Idream media
Idream media
బహుభాషా పాండిత్యం… నిఖార్సయిన వ్యక్తిత్వం
రాజనీతి చాతుర్యం.. జాతి వికాస కర్తృత్వం
తెలంగాణ తేజోమూర్తి.. తెలుగుజాతి వెలుగుల దీప్తి
భరతజాతి జ్ఞాన సంపత్తి.. తరతరాలకు నిత్య స్ఫూర్తి… అంటూ భారత మాజీ ప్రధానమంత్రి శ్రీ పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలకు 2020 జూన్ 28న తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఏడాది పాటు ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు సీఎం కేసీఆర్ నాడు ప్రకటించి సంచలనం సృష్టించారు. ప్రకటించినట్లుగానే ఏడాది పాటు, ఎక్కడో చోట.. ఏదో ఒక కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. పీవీ పుట్టిన రోజైన జూన్ 28 న గతేడాది ప్రారంభించిన ఉత్సవాలు ఈ ఏడాది జూన్ 28న ముగిసిన సందర్భంగా ఐడ్రీమ్ స్పెషల్ రివ్యూ..
పీవీ మన ఠీవీ
పాములపర్తి వెంకట నరసింహారావు 1921 జూన్ 28న తెలంగాణ లోని వరంగల్ జిల్లా, నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామంలో జన్మించారు. భారతదేశ ప్రధానమంత్రి పదవిని అధిష్టించిన తెలుగువాడిగా చరిత్రలో నిలిచారు. ప్రధానిగా, స్వతంత్ర సమరయోధుడిగా, విద్యావేత్తగా, సాహితీ వేత్తగా దేశానికి పలు విధాలుగా సేవలు అందించిన పీవీ సేవల స్మరణకు శత జయంతి వేడుకలను నిర్వహించాలని కేసీఆర్ సంకల్పించారు. పీవీ మన ఠీవీ పేరుతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఆషామాషీగా కాకుండా పక్కాగా, ప్రణాళికాబద్ధంగా వేడుకలు నిర్వహించేలా ప్రణాళికలు రచించారు.
ఉత్సవాల నిర్వహణకు కమిటీ
పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాల నిర్వహణ కోసం పార్లమెంటు సీనియర్ సభ్యుడు కే. కేశవరావు ఆధ్వర్యంలో 2020 జూన్ 17న కమిటీని నియమించారు. ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, పీవీ కుమారుడు పీవీ ప్రభాకర్ రావు, కుమార్తె వాణీదేవి, కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రులు ఈటల రాజేందర్ (ఇప్పుడు లేరు), కేటీ రామారావు, అధికార భాషా సంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర్ రావు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అంపశయ్య నవీన్ ను కమిటీలో సభ్యులుగా నియమించారు. ఉత్సవాల ప్రారంభంపై జూన్ 18న కేశవరావు ఇంట్లో కమిటీ మొదటి సారిగా సమావేశమైంది. పీవీతో కలిసి పనిచేసిన వారు, ఆయనతో అనుబంధం కలిగిన వారు, కుటుంబ సభ్యులు, ఆయన అభిమానులను సంప్రదించి ఉత్సవాల నిర్వహణకు సంబంధించిన కార్యక్రమాలను రూపొందించాలని కమిటీ నిర్ణయించింది.
2020 జూన్ 28న ఆరంభం..
దివంగత ప్రధాని పీవీ నర్సింహారావు సేవలు చిరస్మరణీయంగా చరిత్రలో నిలిచిపోయే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో పీవీ శత జయంతి ఉత్సవాలను జూన్ 28న హైదరాబాద్‌లోని పీవీ జ్ఞానభూమిలో ప్రారంభించారు. తెలంగాణలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉత్సవాలు నిర్వహించాలని ఆ సందర్భంగా ప్రభుత్వం నిర్ణయించింది. దాదాపు 50 దేశాల్లో పీవీ శతజయంతి వేడుకలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. జయంతి ఉత్సవాల నిర్వహణకు రూ.10 కోట్లు కేటాయించింది. ఏడాదిపాటు శత జయంత్యుత్సవాలు జరుపాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంతో పీవీ స్వగ్రామం వంగరలో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఉత్సవాల సందర్భంగా తీసుకున్న కొన్ని నిర్ణయాలు
పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించాలని ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానించింది. నెక్లెస్ రోడ్‌ను పీవీ జ్ఞాన్‌మార్గ్ గా అభివృద్ధి చేయాలి. ఆ మార్గమంతా అందమైన ఉద్యానవనాలు నిర్మించాలి. పీవీ విగ్రహం పెట్టాలి. పీవీ పుట్టిన లక్నెపల్లి, పెరిగిన వంగర గ్రామాలను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయాలి. హైదరాబాద్‌లో అంతర్జాతీయ స్థాయిలో పీవీ మెమోరియల్ ఏర్పాటు చేసేలా అడుగులు. పీవీ పేరుమీద విద్యా వైజ్ఞానిక, సాహితీ రంగాల్లో సేవ చేసినవారికి అంతర్జాతీయ అవార్డు ఇవ్వాలని యునెస్కోకు ప్రతిపాదించింది. అవార్డు కోసం నగదు బహుమతిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. శతజయంతి ఉత్సవాలు అమెరికా, సింగపూర్, సౌతాఫ్రికా, మలేషియా, మారిషస్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా తదితర దేశాల్లో కూడా కొనసాగాయి. విదేశాల్లో ఉత్సవాల నిర్వహణ బాధ్యతను మహేశ్ బిగాల తీసుకున్నారు.
