Idream media
Idream media
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడి కంచుకోట కుప్పం మున్సిపాలిటీ లో కూడా వైసీపీ జెండా ఎగరడం రాజకీయాల్లో పెనుసంచలనానికి దారి తీసిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ ఎన్నికల అనంతరం.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. తలకిందులుగా తపస్సు చేసినా వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు కుప్పంలో గెలవరని చాలా కాన్ఫిడెంట్ గా వెల్లడించారు. ఆ తర్వాత.. అంతకు ముందు కూడా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే.. ఓ పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి, ఆ ప్రాంతంతో మూడు దశాబ్దాల అనుబంధం ఉన్న చంద్రబాబు ఓటమి అంత ఈజీ కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ.. టీడీపీలోనూ, అధినేతలో కూడా గెలుపుపై ఎక్కడో మూల కాస్త అనుమానాలు మొదలైనట్లుగా వరుస పరిణామాలు తెలియజేస్తున్నాయి.
కుప్పం నియోజకవర్గం నుంచి ఏడుసార్లు చంద్రబాబు ఎమ్మెల్యేగా గెలిచారు. సాధారణంగా ఎన్నికలప్పుడు లేదా అతి ముఖ్యమైన కార్యక్రమం ఉన్నప్పుడు తప్పా.. ఆయన కుప్పంవైపు పెద్దగా చూసేవారు కాదు. కానీ.. మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల అనంతరం బాబులో చాలామార్పు కనిపిస్తోంది. తరచూ కుప్పంలో పర్యటిస్తున్నారు. గతానికి భిన్నంగా నాయకులతోనే కాకుండా, కేడర్ ను కూడా కలుస్తున్నారు. ఫలితాలపై సమీక్ష కూడా బాబు కుప్పంనుంచే మొదలుపెట్టారు. ఇప్పుడు తాజాగా టీడీపీ ఆధ్వర్యంలో ప్రతీ శుక్రవారం గ్రీవెన్స్ డే నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ వారం నుంచే ప్రారంభించారు కూడా. ఆయన పీఏ మనోహర్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రజలు తమ సమస్యలను స్థానిక ఎమ్మెల్యే చంద్రబాబుకు చెప్పుకునే అవకాశం కల్పించేందుకు ప్రతి శుక్రవారం గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
ఈ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మనోహర్ సూచించారు. ఈ సందర్భంగా పలువురు తమ సమస్యలను వినతుల రూపంలో సమర్పించగా.. క్యాన్సర్‌తో బాధపడుతున్న గజేంద్ర అనే వ్యక్తిని ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా బసవతారకం ఆసుపత్రికి రిఫర్ చేశారు. అయితే.. హఠాత్తుగా కుప్పం వేదికగా చంద్రబాబు పలు కార్యక్రమాలు చేపడుతుండడం టీడీపీ కేడర్ ను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇందుకు ఓటమిపై బాబులో కూడా భయం మొదలుకావడమే అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే.. 1989 నుంచీ వరుసగా కుప్పంలో అధిక మెజార్టీతో గెలుస్తూ వస్తున్న బాబు వైసీపీ పోటీలో నిలబడ్డాక 2014, 2019 ఎన్నికల్లో గతంతో పోలిస్తే మెజార్టీ తగ్గుతూ వచ్చింది.
2004 ఎన్నికల్లో చంద్రబాబుకు 60 వేల ఓట్ల మెజార్టీ రాగా, మొన్నటి ఎన్నికల్లో కేవలం 30 వేల ఓట్ల మెజార్టీ వచ్చింది. ఈ లెక్కలు బేరీజు వేసుకుని గట్టి ప్రత్యర్థిని కుప్పం బరిలో దింపితే బాబు ఓటమి ఖాయమని పెద్దిరెడ్డి వ్యూహరచన చేస్తున్నారు. దీనికి తోడు.. స్థానిక ఎన్నికల ఫలితాలను చూస్తే కుప్పంలో టీడీపీ హవా తగ్గుతోందనే విషయం స్పష్టమైంది. ఏకంగా కుప్పం మున్సిపాలిటీలో కూడా ఓటమి పాలైంది. ఇవన్నీ బేరీజు వేసుకునే ఇటువంటి పరిస్థితుల్లో గెలవాలంటే కుప్పంపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాల్సిందేనన్న నిర్ణయానికి చంద్రబాబు వచ్చినట్లుగా కనిపిస్తోంది. ఎప్పుడూ లేనిది తాజాగా ప్రారంభించిన గ్రీవెన్స్ డే ఇందుకు మరో ఉదాహరణ.