Idream media
Idream media
జగన్మోహన్ రెడ్డి ఓ లీడర్. చంద్రబాబునాయుడు కూడా టీడీపీకి ఆయనే లీడర్. నిజం చెప్పాలంటే జగన్ కంటే పెద్ద నాయకుడు. దశాబ్దాల చరిత్ర గల పార్టీ ఆయనది. అంతకు మించిన రాజకీయ అనుభవం ఆయనది. కానీ, టీడీపీ నాయకులు, ఎంపీలే కాదు.. అధినాయకుడు కూడా జగన్ నాయకత్వం వహించాలని పదే పదే కోరుతున్నాడు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఉద్యమానికి జగన్ నాయకత్వం వహించాలని స్వయానా చంద్రబాబే అంటుండడం ఆయన నాయకత్వాన్ని ఆయనే సంకించుకుంటున్నట్లే. లేదా కేంద్రానికి భయపడుతున్నట్లే. ఆ ప్రతిపాదన వెనుక వారి ఉద్దేశం ఏమైనా కానీ, చంద్రబాబుపైన, టీడీపీపైన వ్యతిరేకభావమే ప్రజల్లో ఏర్పడుతోంది. జగన్ లేకుండా చంద్రబాబు ఉద్యమించే పరిస్థితి లేదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
రాష్ట్రానికి సంబంధించిన సమస్యలపై చంద్రబాబు ముందుకు వచ్చి పోరాడింది ఇప్పటి వరకూ లేదు. సమావేశాలు, మీడియా ప్రకటనలే తప్పా ఆందోళనలు చేపట్టింది లేదు. పార్టీ, తమ నాయకుల కోసమే ఆందోళనలు చేశారు తప్పా ప్రజల కోసం ఉద్యమించింది తక్కువే. వాస్తవానికి ఉద్యమాలకు దూరమనే పేరు చంద్రబాబుకు ఉంది. దానికి తోడు ఆయన బీజేపీకి వ్యతిరేకంగా ఎప్పుడూ మాట్లాడడం లేదన్న అపవాదూ ఉంది. ఈ క్రమంలోనే తాజాగా చంద్రబాబు, టీడీపీ వింత ప్రతిపాదనలు చేస్తున్నాయన్న ప్రచారం జరుగుతోంది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా.. సాగే ఉద్యమానికి తాము సిద్ధమని.. అవసరమైతే.. తమ ఎంపీలు రాజీనామాలు చేసేందుకు రెడీగా ఉన్నారని.. చంద్రబాబు చెప్పారు.ఈ మేరకు విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమ కమిటీకి చంద్రబాబు లేఖ రాశారు. అయితే.. ఆ వెంటనే ఆయన ఈ ఉద్యమానికి సీఎం జగన్ నాయకత్వం వహించాలని పేర్కొన్నారు. ఆయన ముందుండి నడిపించాలని.. చంద్రబాబు విన్నవించడాన్ని తమ చేతకానితనాన్ని బయట పెట్టుకోవడమే అన్న విమర్శలూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు.. రాష్ట్ర సమస్యలపై పార్టీ పరంగా ముందుండి ఉద్యమాన్ని నడిపించాల్సింది పోయి.. జగన్ను ముందు పెట్టి.. ఉద్యమం నడిపించాలని కోరుకోవడం అంటే.. కేంద్రానికి ఆయన భయపడుతూ అయినా ఉండాలి. లేదా ఉద్యమాలకు తాను వ్యతిరేకమనే భావన అయినా ఉండాలి అంటున్నారు పరిశీలకులు. స్టీల్ ప్లాంట్ కార్మికులకు చంద్రబాబు తన లేఖ ద్వారా చిక్కుకుపోయారని అంటున్నారు. అదే సమయంలో జగన్ ముందుండి పోరాటం చేస్తే అప్పుడు క్రెడిట్ జగన్కు వెళుతుందే కాని.. చంద్రబాబుకు ఎందుకు వస్తుందన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి. చంద్రబాబు వైఖరి పార్టీ నేతలకే నచ్చడం లేదు.
సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న చంద్రబాబు ఇప్పుడు విశాఖ ఉక్కు ఉద్యమం విషయం లో మాత్రం ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారనే అన్న ప్రశ్న తలెత్తినప్పుడు రాజకీయంగా కనీస అవగాహన ఉన్నవారు కూడా సమాధానాలు చెప్పేస్తున్నారు. ఆయన కేంద్రానికి వ్యతిరేకంగా పోరాడరు కదా అని. అదే క్రమంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపడం జగన్ కు గుర్తింపు తెచ్చింది. ఇప్పుడు టీడీపీ, చంద్రబాబు కూడా జగన్ నాయకత్వాన్ని కోరుకోవడం ఆయనకు మరింత గుర్తింపునే తెచ్చి పెడుతోందంటున్నారు పరిశీలకులు. దీంతో ఇప్పుడు చంద్రబాబు తీవ్ర సంకటంలో పడిపోయారని అంటున్నారు.