iDreamPost
android-app
ios-app

బాబు భ‌లే జోకులేస్తున్నారు..!

బాబు భ‌లే జోకులేస్తున్నారు..!

అవును.. నిజ‌మే ప్ర‌స్తుతం తెలుగుదేశం పార్టీ ఉన్న ప‌రిస్థితుల్లో అవి జోకులే. రాజ‌కీయ పార్టీ అధినేత‌ల నోట అటువంటి మాట‌లు సీరియ‌స్ గానే చాలా సంద‌ర్భాల్లో వ‌స్తాయి. వారు చెప్పిన‌ట్లుగా అది జ‌రుగుతుంది కూడా. ఎన్నిక‌ల‌కు ముందు, ఎన్నిక‌ల త‌ర్వాత ప‌శ్చిమ బెంగాల్ లో కూడా ఆ త‌ర‌హా రాజ‌కీయాలే సాగుతున్నాయి. కానీ చంద్ర‌బాబు ఇప్పుడు అలాంటి మాట‌లు చెప్ప‌డంతో అది జోక్ గా మారిపోయింది. ఇంత‌కీ జోకేంటో చెప్ప‌కుండా, ఇదంతా ఏంటి అనుకుంటున్నారా?

అస‌లు విష‌యానికి వ‌స్తే.. టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడు తాజాగా పార్టీ శ్రేణుల‌తో మాట్లాడుతూ.. రానున్న మూడేళ్ల‌లో వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా వ‌ల‌స‌లు ఉంటాయ‌ని చెప్పార‌ట‌. అంతేకాదు.. 2024 ఎన్నికల నాటికి ఆ పార్టీలో వైసీపీ అధినేత జగన్ మినహా పెద్ద నేతలెవరూ మిగలరని కూడా అనేశార‌ట‌. పార్టీ శ్రేణుల్లో భ‌రోసా నింపేందుకు ఈ వ్యాఖ్య‌లు చేశారో, ఏమో కానీ.. ఆ మాట‌లు విన్న‌వారు మాత్రం లోలోప‌లే న‌వ్వుకున్నార‌ని పార్టీ వ‌ర్గాల్లోనే చ‌ర్చ జ‌రుగుతోంది. మూడేళ్ల‌లో మ‌ళ్లీ అధికారం త‌మ‌దేనంటూ బాబు ప‌దే ప‌దే చెబుతున్నారు. ఏమో గుర్రం ఎగ‌రావ‌చ్చు అనుకున్నా కానీ, జ‌గ‌న్ మిన‌హా వైసీపీలో పెద్ద నాయ‌కులు ఎవ‌రూ ఉండ‌ర‌ని చెప్ప‌డం మాత్రం సంచ‌ల‌నంగా మారింది.

2019 ఎన్నికల్లో వైసీపీ టికెట్ దక్కనివారు, ఓడిపోయిన నేతలు ఇప్పుడు అసంతృప్తితో ఉన్నారట. వీరిలో చాలామందికి జగన్ పునరావాసం చూపించకపోయే సరికి ప్రత్యామ్నాయం కోసం వెదుకుతున్న వారంతా గుంపగుత్తగా టీడీపీలో చేరతారట. ఇది బాబుగారి చెప్పే లాజిక్. అయితే, అలా జ‌రిగే అవ‌కాశాలు లేక‌పో్లేదు అనుకున్నా కానీ.. అలా వ‌చ్చే వారంద‌రితోనూ 2024 ఎన్నిక‌ల్లో గెలిచి అధికారంలోకి వ‌స్తామ‌ని చంద్ర‌బాబు పార్టీ శ్రేణుల స‌మావేశాల్లో చెబుతున్నారు. అంతేకాకుండా, వైసీపీ తరపున గెలిచిన నేతల్లో కూడా చాలా మంది అసంతృప్తులు ఉన్నార‌ట‌. వారు కూడా టీడీపీలోకి వ‌చ్చేస్తార‌ని బాబు భ్ర‌మ‌లు క‌ల్పిస్తున్నారు.

పదవి లేకపోయినా అధికారంలో ఉన్న పార్టీలో ఉండటానికే ఎవరైనా ఇష్టపడతారు. అలాంటిది మునిగిపోయే నావని ఎక్కేందుకు ఎవరైనా ఎందుకు సాహసిస్తారు. ఇక్కడ కూడా చంద్రబాబు లాజిక్ మిస్ అయ్యారు, కానీ టీడీపీ నేతల్ని భ్రమల్లోకి నెట్టేందుకు ఇలా మాయమాటలు చెబుతున్నారు. మొన్నటివరకు టీడీపీ నుంచి వైసీపీకి.. భారీగా వలసలు జరిగాయి. లక్షలాది మంది కార్యకర్తలు వైసీపీలో చేరారు. ఏకంగా నలుగురు ఎమ్మెల్యేలు కూడా ఇటు వచ్చారు. తమ పార్టీలో చేరాలంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలనే నియమం జగన్ పెట్టుకోకుండా ఉంటే.. బాబు, బాలయ్య మినహా ఇంకెవరూ ఆ పార్టీలో ఉండరనే అంచనాలు కూడా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఉన్న టీడీపీలోకి ఇప్పుడు వలసలు పెరుగుతాయంటే అది జోక్ కాక‌పోతే మ‌రేంటి అనే వారు చాలా మందే ఉన్నారు.