iDreamPost
android-app
ios-app

AP MLC Elections – మోగిన ఎమ్మెల్సీ నగారా.. ఎన్నిక లాంఛనమే.. వైసీపీలో సందడి

AP MLC Elections – మోగిన ఎమ్మెల్సీ నగారా.. ఎన్నిక లాంఛనమే.. వైసీపీలో సందడి

ఆంధ్రప్రదేశ్‌లో మరో ఎన్నికకు నగారా మోగింది. ప్రస్తుతం మిగిలిపోయిన స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో ఒక కార్పొరేషన్, 12 మున్సిపాలిటీలు, పలు పంచాయతీలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. ఈ ఎన్నికలకు ఈ నెల 16వ తేదీతో పోలింగ్‌ ముగుస్తుండగా.. తాజాగా ఎమ్మెల్యే కోటా, స్థానిక సంస్థల కోటాలోని ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం వేర్వేరుగా షెడ్యూల్ విడుదల చేసింది.

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 16వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. మరుసటి రోజు అంటే 17వ తేదీన నామినేషన్లను పరిశీలిస్తారు. 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటల లోపు నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చు. 29వ తేదీన ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అసెంబ్లీ ప్రాంగణంలో పోలింగ్‌ నిర్వహించనున్నారు. అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెల్లడించనున్నారు. ఈ ఎన్నికలకు రిటర్నింగ్‌ అధికారిగా అసెంబ్లీ డిప్యూటీ కార్యదర్శి సుబ్బారెడ్డిని ఎన్నికల సంఘం నియమించింది.

పోలింగ్‌ లేనట్లే..

అసెంబ్లీలో వైసీపీకి పూర్తి ఆధిక్యం ఉండడంతో.. ఎమ్మెల్సీ ఎన్నిక లాంఛనమే కానుంది. ఏకగ్రీవంగానే వైసీపీ అభ్యర్థులు గెలవబోతున్నారు. 175 మంది ఎమ్మెల్యేలకు గాను వైసీపీకి 151 మంది సభ్యులున్నారు. జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, టీడీపీ తరఫున గెలిచిన మద్ధాళి గిరి, వల్లభనేని వంశీ, కరణం బలరాం, వాసుపల్లి గణేష్‌కుమార్‌లు ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు. దీంతో టీడీపీ బలం 19కి పడిపోయింది. ఈ నేపథ్యంలో తగినంత బలం లేని కారణంగా టీడీపీ అభ్యర్థిని నిలబెట్టే పరిస్థితి లేదు. దీంతో మూడు ఎమ్మెల్సీ స్థానాలను వైసీపీ ఏకగ్రీవంగానే గెలుచుకోనుంది.

స్థానిక కోటా ఎమ్మెల్సీ స్థానాలకు..

స్థానిక సంస్థల కోటాలోని 11 ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 16వ తేదీన నోటిఫికేషన్‌ జారీ కానుంది. ఆ రోజు నుంచి 23వ తేదీ మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 24వ తేదీన పరిశీలన చేయనున్నారు. 26వ తేదీన ఉపసంహరణకు గడువు ఇచ్చారు. డిసెంబర్‌ 10వ తేదీన పోలింగ్‌ నిర్వహిస్తారు. 14వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో.. అత్యధిక స్థానాలను అధికార వైసీపీ గెలుచుకుంది. పలు జిల్లా పరిషత్, మండల పరిషత్‌లలో టీడీపీ కనీసం బోణి కూడా చేయలేకపోయింది. దీంతో స్థానిక కోటాలో జరగనున్న 11 ఎమ్మెల్సీ స్థానాలను వైసీపీ సులువుగా గెలుచుకోవడం లాంఛనమే.

Also Read : Mini Municipal Elections – మినీ పోరు.. వైసీపీకి ఛాన్స్‌ ఇవ్వని టీడీపీ