చంద్రబాబు అప్పుడు అనుకోకుండానే చేశారా..?

టిడిపి ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు అనుకోకుండానే, వైఎస్సార్ సిపి నేతలను ప్రలోభాలకు గురి చేయకుండానే 23 మంది ఎమ్మెల్యేలు టిడిపి లోకి వచ్చారా..? అప్పట్లో చంద్రబాబు, అయన పార్టీ నేతలు చెప్పినట్లు అభివృద్హి కోసమే వారు వైఎస్సార్ సిపి నుంచి టిడిపి లోకి చేరారా..? అంటే.. అవుననే అర్ధం వచ్చేలా ప్రస్తుత ప్రతిపక్ష నేత, టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ఆంద్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వద్దు అని తాను ఆ నాడు అనుకుంటే వైఎస్సార్ సిపి లో ఒక్కరూ ఉండేవారు కారని పేర్కొన్నారు. ఈ విషయం ప్రస్తుతం వైఎస్సార్ సిపి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. అనంతపురం పర్యటనలో ఉన్న చంద్రబాబు ఈ మేరకు పై వ్యాఖ్యలు చేశారు.

హోరా హోరీగా జరిగిన 2014 ఎన్నికల్లో టీడీపీ, బిజెపి కలసి పోటీ చేసాయి. జనసేన మద్దతు తెలిపింది. వైఎస్సార్ సిపి ఒంటరిగా పోటీ చేసింది. టిడిపి 102, బిజెపి 04, వైఎస్సార్ సిపి 67, మరో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులుగా గెలిచారు. బిజెపి మద్దతు లేకున్నా, టిడిపికి స్పష్టమైన ఆధిక్యత ఉంది. ఐతే అప్పటి అధికార పార్టీ టిడిపి నేతలు, సీఎం చంద్రబాబు వైఎస్సార్ సిపి ఎమ్మెల్యేలను తమ పార్టీ లోకి లాక్కునేందుకు డబ్బు, మంత్రి పదవుల ఆశ చూపి, ప్రలోభాలు, బెదిరింపులు, కేసులు పెట్టారు. అనుకూల మీడియా లో ఫలానా ఎమ్మెల్యే టిడిపి లో చేరుతున్నారంటూ ప్రచారం చేపించేవారు. ఆ ఎమ్మెల్యే ను అనుకూల మీడియా విలేకరులు తిరిగి పార్టీ ఎప్పుడు మారుతున్నారంటూ ప్రశ్నించేవారు. ఇలా మైండ్ గేమ్ ఆడి అప్పటి ప్రతిపక్ష ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకునేందుకు శత విధాలా ప్రయత్నించారు.

వైఎస్ జగన్ సొంత జిల్లా ఎమ్మెల్యే, ఆయనకు అత్యంత సన్నిహితుడు గడికోట శ్రీకాంత్, జగన్ బంధువు, వైవి సుబ్బారెడ్డి బావ బాలినేని శ్రీనివాస రెడ్డి లు కూడా పార్టీ మారుతున్నారంటూ ప్రచారం సాగించిన విషయం బహుసా చంద్రబాబు నాయుడు మర్చిపోయి, ఇప్పుడు ఇలా మాట్లాడి ఉండొచ్చు. కర్నూలు జిల్లా నేత, నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి పై అట్రాసిటీ కేసు పెట్టడంతో పాటు రౌడీ షీట్ తెలిచారు. ఇంత జరిగిన తర్వాత కొద్దీ రోజులకే భూమా కుటుంభం టిడిపిలో చేరింది. స్వయానా సీఎం హోదాలో చంద్రబాబు నాయుడే వారికి టిడిపి కండువాలు కప్పి ఆహ్వానించారు.

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే లపై అనర్హత వేటు వేయకుండా ఏకంగా 23 మందిలో నలుగురికి మంత్రి పదవులు ఇచ్చిన విషయం చంద్రబాబు నాయుడుకు వేదిక పై మాట్లాడే సమయంలో ఆ పార్టీ నేతలు గుర్తు చేయనట్టున్నారు. మంత్రి పదవులు ఆశ పెట్టిన వారిలో తూర్పు గోదావరి జిల్లా కు చెందిన సీనియర్ నేత జ్యోతుల నెహ్రు వంటి వారికి మొండి చేయి చూపిన విషయం బాబు మరచిపోయారు. ప్రలోభాలు, బెదిరింపులకు పాల్పడిన చంద్రబాబు పార్టీ 67 మంది వైఎస్సార్ సిపిలో 23 మందిని చేర్చుకున్న విషయం ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరచిపోలేదు. ఆ విషయం చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని వైఎస్సార్ సిపి నేతలు హితవు పలుకుతున్నారు.

Show comments