iDreamPost
android-app
ios-app

Chandrababu – ఇలా చేస్తే బ్రాండ్ ఇమేజ్ దెబ్బ‌తిన‌దా బాబూ..?

Chandrababu – ఇలా చేస్తే బ్రాండ్ ఇమేజ్ దెబ్బ‌తిన‌దా బాబూ..?

ఆక‌ట్టుకోవాలి.. మ‌ళ్లీ ఎద‌గాలి.. ఓట్లు రాబ‌ట్టుకోవాలి.. ఏపీ ప్ర‌తిప‌క్షం తెలుగుదేశం పార్టీ ప్ర‌ధాన ల‌క్ష్యం ఇదే. ఏ రాజ‌కీయ పార్టీకైనా ఆ ల‌క్ష్యం ఉండ‌డం సాధార‌ణ‌మే. అందులో త‌ప్పేం లేదు. అయితే ల‌క్ష్య సాధ‌న‌కు ఎంచుకుంటున్న మార్గాల‌లోనే తేడా క‌నిపిస్తోంది. రాజ‌కీయాల్లో సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం ఉండి, రాజ‌నీతిజ్ఞుడిగా భావించే చంద్ర‌బాబు ఇటీవ‌ల అనుస‌రిస్తున్న విధానాలు ఆశ్చ‌ర్య‌క‌రంగాను, బాధాక‌రంగా కూడా ఉంటున్నాయి. చివ‌ర‌కు భార్య భువ‌నేశ్వ‌రిని కూడా రాజ‌కీయాల్లోకి లాగారు. ప‌దే ప‌దే ఆమె ప్ర‌స్తావ‌న తేవ‌డం రాజ‌కీయంగా ఎంత ల‌బ్ధి చేకూరుతుందో తెలీదు కానీ, వ్య‌క్తిగ‌తంగా చంద్రబాబు అది స‌రికాద‌నే అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి.

ఫ్యామిలీ మ్యాట‌ర్ అలా ఉంచితే, ఇప్పుడు రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ పై చంద్ర‌బాబు వ్యాఖ్య‌ల‌పై ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డుస్తోంది. అస‌లు విష‌యం ఏంటంటే.. జగన్ సర్కార్ చేస్తున్న అప్పులతో ఏపీ బ్రాండ్ దెబ్బతింటోందని ఆయ‌న ఆవేదన వ్య‌క్తం చేస్తున్నారు. ఆయ‌న ఆవేదన వ‌ల్ల‌ అప్పులకు, బ్రాండ్ కు అస‌లు సంబంధం ఉందా? అప్పులు కేవ‌లం ఏపీనే చేస్తోందా? చంద్ర‌బాబు హ‌యాంలో అస‌లు అప్పులే చేయ‌లేదా? ఏదైనా రాష్ట్రానికి బ్రాండ్ ఇమేజ్ ఎలా వ‌స్తుంది, ఎలా పోతుంది? ఇలాంటి ప్ర‌శ్న‌లెన్నో ఇప్పుడు త‌లెత్తుతున్నాయి. ఎందుకంటే.. అప్పుల కంటే.. టీడీపీ నాయ‌కులు చేసిన‌, చేస్తున్న రాద్దాంతాలే ఎక్కువ‌గా రాష్ట్ర ఇమేజ్ ను దెబ్బ‌తీస్తున్నాయ‌నే అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి.

ఏకంగా ఓ ముఖ్య‌మంత్రిని, ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌ను ఉద్దేశించి ఆ పార్టీ నాయ‌కులు చేసిన వ్యాఖ్య‌ల దుమారం దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశం అయింది. అంతేకాకుండా రాజ‌ధాని పేరిట చేస్తున్న ర‌గ‌డ‌, ఆందోళ‌న‌లు కూడా రాష్ట్ర ఖ్యాతిని త‌గ్గించేవే. రాష్ట్ర ఆదాయ వ‌న‌రులు, సామ‌ర్థ్యాన్ని బ‌ట్టి అంచ‌నా వేసి అందుక‌నుగుణంగానే అప్పులు ఉంటాయి. ఆ మాట‌కు వ‌స్తే దేశ‌మే అప్పుల్లో ఉంది. గ్లోబ‌ల్ నేత‌ను అని చెప్పుకునే చంద్ర‌బాబుకు ఈ విష‌యం తెలియ‌నిది కాదు. అయిన‌ప్ప‌టికీ అప్పుల వ‌ల్లే రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ పోతోంద‌ని ప్ర‌క‌టించ‌డం, ఆవేద‌న చెంద‌డం ఎంత వ‌ర‌కు క‌రెక్టో ఆయ‌న‌కే తెలియాలి. వీలైతే త‌న‌కున్న అనుభ‌వంతో ఆదాయ మార్గాల‌ను ప్ర‌భుత్వానికి సూచించ‌వ‌చ్చు. త‌గిన స‌ల‌హాలు ఇవ్వొచ్చు. అలా చేస్తే హుందాగా ఉండేది.

Also Read : Tdp,Chandrababu – ఒక్క దెబ్బతో టీడీపీకి, నందమూరి వంశానికి జూనియర్ ని దూరం చేసిన బాబు