వెలుగులోకి సాహిత్యం
ఉత్సవాల సందర్భంగా పీవీకి సంబంధించిన కొత్త సాహిత్యాన్ని వెలుగులోకి తెచ్చారు. ఢిల్లీతోపాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా, పంజాబ్, తమిళనాడు తదితర రాష్ట్రాలతో పీవీకి ఎక్కువ అనుబంధం ఉండడంతో అక్కడ కూడా ఉత్సవాలు నిర్వహించారు. అముద్రితాలుగా ఉన్న పీవీ రచనలను తెలంగాణ సాహిత్య అకాడమీ తరఫున ముద్రించారు. పత్రికల్లో వచ్చిన వ్యాసాలతో ప్రత్యేక పుస్తకం తీసుకువచ్చారు. పీవీ వివిధ సందర్భాల్లో చేసిన ప్రసంగాలు, ఇంటర్వ్యూలలో చెప్పిన సంగతులతో ప్రత్యేక పుస్తకం ముద్రించారు. పీవీ ఆధ్యాత్మిక కోణాన్ని స్పృశించేలా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
పీవీ జ్ఞాన మార్గ్
పర్యాటక ప్రాంతంగా, నగరంలో ప్రముఖ కేంద్రంగా ఉన్న హైదరాబాద్ నెక్లెస్ రోడ్ కు పీవీ పేరిట నామకరణం చేశారు. నెక్లెస్ రోడ్ లో పీవీ ఘాట్ ఉన్నందున ఆయన శత జయంతి ఉత్సవాల సందర్భంగా పీవీ దేశానికి, రాష్ట్రానికి చేసిన సేవలకు గాను నెక్లెస్ రోడ్ కు పీవీ నరసింహారావు మార్గ్ (పీవీఎన్ ఆర్) అని పేరు పెట్టారు. గత కేబినెట్ లో తీసుకున్న నిర్ణయం మేరకు ప్రభుత్వం అక్కడ బోర్డు కూడా ఏర్పాటు చేసింది. పీవీ మార్గ్‌ను గవర్నర్ ప్రారంభించారు. పీవీ జ్ఞాన మార్గ్ లో ఉద్యానవనాలను నిర్మించనుంది.
26 అడుగుల ఎత్తులో కాంస్య విగ్రహం
2021 జూన్ 28 న పీవీ మార్గ్‌లోని జ్ఞానభూమిలో శతజయంతి ఉత్సవాలు ముగిశాయి. ఈ సందర్భంగా నెక్లెస్ రోడ్డులో 26 అడుగుల ఎత్తులో పీవీ కాంస్య విగ్రహాన్ని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌లో ఇప్పటివరకూ ఎన్నో భారీ విగ్రహాలుండగా.. తొలిసారి అధునాతన లేజర్ సాంకేతికత వినియోగించారు. అమెరికా నుంచి తెప్పించిన సీఎన్సీ యంత్రం ద్వారా పీవీ ముఖాన్ని అచ్చు గుద్దినట్లు సిద్ధం చేశారు. దాదాపు రూ. 27 లక్షలు వెచ్చించి15 మంది కళాకారులు రాత్రింబవళ్లు కష్టపడి… 17 రోజుల్లో దీనిని తీర్చిదిద్దారు. పీవీ కాంస్య విగ్రహాన్ని గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు. ఏడాది పాటు ఈ ఉత్సవాలను నిర్వహించడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఎనలేని కీర్తిని సంపాదించింది.
రాజకీయ ప్రయోజనాలు
కరుడుగట్టిన కాంగ్రెస్ వాదిగా గుర్తింపు పొందిన పీవీకి గులాబీ బాస్ అత్యంత ప్రాధాన్యం ఇవ్వడం రాజకీయం గా కూడా సంచలనం అయింది. మాజీ ప్రధాని కాబట్టి శత జయంతి నిర్వహించడం సాధారణమే. కానీ ఏడాది పాటు జరపాలన్న నిర్ణయం వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయన్న విమర్శలు కూడా వ్యక్త మయ్యాయి. ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ కు దెబ్బ కొట్టడంతో పాటు తెలంగాణ లోని పీవీ అభిమానుల దృష్టిని తమ వైపు తిప్పు కునే ప్రయత్నం చేస్తున్నారని పలువురు భావించారు. అనుకున్నట్లుగానే పీవీ కుటుంబం తెరాసకి చేరువైంది. పీవీ కుమార్తె ను ఎమ్మెల్సీని చేసి కెసిఆర్ వారి అభిమానం సంపాదించారు. సొంతపార్టీ నేతలు నిర్లక్ష్యం చేసినా టీఆర్‌ఎస్ ప్రభుత్వం పీవీని గుర్తించిందన్న పేరు పొందారు.