iDreamPost
android-app
ios-app

కోవిడ్ మరణాల వివరాలు – కోరి విమ‌ర్శ‌లు తెచ్చుకున్న‌ కేంద్రం

కోవిడ్ మరణాల వివరాలు  – కోరి విమ‌ర్శ‌లు తెచ్చుకున్న‌ కేంద్రం

క‌రోనా రెండో ద‌శ‌ను అరిక‌ట్ట‌డంలో విఫ‌ల‌మైంద‌న్న విమ‌ర్శ‌లు ఇప్ప‌టికే కేంద్ర ప్ర‌భుత్వం ఎదుర్కొంటోంది. ప్ర‌జ‌ల తీర్పులో కూడా ఆ అసంతృప్తి క‌నిపిస్తోంది. ఆ మ‌చ్చ తొల‌గించుకోవాల్సింది పోయి.. ఆక్సిజన్ కొరతతో ఏ ఒక్కరూ మరణించలేదని రాజ్యసభ సాక్షిగా ప్ర‌క‌టించి మ‌రిన్ని విమ‌ర్శ‌ల పాల‌వుతోంది. ఇవిగో సాక్ష్యాలు అంటూ కేంద్రాన్ని నిందిస్తూ సోష‌ల్ మీడియాలో ప‌లు వార్త‌లు విప‌రీతంగా వైర‌ల్ అవుతున్నాయి.

కరోనా సెకండ్ వేవ్ సమయంలో దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరతతో రోగులు మరణించారా? లేదా అనే ప్రశ్నకు సమాధానంగా.. ఒక్క రాష్ట్ర ప్రభుత్వం గానీ కేంద్ర పాలిత ప్రాంతం గానీ ఆక్సిజన్ కొరతతో రోగులు చనిపోయినట్లు నివేదించలేదని కొవిడ్ మృతుల వివరాలు దాచిపెట్టాల్సిన అవసరం మాకు లేదని కేవలం ప్రోటోకాల్ని అనుసరించి వివిధ రాష్ట్రాలు ఇచ్చిన గణాంకాలను మాత్రమే మేము వెల్లడించామని కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఈ అంశంపై స్పందించిన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ సహాయ మంత్రి భారతీ ప్రవీణ్ పవార్ కూడా దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరతతో ప్రాణాలు కోల్పోయిన కరోనా రోగులు ఎవరూ లేరని స్పష్టం చేశారు.

కేంద్ర ప్రభుత్వ వివరణపై బాధిత కుటుంబ స‌భ్యులు, కొంద‌రు వైద్యులు సైతం ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ప్రాణవాయువు కొరతతో ప్రజలు రోడ్ల మీద ఆసుపత్రుల మెట్ల మీద ఎక్కడపడితే అక్కడా ప్రాణాలు కోల్పోయారు. దానికి సంబంధించిన దృశ్యాలు టీవీల్లో సామాజిక మాధ్యమాల్లోనూ వైరల్ అయ్యాయి. కానీ ఇప్పుడు ఆక్సిజన్ లేక ఏ ఒక్కరూ చనిపోలేదని చెప్పడం ఏంటనే విమర్శలు వినిపిస్తున్నాయి. 

కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమేమో రాష్ట్రల నుంచి ఆక్సిజన్ కొరత వల్ల సంభవించిన మరణాలు తమ దృష్టికి రాలేదని పేర్కొనడం గమనార్హం. ఒక్క రుయా ఆసుపత్రిలో అనే కాకుండా ఏపీలోనూ తెలంగాణలోనూ ఆక్సిజన్ కొరత వల్ల ప్రాణాలు పోయాయనేది కాదనలేని నిజం అని ప్రజలు అంటున్నారు. అనంతపురం కాకినాడ ప్రభుత్వాసుపత్రుల్లోనూ ఆక్సిజన్ అందక కరోనా రోగులు చనిపోయారు. ప్రాణ వాయువు సకాలంలో అందక తమ తల్లి కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మరణించారని ఓ తనయుడు తన ఆవేదన వ్యక్తం చేశారు.

మరోవైపు తన భార్యకు ప్రాణవాయువు కోసం ఒక్క రాత్రి ఆరు ఆసుపత్రులు తిరిగామని కానీ చివరకు ఆమె ప్రాణాలను దక్కించుకోలేకపోయామని హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తి బాధపడ్డారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో హృదయ విదారక సంఘటనలెన్నో. కార్పొరేట్ ఆసుపత్రులకు చెందిన వైద్యులు కూడా ఆ రోజుల్లో ఆక్సిజన్ కొరత తీవ్రమైన సమస్యగా మారిందని వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లోనే అని కాదు దేశవ్యాప్తంగా ఇలాంటి దుస్థితే ఏర్పడింది. ఆక్సిజన్ కొరతతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయి.. ఎన్నో కుటుంబాలు కన్నీళ్లు పెడుతుంటే కేంద్రం మాత్రం పార్లమెంట్లో ఆక్సిజన్ అందక ఎవరూ చనిపోలేదని చెప్పడం ఆశ్చర్యంగా ఉంది. చేతులు దులుపుకునే ప్రయత్నం చేసిన కేంద్ర ప్రభుత్వంపై ప్రజలు తీవ్రమైన కోపంతో రగిలిపోతున్నారు. ఇప్పటికే కరోనా కట్టడిలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ విఫలమైందనే విమర్శలున్నాయి.

ఈ నేపథ్యంలో ఇలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేయడం ఎంతవరకూ సమంజసమనే మాటలు వినిపిస్తున్నాయి. ఆక్సిజన్ సరఫరా కోసం గ్రీన్ ఛానెళ్ల ఏర్పాటు చివరికి విమానాల కూడా తరలించిన సంగతి తెలిసిందే. కానీ ఇవన్నీ మర్చిపోయి అసలు ఆక్సిజన కొరత వల్ల ఒక్కరు కూడా చనిపోలేదని ప్రకటించిన కేంద్ర వైఖరి ఆంతర్యం ఏమిటో అంతుపట్టడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.