iDreamPost
android-app
ios-app

ప్రాజెక్టులు సరే.. మరి నిధుల మాటేంటి?

ప్రాజెక్టులు సరే.. మరి నిధుల మాటేంటి?

తెలుగురాష్ట్రాల్లో చాలా నీటి ప్రాజెక్టులు పెండింగ్‌లోనే ఉన్నాయి. ఏళ్ల తరబడి అవి ముందుకు సాగడం లేదు. వీటిపై కేంద్రం కనికరించడం లేదు. ఆంధ్రప్రదేశ్‌కు జీవనాధారామైన పోలవరం ప్రాజెక్టుకు కూడా పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వడం లేదు. నిధుల కేటాయింపు సత్వరం జరగడం లేదు. సీఎం జగన్‌ సహా.. మంత్రులు పలుమార్లు విన్నపాలు చేస్తున్నా.. సానుకూలంగా స్పందిస్తామంటున్నారు తప్పా ఆచరణలో కార్యరూపం దాల్చడం లేదు. ఈ నేపథ్యంలో కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ తాజా ప్రకటన ఆశలు రేకెత్తిస్తున్నా.. ఆ ప్రాజెక్టుల్లో ఎంత వరకు కదలిక వస్తుందనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

పోలవరం ప్రాజెక్టుసహా జాతీయ నదీ జలాల అభివృద్ధి ఏజెన్సీ దేశంలో 30 నదుల అనుసంధాన ప్రాజెక్టులను గుర్తించిందని, వీటిలో తెలుగు రాష్ట్రాల్లో 9 ప్రాజెక్టులు ఉన్నాయని షెకావత్‌ తెలిపారు. అయితే, గోదావరి-కావేరీతోపాటు కెన్‌-బెట్వా, దామన్‌ గంగా-పింజల్‌, పార్‌- తపీ- నర్మదా ప్రాజెక్టులకే ప్రస్తుతం అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. గోదావరి(ఇచ్చంపల్లి)-కృష్ణా (నాగార్జున సాగర్‌)-పెన్నార్‌ (సోమశిల), పెన్నార్‌ (సోమశిల)- కావేరీ నదుల అనుసంధాన ప్రాజెక్టులకు సంబంధించి సవివర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)లను పూర్తి చేసి సంబంధిత రాష్ట్రాలకు పంపామని, తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మిగతా అనుసంధాన ప్రాజెక్టుల సాధ్యాసాధ్యాల నివేదికలు కూడా పూర్తయ్యాయని వెల్లడించారు.

ఈ మేరకు గత ఏడాది డిసెంబరు 2న రాజ్యసభలో ఎంపీ సీఎం రమేశ్‌ అడిగిన ప్రశ్నకు తాజాగా ఆయన సమాధానం పంపారు. ఈ నివేదికలు పూర్తయిన ప్రాజెక్టుల్లో ఒడిశా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, తెలంగాణ, జార్ఖండ్‌, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలకు సంబంధించి మహానది- గోదావరి (ధవళేశ్వరం), ఒడిశా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలకు సంబంధించి గోదావరి(ఇంచంపల్లి)- కృష్ణా (పులిచింతల), గోదావరి (పోలవరం)-కృష్ణా (విజయవాడ), మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తెలంగాణకు సంబంధించి కృష్ణా (ఆలమట్టి)-పెన్నార్‌, కృష్ణా (శ్రీశైలం)-పెన్నార్‌, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటకలకు సంబంధించి బేత్రి-వార్ధా నదుల అనుసంధాన ప్రాజెక్టులు ఉన్నాయి. రాష్ట్రాలతో సంప్రదింపుల ప్రాతిపదికనే ఈ ప్రాజెక్టులను చేపడుతున్నామని, తొలి నదుల అనుసంధాన ప్రాజెక్టు అయిన కెన్‌- బెట్వాకు కేంద్రం ఇప్పటికే రూ.39,317కోట్ల మేర మద్దతు ఇవ్వాలని నిర్ణయించిందని ఆయన వివరించారు. అయితే.. తెలుగు రాష్ట్రాల ప్రాజెక్టుల నిధుల అంశాన్ని మాత్రం ప్రస్తావించలేదు.

Also Read : వీర్రాజు హామీల ప‌రంప‌ర‌.. ప్ర‌జ‌లు న‌మ్మేనా?