Idream media
Idream media
సీఎం మారిన ప్రతిసారీ రాజధానులు మార్చుకుంటూ వెళితే ఎలా అని ప్రతిపక్షనేత, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలే తప్ప పాలనా వికేంద్రీకరణ వల్ల అభివృద్ధి సాధ్యం కాదన్నారు. మూడు రాజధానులపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని, చిన్నవాడైనా జగన్‌ను చేతులెత్తి వేడుకుంటున్నానన్నారు.
రాజధానుల అంశంపై అసెంబ్లీలో చంద్రబాబు సోమవారం మాట్లాడుతూ ఒక రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలనేదే తమ సిద్ధాంతమన్నారు. విభజన చట్టంలో ఒక రాజధాని మాత్రమే ఉండాలని ఉంది అంతేతప్ప మూడు రాజధానుల గురించి లేదన్నారు. భావి తరాల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని టీడీపీ రాజధానిగా విజయవాడ – గుంటూరును ఎంచుకుందన్నారు.
ముఖ్యమంత్రులు మారిన ప్రతిసారీ రాజధానులు మార్చుతూ పోతారా.? ప్రపంచ వ్యాప్తంగా అందరూ అభివృద్ధి వికేంద్రీకరణ గురించి మాట్లాడుతుంటే మన రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణ గురించి మాట్లాడుతున్నారని, చరిత్రగురించి తెలియనివారు మాత్రమే దిల్లీ, చెన్నై రాజధానుల గురించి మాట్లాడుతున్నారన్నారు చంద్రబాబు. రాజధానుల వల్ల అభివృద్ధి జరగదు.. అభివృద్ధి చేస్తేనే జరుగుతుంది.
అమరావతి భూముల్లో పటుత్వం లేదని వైసీపీ నేతలు చెబుతున్నారు. అసెంబ్లీ భవనం తాత్కాలికం కాదు.. ఇది ట్రాన్సిట్ బిల్డింగ్.. ఇంగ్లిష్ అర్థం కానివారే అలా మాట్లాడుతున్నారన్నారు. దీనిపై మంత్రి బొత్స కల్పించుకుని.. ఇది శాశ్వత భవనం కానప్పుడు మరొక భవనం ఎందుకు కడుతున్నారని, రూ.14వేల కోట్లకు ఎందుకు టెండర్లు పిలిచారని ప్రశ్నించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ అమరావతిని ఆపేశారు. పెట్టుబడులు తరలిపోతున్నాయి.. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ బూమ్ పెరిగిందన్నారు.. చిన్నవాడైనా ముఖ్యమంత్రికి రెండు చేతులెత్తి దండం పెడుతున్నాను.. మూడు రాజధానులపై పునరాలోచన చేయండి.. తొందరపడొద్దు.. మూడు రాజధానులు ప్రపంచంలో ఎక్కడా విజయవంతం కాలేదు. రాజకీయంగా వెళితే మీకూ, రాష్ట్రానికి నష్టం. భూములిచ్చిన రైతులు గురించి ఆలోచించాలని చంద్రబాబు అన్నారు.