Idream media
Idream media
చంద్రబాబు గారు , మీరు ఈ రాష్ట్రంలో సీనియర్ రాజకీయ నాయకుడు. సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా ఉన్నారు. బహుశా దేశంలోనే సీనియర్ ముఖ్యమంత్రుల్లో మీరొకరు. సహజంగానే మీకు ప్రజల పట్ల బాధ్యత, వివేకం , విచక్షణ ఉండాలి. మరి ఈ కరోనా కాలంలో లక్షల మంది కష్టాల్లో ఉన్నప్పుడు మీరు చేయాల్సిందేంటి? చేస్తున్నదేంటి?
వీడియో కాన్ఫరెన్స్‌ల్లో జగన్‌ని , ప్రభుత్వాన్ని తిట్టడం మీ కొడుకు, మనవడితో ఆడుకోవడం. ఆడుకోండి , తప్పులేదు. ప్రజలతో ఆడుకోకండి.
న్యాయంగా అయితే మీరు ఇప్పుడేం చేయాలి? ప‌్రజల కోసం నిలబడాలి. ప్రభుత్వం చేస్తున్న యుద్ధానికి మద్దతుగా ఉండాలి. వయస్సు రీత్యా మిమ్మల్ని ఇంట్లో నుంచి బయటకి రమ్మని అనడం లేదు. రాకుండా కూడా చాలా చేయొచ్చు.
అధికారిక , ఆదాయపు పన్నుల లెక్కల ప్రకారం చూసినా మీ ఆస్తి వందల కోట్లు (మీ మనవడితో కలిపి వెయ్యి దాటొచ్చు) ఉంటుంది కదా! మరి ఒక పది కోట్లు ఇవ్వడానికి మీకు మనసొప్పిందా? జగన్‌కి ఇవ్వడం ఇష్టం లేకపోతే మీ పాత మిత్రుడు మోడీకి ఇవ్వొచ్చు కదా!
నారావారిపల్లెలో రెండెకరాలతో జీవితం ప్రారంభించి ఇక్కడి వరకు (జూబ్లీహిల్స్) వచ్చావు. మరి నువ్వు పుట్టిన నేలకు ఏమైనా చేశావా? మీతో పోల్చుకుంటే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆర్థికంగా చాలా బలహీనుడు కదా! మరి ఆయన ఎంత చేస్తున్నాడో మీ ఊళ్లో అడిగితే చెబుతారు. అదంతా డబ్బులుండి చెవిరెడ్డి చేయడం లేదు. చేయాలనే కమిట్‌మెంట్ ఉంది కాబట్టే నియోజకవర్గంలో అందరికీ అండగా ఉంటున్నాడు.
సరే, చంద్రగిరి వదిలేద్దాం. మిమ్మల్ని అన్ని సార్లు గెలిపించిన కుప్పం పరిస్థితి ఏంటి? అక్కడి ప్రజలకు ఏమైనా చేశారా? చివరికి మీ హెరిటేజ్‌లో కూరగాయలైనా ఉచితంగా ఎవరికైనా ఇచ్చారా? (అవి అమ్మేశామని చెబుతారు కానీ, ఉంటే మాత్రం ఇస్తారా?)
ఇంట్లో కూచుని , మీ లాన్‌లోని దుమ్ము ఎత్తి జగన్ మీద పోస్తున్నారు. పిల్లి శాపాలకి ఉట్లు తెగవ్.
ప్రభుత్వాన్ని విమర్శించడం మీ బాధ్యత, ప్రతిపక్షంలో ఉంటే ఇదే పనిమీద ఉంటారు. మంచిదే. కానీ సమయం సందర్భం ఉండొద్దా? ఏది పడితే అది మాట్లాడటమేనా?
డాక్టర్లకి రక్షణ లేదు అని అరిచారు. ప్రపంచమంతటా డాక్టర్లు రిస్క్‌లోనే పని చేస్తున్నారని మీకు తెలియకపోవచ్చు. పేపర్లలో రాయించడమే తప్ప చదివే అలవాటు మీకు లేదు కదా! ఈ విమర్శ వల్ల డాక్టర్ల నైతిక బలం దెబ్బతింటే, అది ప్రజలకి నష్టం కదా!
