iDreamPost
android-app
ios-app

వైఎస్సార్ మీద వేసిన అస్త్రాలే జగన్ మీద సంధిస్తే ఎలా బాబూ..

  • Published Sep 30, 2020 | 4:21 AM Updated Updated Sep 30, 2020 | 4:21 AM
వైఎస్సార్ మీద వేసిన అస్త్రాలే జగన్ మీద సంధిస్తే ఎలా బాబూ..

చంద్రబాబుకి ఓ సమస్య ఉంది. ఆయన 1970ల చివరి అంకంలో రాజకీయ ఆరంగేట్రం చేశారు. 40ఏళ్ల తర్వాత కూడా ఆనాడు తాను నేర్చుకున్న అస్త్రాలను ఉపయోగించి అందలం దక్కించుకోవాలని ఆశిస్తుంటారు వైఎస్సార్ ఇలాకాలో ఇది కొంత పనిచేసింది. కాబట్టి దానినే వైఎస్ జగన్ మీద కూడా ప్రయోగించాలని ఆయన భావిస్తున్నట్టు కనిపిస్తోంది. చంద్రబాబుకి ప్రధాన బలంగా ఉన్న మీడియాలో రామోజీరావు కూడా 70ల నాటి ఎత్తులకు అలవాటుపడ్డారు. రాధాకృష్ణ కూడా వాటినే అనుసరిస్తూ జగన్ మీద కాలం చెల్లిన అస్త్రాలు సంధిస్తున్నట్టుగా స్పష్టమవుతోంది.

ఇటీవల ఏపీలో సామాజిక సంఘర్షణలు పెంచాలని విపక్షాలు బలంగా ప్రయత్నిస్తున్నాయి. ప్రధానంగా జగన్ కి బలమైన పట్టు కలిగిన ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలలో కొద్దిపాటి చీలక అయినా తీసుకురావాలని ఆశిస్తున్నాయి. వరుసగా చంద్రబాబు, అనుకూల మీడియా చేస్తున్న ప్రయత్నాలు గమనిస్తే ఈ విషయం స్పష్ట మవుతుంది. ఇటీవల విజయవాడ కేంద్రంగా ఎస్సీ సంఘాలు ఓ రౌండ్ టేబుట్ సమావేశం నిర్వహించాయి. ఆ మరునాడే మంద కృష్ణ మాదిగ ఏపీలో పర్యటన చేశారు. ఆ సమయంలోనే మదనపల్లిలో మాజీ జడ్జి సోదరుడిపై టీడీపీ అనుచరులు దాడికి పాల్పడ్డారు. ఇవన్నీ విడివిడిగా కనిపిస్తున్నప్పటికీ అంతా తమ పథకంలో భాగంగా టీడీపీ నేతలు నడుపుతున్నట్టుగా స్పష్టం అవుతుంది.

విజయవాడలో ఎస్సీ నేతల సమావేశం పేరుతో జగన్ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఎస్సీలకు జగన్ అన్యాయం చేస్తున్నారని అంటూనే అదే సమయంలో చంద్రబాబు పాలన బాగుందని కొందరు నేతలు చేసిన వ్యాఖ్యలు వారి అసలు రంగుని బయటపెట్టినట్టు సమావేశానికి హాజరయిన పలువురు అసంతృప్తి కూడా వ్యక్తం చేశారు. ఆ మరునాడే మాజీ జడ్జి సోదరుడి మీద దాడి జరిగిన తీరు సందేహాలకు తావిస్తోంది. ఆ దాడి ఘటనను తొలుత టీడీపీ నేతలు ప్రచారం చేయడం విశేషంగానే చూడాల్సి ఉంటుంది. చంద్రబాబు నేరుగా డీజీపీ కి లేఖ రాయడం, నారా లోకేష్ ట్విట్టర్ లో సదరు వీడియోలు పోస్ట్ చేయడం గమనిస్తే వ్యవహారం మరింత సులువుగా అర్థమవుతుంది. వాటికి కొనసాగింపుగా మంద కృష్ణమాదిగ ఏపీలో పర్యటన చేశారు. ఆయన ఎస్సీ రిజర్వేషన్ల అంశం మీద మాట్లాడితే ఎవరూ అభ్యంతరం పెట్టడానికి లేదు. సుదీర్ఘకాలంగా ఆయన దానికోసం పోరాడుతున్న నేత కాబట్టి సాదారణ విషయమే అవుతుంది. కానీ అనూహ్యంగా అమరావతి అంశం చుట్టూ ఆయన పర్యటన సాగింది. అమరావతిని కొనసాగించాలనే రీతిలో మంద కృష్ణ మాట్లాడినట్టుగా ఈనాడు సహా ఓ వర్గం మీడియాలో వచ్చిన కథనాలు గమనిస్తే వారి వ్యవహారం మరింత బాహాటంగా బోధపడుతుంది.

