Idream media
Idream media
కుల, మత రాజకీయాలు మన దేశంలో సర్వసాధారణం. ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకున్నా ఇది కఠోర సత్యం. అయితే భారతీయ శిక్షా స్మృతి మాత్రం వీటన్నిటికీ అతీతం. ఇక్కడ నేర తీవ్రతను బట్టి శిక్ష ఉంటుంది.. అంతేగానీ కులం, మతం ఆధారంగా నిందితుడికి శిక్ష తగ్గడం, పెరగడం, లేక వదిలేయడం ఉండదు. అది మన ప్రజాస్వామ్యంలోని గొప్ప విషయం. అయితే వాస్తవాలతో పనిలేకుండా నేరానికి, రాజకీయానికి, కులానికి, ప్రాంతానికి లింకు పెట్టి తన పబ్బం గడుపుకోవడంలో చంద్రబాబు సిద్ధహస్తుడు. గతంలో ఎన్నో సందర్భాలు దాన్ని నిరూపించాయి.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈఎస్ఐ కుంభకోణంలో మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, పితాని సత్యనారాయణ పేర్లు ప్రస్తావనకు వచ్చాయి. మందులు, వైద్య పరికరాల కొనుగోళ్ల ముసుగులో కార్మిక రాజ్య బీమా సంస్థ (ఈఎస్ఐ) ఆస్పత్రుల్లో భారీగా దోపిడీ జరిగినట్లు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ తేల్చింది. ఇందుకు సంబంధించిన ఆధారాలను కూడా బయటపెట్టింది. మొత్తంగా రూ. 151 కోట్లకుపైగా అక్రమాలు జరిగినట్లు గుర్తించింది. అయితే చంద్రబాబు మాత్రం బీసీలు కాబట్టి వారిని టార్గెట్ చేశారని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఆయన చెబుతున్న ప్రకారం బీసీలైతే నేరాలు చేసినా వదిలిపెట్టాలా? శిక్ష ఉండకూడదా? ఇప్పుడు అందరిలోనూ ఇవే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
మొన్నటికి మొన్న మాజీ ఇంటలిజెన్స్ ఐజీ ఏబీ వెంకటేశ్వరరావు దేశ రహస్యాలు బహిర్గతం చేసినట్లు నిరూపణ కావడంతో ఆయన్ను నిబంధనల ప్రకారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని సస్పెండ్ చేశారు. ఈ విషయంలోనూ చంద్రబాబు అండ్ కో ఆయనది కమ్మ కులం కాబట్టి ఇలా చేశారని గగ్గోలు పెట్టారు. అంటే కమ్మ అయితే నేరం చేసినా శిక్ష ఉండకూడదా?
నిన్న ఆదాయపు పన్ను శాఖ తమకు లభించిన ఆధారాల మేరకు చంద్రబాబు మాజీ పీఏ ఇంట్లో సోదాలు చేసి రూ. 2,000 కోట్లకుపైగా అక్రమాలకు సంబంధించిన ఆధారాలను బయటపెడితే.. అందులోనూ చంద్రబాబు రాజకీయం చూశారు. ఒక ప్రభుత్వ ఉద్యోగి దగ్గర అక్రమంగా సంపాదించిన ఆస్తులు ఉంటే ప్రశ్నించకూడదా?
ఇన్ని రకాలుగా కులాల గురించి మాట్లాడుతున్న చంద్రబాబుకు.. ఇతర కులాలంటే చెప్పలేనంత చిన్నచూపు. దళితుల ఇంట్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అంటారు.. నాయీ బ్రాహ్మణుల తోకలూ కత్తిరిస్తానంటారు..మత్స్యకారుల తోలు తీస్తానంటారు.
అంతకముందు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా వికేంద్రీకరణ ప్రస్తావన తెస్తే.. దానికి కూడా చంద్రబాబు కులాన్ని ఆపాదించారు. అమరావతిలో కమ్మ వారిని టార్గెట్ చేశారని విమర్శలు చేశారు. అంటే ఆయన కేవలం కమ్మ వారికోసమే అమరావతిలో రాజధాని పెట్టారా? అని మనం అడిగితే ఆయన దగ్గర సమాధానం ఉండదు.
ఇలా కేవలం కులాన్ని బట్టే కాకుండా ప్రాంతం ఆధారంగా కూడా చంద్రబాబు రాజకీయాలు చేస్తారు అనడానికి పెద్ద ఉదాహరణ.. గతంలో కాపు ఉద్యమం సందర్భంగా చోటు చేసుకున్న ఘర్షణలు. ఆ రోజున రైలు తగలబడిన వెంటనే చంద్రబాబు వచ్చేసి.. ఇది రాయలసీమ నుంచి వచ్చిన గూండాల పనే అంటూ చెప్పడం ఆయన అవకాశ వాద రాజకీయాలకు నిదర్శనం. విచారణలో ఆ ఘర్షణలకు రాయలసీమ వారికి ఎలాంటి సంబంధం లేదని తేలింది. కానీ చంద్రబాబు మాటలతో రాయలసీమకు చేసిన గాయాలు మాత్రం ఎప్పటికీ మరువలేనివి.
ఇలా ఒకటా రెండా.. ఇలా చెప్పుకుంటే పోతే చంద్రబాబు అవకాశవాద రాజకీయాలు అనంతం. దేశంలోనే సీనియర్ రాజకీయ నాయకుడిని, 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబుకు.. తాను చేస్తున్న రాజకీయాలు హీనమైనవని ఎప్పుడు తెలుసుకుంటారో?