iDreamPost
android-app
ios-app

చంద్రబాబుకి జీవిత ఖైదు త‌ప్ప‌ద‌ట‌!

చంద్రబాబుకి జీవిత ఖైదు త‌ప్ప‌ద‌ట‌!

ఓ వైపు ఇప్ప‌టికే అమ‌రావ‌తి ఇన్ సైడ‌ర్ ట్రేడింగ్ పై వాద‌న‌లు జ‌రుగుతున్నాయి. ప్ర‌భుత్వం వ‌ద్ద బ‌ల‌మైన సాక్ష్యాలున్న‌ట్లు తెలుస్తోంది. మరోవైపు ఫైబ‌ర్ నెట్ స్కాం ను కూడా ఇటీవ‌లే సీఐడీ విచార‌ణ‌కు ఆదేశించింది. ఇటువంటి త‌రుణంలో చంద్ర‌బాబుకు జీవిత ఖైదు.. అంటూ వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్లు రాజ‌కీయంగా క‌ల‌క‌లం సృష్టిస్తున్నాయి. అలాగే తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదం నేపథ్యంలో చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌ల‌పై విజ‌య‌సాయిరెడ్డి ఫైర్ అయ్యారు.

త‌ర‌చూ టీడీపీ పైనా, చంద్ర‌బాబు పైనా ట్విట్ట‌ర్ వేదిక‌గా విరుచుకుప‌డే విజ‌య‌సాయి మరోసారి తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపరచేందుకు నాడు బాబు పన్నిన ‘ఓటుకు నోటు కుట్ర’ రాష్ట్రాన్ని ఇప్పటికీ పీడిస్తోందని ఆరోపించారు. తట్టాబుట్టా సర్దుకుని పారిపోయి రావడమే కాక, అక్రమ సాగునీటి ప్రాజెక్టులను చంద్రబాబు ప్రశ్నించలేకపోయాడని ఎద్దేవా చేశారు. ఓటుకు నోటు కేసులో అరెస్టు తప్పించుకునేందుకు ఐదు కోట్ల మంది జీవితాలను చంద్రబాబు తాకట్టు పెట్టాడని విజయసాయిరెడ్డి విమర్శించారు.

మీడియా సహకారంతోనే చంద్రబాబు ఇన్నాళ్లు రాజకీయాల్లో ఉండగలిగారని విజయసాయిరెడ్డి అన్నారు. ”అనుకూల మీడియా సాయంతో చంద్రబాబు ఇన్నాళ్లు రాజకీయాల్లో కొనసాగాడు. అదే ఇంకో రాష్ట్రంలో అయితే జీవిత ఖైదు పడి కారాగారంలో మగ్గేవాడు. దోచుకున్న డబ్బుతో ఓటర్లను ప్రభావితం చేయొచ్చని లక్షల కోట్లు పోగేశాడు తప్ప వారి సంక్షేమాన్ని ఏనాడూ పట్టించుకోలేదు. అన్నీ బయటికొస్తున్నాయి. తప్పించుకోలేడు” అని విజయసాయిరెడ్డి ఘాటుగా ట్వీట్ చేశారు.

‘తెలంగాణలో టీడీపీ ఉంటుంది.. కాంగ్రెస్ ఉంటుంది.. కేంద్రంలో బీజేపీ ఉంటుంది. అందులోకి పంపించిన ఎంపీలు పొత్తుల కోసం లాబీయింగ్ చేస్తుంటారు. తమరు చకోర పక్షిలా ఎదురు చూస్తుంటారు. ఏ ఎన్నికలొచ్చినా వామపక్షాల కాళ్లూ పట్టుకుంటారు. ఇదే కదా బాబూ మీ పొలిటికల్ ఫిలాసఫీ’ అని విజ‌యసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. త‌ర‌చూ విజ‌య‌సాయి చంద్ర‌బాబుపై ఆరోప‌ణ‌లు చేయ‌డం సాధార‌ణమే అయినా.. ‘‘అన్నీ బయటికొస్తున్నాయి. తప్పించుకోలేడు” అని విజయసాయిరెడ్డి కామెంట్ చేయ‌డం టీడీపీ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. త్వ‌ర‌లోనే ఏదో ఒక కేసులో చంద్ర‌బాబు చిక్కుకునే అవ‌కాశం ఉందా అనే అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి.