iDreamPost
iDreamPost
ప్రతిపక్ష తెలుగుదేశం నేతలు తీవ్ర అసహనంతో ఉన్నట్టు కనిపిస్తోంది. అసెంబ్లీ గేటు వద్ద పార్టీ అధినేత చంద్రబాబు నడిపించిన ప్రహసనం ఇప్పటికే సభలో పెద్ద చర్చకు దారితీసింది. దానికి అనుగుణంగానే అధినేత బాటలో మిగిలిన నేతలు సాగుతున్నారు. తాజాగా ఏపీ టీడీపీ విభాగం అధ్యక్షుడిగా చెప్పుకునే కళా వెంకట్రావు కామెంట్స్ అందుకు తగ్గట్టుగానే ఉన్నాయి. సీఎం జగన్ ని ఉద్దేశించి విమర్శలు చేసే క్రమంలో ఆయన హద్దు మీరిన వ్యవహారం సామాన్య ప్రజానీకాన్ని కూడా విస్మయానికి గురిచేస్తోంది. తెలుగుదేశం నేతలకు అధికారం కోల్పోయిన తర్వాత కూడా అసలు విషయం బోధపడుతున్నట్టుగా లేదనే అభిప్రాయం వినిపిస్తోంది.
వైఎస్ జగన్ ప్రతిపక్ష నేతగా ఉండగా ఏపీ అంతటా పాదయాత్ర చేయడం ఓ చరిత్రగా చెప్పవచ్చు. అప్పటికే పలువురు నేతలు పాదయాత్రలు చేసినప్పటికీ జగన్ మాత్రం సుదీర్ఘకాలం, సుదూరం పాటు సాగించిన పాదయాత్ర విశేషంగా నిలుస్తోంది. అయినా దానిని కూడా ఎగతాళి చేయడానికి టీడీపీ నేతలు సిద్ధపడ్డారు. పాదయాత్ర సమయంలో కూడా ఇలాంటి ప్రయత్నాలు చాలా చేశారు. సహజంగానే నాడు అధికారంలో ఉన్నారు కాబట్టి కొంత హద్దులు మీరి వ్యవహరించారు. జగన్ నడిచిన ప్రాంతంలో పసుపు నీళ్లు కూడా జల్లి ప్రజాగ్రహానికి గురయ్యారు. ఫలితం కూడా అనుభవిస్తున్నారు. అయినా తీరు మారుతున్నట్టుగా లేదు. అందుకు తాజాగా కళా వెంకట్రావు ఆ పాదయాత్రపై చేసిన వ్యాఖ్యలున్నాయి.
ఎన్నికల ముందు జగన్ జులాయిలా తిరిగి లేనిపోని వాగ్ధానాలు చేశారంటూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు మండిపడ్డారు. జగన్ పాదయాత్రను ఎద్దేవా చేయడానికి ఆయన ప్రయోగించిన పదజాలం విమర్శలకు దారితీస్తోంది. పైగా ప్రజల్లో ఉంటూ, వారి సమస్యలు వింటూ ముందుకు సాగడాన్ని కూడా తప్పుబట్టిన తీరు విస్మయకరంగా కనిపిస్తోంది. ఇప్పటికే పాదయాత్ర ద్వారా విశేష ప్రజాదరణ పొంది, చరిత్ర సృష్టించిన ఫలితాలతో అధికారంలో ఉన్న జగన్ తన హామీలను అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. అందుకు సమస్యలున్నా శ్రమిస్తున్నట్టుగా ప్రజలు భావిస్తున్నారు. అలాంటి సమయంలో నాటి పాదయాత్రను, ఆ హామీలను విమర్శించడం ద్వారా టీడీపీ నేతలు తమ పరిస్థితిని చాటుకుంటున్నట్టుగా పలువురు భావిస్తున్నారు. ఇలాంటి వ్యాఖ్యల ద్వారా ప్రజల్లో పలుచన కావడమే తప్ప, పెద్దగా ఫలితం ఉండదని గ్రహించలేకపోతున్నారనే అభిప్రాయాన్ని పలువురు పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.