దానికి ముందు వివిధ ఆలయాల చుట్టూ సాగించిన చర్చ కూడా గమనించాల్సి ఉంటుంది. అనేక చోట్ల టీడీపీ నేతలే ఈ దాడులకు ప్రధాన సుత్రధారులుగా, పాత్రదారులుగా ఇప్పటికే బయటపడ్డారు. కొన్ని చోట్ల మందుబాబులు, ఆకతాయిలు చేసిన అల్లరి పనులకు కూడా రాజకీయరంగు పులమడానికి టీడీపీ చేసిన ప్రయత్నాలు బయటపడ్డాయి. మరింత స్పష్టంగా ఆలయాలకు సంబంధించిన దాడుల విషయంలో 2017,18 నాటి ఘటనలతో పోలిస్తే 2020లోనే తక్కువగా జరిగిన విషయాలను డీజీపీ అధికారిక లెక్కల ద్వారా ప్రకటించారు. అయినప్పటికీ ఏపీలో మత పరమైన దాడులు పెరిగినట్టు చంద్రబాబు పెద్ద రాద్ధాంతం చేసేందుకు చేసిన ప్రయత్నం ఫలించలేదని అర్థమవుతోంది.

అయితే ఇలాంటి కుల, మత అంశాలను ఎన్ని సార్లు విఫలమయినా పదే పదే ప్రస్తావించడంలో చంద్రబాబు తన అనుభవాన్ని చాటుకుంటున్నారు. ఒక విషయాన్ని వంద సార్లు చెప్పడం ద్వారా కొందరినైనా నమ్మించగలమనే గ్లోబెల్స్ సూత్రాన్ని పాటిస్తున్నట్టు స్పష్టమవుతోంది. గతంలో వైఎస్సార్ విషయంలో కూడా తిరుమల కొండలను కుదిస్తున్నారనే ప్రచారం ఉధృతంగా చేపట్టిన టీడీపీ చాపకింద నీరులా దానిని తీసుకెళ్లింది. కొందరినైనా నమ్మించేందుకు అది దోహదపడింది. అప్పట్లో ఎన్టీఆర్ కి వెన్నుపోటు విషయంలో కూడా ఇలాంటి అబద్ధాలే ప్రధాన వనరు. చంద్రబాబు వెంట భారీగా ఎమ్మెల్యేలు వచ్చేశారంటూ ఇతర ఎమ్మెల్యేల్లో అపోహలు పెంచడం ద్వారా వారిని దగ్గరకు చేర్చుకోవడంలో నాటి చంద్రబాబు, రాజగురు అనుసరించిన మార్గం చాలామందికి గుర్తుండే ఉంటుంది. అలాంటి సూత్రాలే వైఎస్సార్ విషయంలో కూడా కొంతమేరకు చేశారు. చివరకు దివంగత ముఖ్యమంత్రి మరణానికి కూడా తిరుమల విషయమే కారణమని ఆరోపించడానికి సైతం వెనకాడలేదు.

రాజకీయంగా తమ ఎదుగుదలకు ఎంతటి నీచానికైనా సిద్ధపడే నేతృత్వం ఉన్న బ్యాచ్ కి ఇప్పుడు కాలం చెల్లింది. దానికి కారణం అబద్ధాలు ఎన్ని మార్లు, ఎంత బలంగా చెప్పినా దానిని నిరూపించడానికి ఇప్పుడు మీడియా విస్తృతమయ్యింది. గట్టిగా చెప్పిన విషయమే నిజమయిపోయే ప్రమాదానికి చోటు లేదు. చంద్రబాబు ఎన్ని సార్లు బలంగా వాదించినా , దానిని ఎల్లో మీడియా ఎంత అందంగా వల్లించినా విషయం చెరిగిపోదు. చెదిరిపోదు. వాస్తవాలు జనం మీదుకు తీసుకురావడానికి ఇప్పుడు అందరికీ అవకాశాలున్నాయి. దాంతో అబద్ధాలనే ఆధారంగా చేసుకుని ఎదగాలనే, అపోహలతో అందరిని వంచించాలనే అస్త్రాలు ఇప్పుడు పెద్దగా ఫలితాలివ్వడం లేదు. తాజా పరిణామాలే దానికి పెద్ద ఉదాహరణలు. కుల, మత వివాదాలను సృష్టించాలని చేస్తున్న యత్నాలకు ఫలితం కనిపించడం లేదని బాబు అండ్ బ్యాచ్ బాధపడినా పెద్ద ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఇది 70,80ల నాటి రాజకీయాలు కాదని గ్రహించాలి. బాబు విజన్ 2020 ని కూడా దాటిపోయి మూడు నెలల్లో 2021 రాబోతోంది. కాబట్టి ఇక చంద్రబాబుకి కాలం చెల్లినట్టే భావించాల్సి ఉంటుంది.