Idream media
Idream media
ఏపీలో జిల్లాల పునర్విభజన తెలుగుదేశానికి మింగుడు పడడం లేదన్న విషయం స్పష్టమవుతోంది. ఓ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడంపై అంతగా స్పందించని ఆ పార్టీ నేత చంద్రబాబునాయుడు.. సర్కారును విమర్శించేందుకు మాత్రం ఏదో వంక కోసం చూస్తున్నారు. ఏపీలో గురుకుల విద్యాసంస్థలకు దివంగత లోక్‌సభ స్పీకర్ బాలయోగి పేరు తొలగించారంటూ రాద్దాంతం చేయడం మొదలుపెడుతున్నారు. రాష్ట్రంలో చోటుచేసుకున్న ఈ కీలక మార్పును పెద్దగా జీర్ణించుకోలేక వింత వాదనలను తెరపైకి తెస్తున్నారు. జగన్ సర్కారుకు చిత్తశుద్ది ఉంటే కొత్త జిల్లాలకు అంబేద్కర్ పేరు ఎందుకు పెట్టలేదని ప్రశ్నిస్తున్న చంద్రబాబుకు ఎన్నో ప్రశ్నలు ఎదురవుతున్నాయి.
కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను జగన్ సర్కారు చాలా సమర్ధవంతంగా నిర్వహించింది. అందులోనూ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ను గౌరవిస్తూ కృష్ణా జిల్లాకు ఆయన పేరు పెట్టడం విపక్షానికి షాక్ ఇచ్చింది. దీంతో మింగలేక.. కక్కలేక అన్నట్లుగా.. జిల్లాల పునర్వ్యవస్థీకరణను స్వాగతించలేక, రచ్చ చేయలేక ఏవోవో కారణాలు చెబుతున్నారు. జనాభా గణనకు లింకు పెడుతూ అసలు జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియే ఆగిపోతుందంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. ఎన్టీఆర్ నుంచి తెలుగుదేశం పార్టీ పగ్గాలు లాక్కుని, అనేక సంవత్సరాలు సీఎంగా పనిచేసినా చంద్రబాబు ఆయనకు గౌరవం ఎందుకు ఇవ్వలేదనేది ప్రశ్నార్థకంగా మారింది. కృష్ణా జిల్లాలో పుట్టి సినీ రంగంలో నట సార్వభౌముడిగా, రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పిన గొప్ప నేతగా ఎదిగిన ఎన్టీఆర్‌కు సముచిత గౌరవం కల్పించాలనే డిమాండ్ ఎంతోకాలం నుంచి ఉంది. కానీ సుదీర్ఘ కాలం అధికారంలో ఉన్న చంద్రబాబు పట్టించుకోలేదు.
ఎన్టీఆర్ కుటుంబ సభ్యులూ బాబును ప్రశ్నించలేదు. ఎన్టీఆర్ వారి ఆరాధ్య దైవమని చెప్పుకోవడానికే చంద్రబాబు, కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు పరిమితమయ్యారు. ప్రతి ఏటా టీడీపీ మహానాడులో మాత్రం ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని తీర్మానం చేసేవారు. అందుకోసం ఏనాడూ కేంద్రాన్ని సంప్రదించలేదు. కేంద్రంలో చంద్రబాబు చక్రం తిప్పినట్లు చెప్పుకునే రోజుల్లోనూ ఆ ప్రయత్నం చేయలేదు. ఎన్టీఆర్‌కు భారతరత్న రావడం బాబుకు ఇష్టం లేనందునే ప్రయత్నం చేయలేదనే వాదన పార్టీలో ఉంది. ఎన్టీఆర్ పట్ల గౌరవం ఉన్నట్లు నటించి కార్యకర్తలు, అభిమానుల్ని నమ్మించే ప్రయత్నం చేయడం తప్ప నిజంగా చంద్రబాబుకు ఎన్టీఆర్ పట్ల ప్రేమలేదని దేవినేని నెహ్రూ లాంటి నాయకులు గతంలో బహిరంగంగానే చెప్పారు.
ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట ప్రకారం వైఎస్ జగన్ కొత్త జిల్లాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. అంతకు ముందు వరకు జిల్లాల పునర్వ్యవస్థీకరణే జరగదని, జనాభా గణన జరక్కుండా కొత్త జిల్లాలు ఏర్పాటు చేయవద్దని కేంద్రం చెప్పినట్లు దుష్ప్రచారం నడిచేది. అనంతరం కూడా ఎల్లో మీడియా, సోషల్ మీడియాలో కొత్త జిల్లాల ప్రక్రియ ఆగిపోతుందంటూ విషప్రచారం చేస్తున్నారు. దీన్నిబట్టి కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడాన్ని టీడీపీ జీర్ణించుకోలేకపోతున్నట్లు అర్థమవుతోంది. పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఎందుకు ఒక్క జిల్లాకు ఎన్టీఆర్ పేరును పెట్టే ప్రయత్నం చేయలేదని ఆ పార్టీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ యే విమర్శించారు. ఎన్టీఆర్ పేరు పెట్టాలని ఎన్నోమార్లు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఆరోపించారు. మరి అలాంటి చంద్రబాబు ఇప్పుడు కొత్త జిల్లాలు, పేర్లపై రాజకీయాలు చేయడంపై విభిన్న వాదనలు తెరపైకి వస్తున్నాయి.