కోట్లు సహాయాన్ని కేటాయిస్తూ నిర్ణయం ప్రకటించారు. అందులో అసోం కి రూ.616 కోట్లు, హిమాచల్ ప్రదేశ్ కి రూ. 284 కోట్లు, కర్ణాటకకి రూ. 1869 కోట్లు, మధ్యప్రదేశ్ కి రూ.1749 కోట్లు, మహారాష్ట్ర కి రూ.956 కోట్లు, త్రిపురకి రూ.63 కోట్లు , ఉత్తర ప్రదేశ్ కి రూ. 367 కోట్లు చొప్పున కేటాయించారు. కానీ ఏపీ ప్రభుత్వ వినతిని కేంద్రం పెడచెవిన పెట్టింది.
ఆంధ్రప్రదేశ్ కి మరోసారి మొఖం చాటేసిన మోడీ సర్కారు తీరు విస్మయకరంగా కనిపిస్తోంది. ఏపీలో అసలే ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉండడం, కేంద్రం చెప్పినట్టుగా ఆర్థికలోటు భర్తీకి చర్యలు తీసుకోకపోవడం పెద్ద సమస్యగా మారుతోంది. అదే సమయంలో వరదల కారణంగా నష్టపోయిన రైతాంగాన్ని అదుకోవడానికి కూడా సహాయం అందించేందుకు కేంద్రం నిరాకరించడం బీజేపీ ప్రభుత్వానికి ఏపీ ప్రజల పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.