iDreamPost
android-app
ios-app

బాబుకు మిగిలిన సైన్యం వీళ్ళే …!

  • Published May 05, 2020 | 8:08 AM Updated Updated May 05, 2020 | 8:08 AM
బాబుకు మిగిలిన సైన్యం వీళ్ళే …!

ప్రస్తుత పరిణామాలు గమనిస్తే టీడీపీ లో పలువురు సీనియర్ నేతలు బాబు తరహాలో అధికార పక్షం పై విమర్శలు చేయటానికి ఇష్టపడట్లేదు అనే చెప్పొచ్చు . టీడీపీ అధికారంలో ఉండగా వైసీపీ పై తీవ్ర స్వరంతో విమర్శలు చేసిన పలువురు సీనియర్ ఎమ్మెల్యేలు, మంత్రులు నేడు కనీసం ప్రెస్ ముందుకు రావడానికి కూడా ఇష్టపడుతున్నట్లు లేదు . టీడీపీ పార్టీ స్థాపించిన తర్వాత ఊహించని స్థాయి ఓటమి గత ఎన్నికల్లో ఎదురైంది . బాబు మంత్రి వర్గంలో ఒక్క అచ్చెన్నాయుడు తప్ప లోకేష్ సహా మంత్రులందరూ దారుణ ఓటమికి గురయ్యి ప్రస్తుత ఇబ్బందికర పరిస్థితుల్లో బాబు గారికి అందుబాటులో లేకుండా పోయారు . ఇందుకు ప్రధాన కారణం ఈ రోజు చేసిన విమర్శని , డిమాండ్ ని మరుసటి రోజుకి తనకి కన్వినెంట్ గా మార్చి చెప్పే బాబు విధానాల వలన తాము ప్రజల్లో మరింత అభాసుపాలు కాకుండా ఉండటం కోసమే అనేది వినటానికి బాబు గారికి కష్టమైనా నిష్ఠుర సత్యం .

స్వయంగా తండ్రి , ముఖ్యమంత్రి చంద్రబాబు చేత యూత్ ఐకాన్ గా గుర్తించబడి తన సక్సెస్ స్టోరీనే యువతకి ఆదర్శం అని ప్రకటించుకున్న ఆదర్శవాది , ఎమ్మెల్సీగా మూడు పోర్ట్ పోలియోలకు మంత్రిగా పనిచేసిన నారా లోకేష్ మంగళగిరి ఓటమి తర్వాత ప్రజాక్షేత్రంలోకి కానీ , మీడియా ముందుకు కానీ రాకుండా ట్విట్టర్ కే పరిమితం అయ్యాడు . చివరికి కొన్ని మీడియా సంస్థలు అడపాదడపా లోకేష్ చేసే ట్విట్టర్ పోస్ట్ లని తీసుకొని యువనాయకుడు లోకేష్ ఈవిధంగా వెల్లడించారు అని వార్తలు రాయటం తప్ప పౌర సమాజానికి లోకేష్ దూరమయ్యి కుటుంబంతో విశ్రాంత జీవితాన్ని గడుపుతున్నాడని చెప్పొచ్చు .

తన అస్తిత్వాన్ని , పార్టీని కాపాడుకునే చివరి ప్రయత్నంలో బాబు గారి వెంట నిలిచి ఉన్న సైన్యం వర్ల రామయ్య , పంచమర్తి అనురాధ , వంగలపూడి అనిత , హెల్త్ డ్రింక్ మినిస్టర్ గా గుర్తింపు పొందిన జవహర్ . పలు అనుభవాల తర్వాత కూడా వీరికి బాబు మార్క్ రాజకీయం అవగతం కాలేదనే చెప్పొచ్చు . గత ఎన్నికల్లో వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన కోసం పోటీ చేసే అవకాశం ఇవ్వకుండా పక్కన పెట్టిన వర్ల రామయ్యకి అంతకు ముందే రాజ్యసభ పదవి విషయంలో రిక్త హస్తం చూపిన బాబు గారు తాజాగా మెజారిటీ ఓటింగ్ లేని రాజ్యసభ సీటుకి నామినేషన్ వేయించి నవ్వుల పాలు చేసినా తత్వం బోధపడినట్టు లేదు .

అలాగే సిట్టింగ్ సీట్ పాయకరావుపేట ఇవ్వకుండా ,జిల్లా మార్చి కొవ్వూరు సీట్ ఇచ్చి ఓటమికి కారణమైనా వంగలపూడి అనితకు జ్ఞానోదయం అయ్యినట్టు లేదు .

ఇహ ఎక్స్ మినిష్టర్ జవహర్ గెలుపు మీద నమ్మకం లేని బాబు సిట్టింగ్ కోవూరు సీట్ ఇవ్వకుండా తిరువూరు ఇవ్వగా అక్కడా ఓటమి పాలయ్యి ప్రస్తుతం బాబు మార్క్ విమర్శలను అందిపుచ్చుకొంటూ బాబు దృష్టిలో నిలిచే ప్రయత్నం చేస్తున్నాడు కానీ ఓడిన వారికి బాబు ఇచ్చే విలువ త్వరలోనే జవహర్ కి అవగతం కావొచ్చు .

చివరిగా అయినా గట్టిగా చెప్పుకోవాల్సింది పంచమర్తి అనురాధ గురించే , అంశం ఏదైనా తరుచు ప్రెస్ ముందుకొచ్చి తీవ్ర విమర్శలు చేసే అనురాధ కొన్ని సార్లు అసత్య ఆరోపణలు సైతం చేస్తూ మాటలదాడి చేస్తుంది . అయితే ఇదంతా రాబోయే కాలంలో విజయవాడ మేయర్ అభ్యర్థిత్వం కోసం అనేవాళ్ళు లేకపోలేదు . బాబు గారు ఈమె ఆశలైనా నెరవేరుస్తాడో లేక పలువురికి చివరి నిమిషంలో రిక్తహస్తం చూపినట్టు ఈమెకీ చూపి తన నైజాన్ని మరోసారి బయటపెట్టుకొంటాడో వేచి చూడాలి .