Idream media
Idream media
ఓ వైపు కొత్త వేరియంట్ ఒమిక్రాన్, మరోవైపు ఇప్పటికీ వదలని డెల్టా.. దేశంలో పెరుగుతున్న పాజిటివిటీ రేటు. పరిస్థితి ముందుగానే పసిగట్టి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పలుసార్లు రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఈ క్రమంలో కొన్ని రాష్ట్రాలు కూడా మరిన్ని ఆంక్షలకు దిగుతున్నాయి. ఢిల్లీలో కొత్త వేరియంట్ వేవ్ ప్రారంభమైనట్లు స్వయంగా ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ ప్రకటించడం అక్కడి తీవ్రతకు నిదర్శనంగా మారింది. ఏడున్నర నెలల్లో ఎన్నడూ లేనంతగా ఢిల్లీలో సోమవారం 4,099 కేసులు వచ్చాయి. ఆదివారంతో పోలిస్తే ఇవి 28 శాతం అధికం. పాజిటివ్ రేటు 6.46కు చేరింది. ఒక్క రోజు వ్యవధిలో 2 శాతం పెరిగింది. వచ్చే వారం కేసులు మరింత పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
మూడోవేవ్ మొదలైనట్లే..
మరోవైపు దేశంలో థర్డ్ వేవ్ మొదలైందని, దీనికి ఒమిక్రానే కారణమని.. కొవిడ్ టీకా పంపిణీపై ఏర్పాటైన జాతీయ సలహా కమిటీ (ఎన్‌టీఏజీఐ) చీఫ్ డాక్టర్ ఎన్‌కే ఆరోరా తేల్చి చెప్పారు. ఢిల్లీ, కోల్‌కతా, ముంబై వంటి మెట్రో నగరాల్లో డెబ్బై శాతానికి పైగా కేసులకు ఒమిక్రానే కారణమని పేర్కొన్నారు. డిసెంబరు చివరి వారం ప్రారంభంలో జన్యు విశ్లేషణ చేసిన నమూనాల్లో 12 శాతం నమూనాల్లోనే ఒమిక్రాన్ బయటపడిందని, ఇప్పుడది 28కి చేరిందని వివరించారు. థర్డ్ వేవ్ సంకేతంగా.. గత నాలుగు రోజుల నుంచి నమోదవుతున్న కొవిడ్ కేసుల గణాంకాలను ప్రస్తావించారు. అంతేకాదు.. దేశంలో థర్డ్ వేవ్ నాలుగు నెలల పాటు ఉంటుందని.. ఏప్రిల్ వరకు కొనసాగుతుందని ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ మణీంద్ర అగర్వాల్ తెలిపారు. త్వరలో ఎన్నికలు జరుగునున్న నేపథ్యంలో ర్యాలీలు సూపర్ స్ర్పెడర్లుగా మారే ప్రమాదముందుని ఆందోళన వ్యక్తం చేశారు.
అంతటా అలర్ట్
ఢిల్లీలో ఒమిక్రాన్ సామాజిక వ్యాప్తి కొనసాగుతోంది. నగరంలో ప్రస్తుతం ‘ఎల్లో అలర్ట్’ అమల్లో ఉంది. వరుసగా రెండు రోజులు పాజిటివిటీ 5పైన ఉంటే ‘రెడ్ అలర్ట్’ జారీ చేస్తారు. ఇదే జరిగితే పూర్తిస్థాయి కర్ఫ్యూ విధించడంతో పాటు వ్యాపార, వాణిజ్య సంస్థలను మూసివేస్తారు. గోవాలో.. కొత్త సంవత్సర సంబరాలు కరోనా వ్యాప్తికి దారితీస్తున్నాయి. రాష్ట్రంలో ఆదివారం 388 మందికి వైరస్ నిర్ధారణ అయింది. పాజిటివ్ రేటు 10.7గా నమోదైంది. దీంతో రాత్రి కర్ఫ్యూ విధింపుతో పాటు మరిన్ని ఆంక్షల అమలుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ నెల 26 వరకు పాఠశాలలు, కళాశాలలను మూసివేశారు. తెలంగాణలో కూడా ఈ నెల 8 నుంచి పాఠశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.
ప్రముఖ వ్యక్తులకు కరోనా..
కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే (65) కొవిడ్ బారినపడ్డారు. ఈయన గతంలోనూ వైరస్‌కు గురయ్యారు. కుటుంబంలో ఒకరికి, వ్యక్తిగత సిబ్బందిలో ఒకరికి కరోనా రావడంతో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ ఐసొలేషన్‌లోకి వెళ్లారు. బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహాం (49) ఆయన భార్య ప్రియా రంచల్‌కు కొవిడ్ పాజిటివ్ వచ్చింది. సినీ, టీవీ నిర్మాత ఏక్తా కపూర్(46) వైరస్‌కు గురయ్యారు. బాలీవుడ్ ప్రసిద్ధ నటుడు ప్రేమ్ చోప్రా (86) ఆయన భార్య ఉమా చోప్రాలకు కరోనా సోకింది. బిహార్ మాజీ సీఎం జీతన్ రామ్ మాంజీ (77), ఆయన భార్య, కూతురు, వ్యక్తిగత సిబ్బంది సహా 18 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లా తెమల్‌వాడ క్యాంపులో విధులు నిర్వర్తిస్తున్న 38 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు వైరస్ బారినపడ్డారు.
Also Read : ప్రస్తుతానికి ముందుకే.. రేపు ఎలా ఉంటుందో..?