టెస్ట్‌లు సరిగా చేయడం లేదని అన్నారు. కేసులు పెరిగితే కరోనా కంట్రోల్ లేదు అన్నారు. తగ్గితే కేసుల సంఖ్య దాస్తున్నారు. కిట్లు కొంటే కమీషన్లు తీసుకున్నారు. పన్ను పీకడానికి సింగపూర్ వెళ్లి లక్షల బిల్లు పెట్టుకున్న మీ సహచరులు కూడా కమీషన్ల గురించి మాట్లాడితే ఎట్లా సార్?
చివరికి ఏమీ లేదని తేలితే , ఇంకో కొత్తది వెతుకుతారు. జగన్ ఇంట్లో కూచున్నాడు అంటారు. బయటికొస్తే సెక్యూరిటీ వల్ల సోషల్ డిస్టెన్స్ లేదు అంటారు. శ్రీరామా అన్నా బూతేనా?
బియ్యపు మధుసూదన్‌రెడ్డి వల్ల కాళహస్తిలో కరోనా పెరిగిందని అంటారు. మరి హిందూపురంలో కూడా కరోనా పెరిగింది. మరి దానికి బాలకృష్ణ కారణమా? మీ వియ్యంకుడు హిందూపురంలో లేడు. మధుసూదన్‌రెడ్డి రేయింబవళ్లు కాళహస్తి ప్రజలకి అందుబాటులో ఉన్నాడు. అక్కడి ప్రజల్ని అడిగితే చెబుతారు. మధు ఎంత మంది ఆకలి తీరుస్తున్నాడో!
అయినా ఏ ఎమ్మెల్యే అయినా ప్రజలకి కరోనా వ్యాపించాలని కోరుకుంటాడా? విమర్శ కూడా న్యాయంగా ఉండాలి. క్రూరంగా కాదు.
రోజా పువ్వులు చల్లించుకొందని ఇంకో విమర్శ. నాయకుల రోజువారీ కార్యక్రమంలో వాళ్లతో సంబంధం లేకుండా చాలా పనులు జరుగుతాయి. అవన్నీ నాయకులు దగ్గరుండి చేయించరు.
తుపాను సందర్భాల్లో మీరు పర్యటనకి వెళితే మీ నాయకులు స్వాగతాలు పలికేవాళ్లు. కష్టకాలం కదా అని మీరెపుడైనా వారించారా? పుష్కరాల్లో అంత మంది చనిపోతే మీరేమైనా సంతాపంగా నల్లబట్టలు వేసుకుని తిరిగారా?
అయినా రోజా పువ్వులే కదా చల్లించుకున్నారు. రోజా మీ పార్టీలో ఉంటే కష్టకాలంలో పూల రైతుల్ని ఆదుకున్న రోజా అని రాసేవాళ్లు.
ఆర్థికంగా ఇన్ని ఇబ్బందుల్లో కూడా జగన్ మహిళలకి వడ్డీలేని రుణాలు ఇస్తే అది కూడా విమర్శించడమేనా? మీరు చేయలేని పని చేస్తున్నాడా లేదా?
మీ హయాంలో (1999-2004) పెన్షనర్ల DA కట్ చేసిన మీరు కూడా పెన్షనర్ల కష్టాల గురించి మాట్లాడితే ఎట్లా?
జీవితం ప్రతివాళ్లకి అవకాశాన్ని ఇస్తుంది. ఇప్పుడు కరోనా మన జీవితాల్ని శాసిస్తోంది. ప్రజలు కష్టాల్లో ఉన్నారు. ప్రజల నుంచి తీసుకున్నది ఎంతో కొంత తిరిగి ఇవ్వడానికి ఇది అవకాశం. కరోనా ఒక గీటు రాయి. మనం చరిత్రలో ఉంటామో , చరిత్ర హీనులుగా ఉంటామో అది నిరూపిస్తుంది.
జగన్ పనులకి అడ్డుపడి, ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా ప్రజల కోసం ఏం చేయాలో ఆలోచించండి. తీసుకున్నది తిరిగి ఇవ్వకపోతే లావై పోతారు.
అయినా మీరు జీరో నుంచి ప్రారంభమయ్యారు కాబట్టి ఎంత ఇచ్చినా మీకు పోయేదేమీ లేదు.
చెయ్యి పొడుగ్గా సాచకపోతే, అది నీ నోటి వరకూ కూడా రాకుండా పోతుంది అని ఖురాన్‌లో ఒక సూక్తి ఉంది. సూక్తులు చెప్పడం కాదు, వినడం కూడా అలవాటు చేసుకోండి. తినడం, తీసుకోవడమే కాదు, ఇవ్వడం కూడా నేర్చుకోండి.