iDreamPost
iDreamPost
వర్తమాన ఏపీ రాజకీయాల్లో చంద్రబాబుది ప్రత్యేక శైలి. ఆ మాటకొస్తే ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ అనేక విషయాల్లో ఆయన రాజకీయ నేతలకు ఆదర్శుడినని చెప్పుకుంటారు. అందుకు తగ్గట్టుగానే 1978 లో తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన తరంలో ప్రస్తుతం ఆయనొక్కరే క్రియాశీలంగా ఉన్నారు. ఏడుపదుల వయసు దాటినా మామగారిని నుంచి సొంత చేసుకున్న టీడీపీని ముందుకు నడిపించే బాధ్యతను ఆయన భుజాన మోస్తున్నారు. గతమెంతో ఘనకీర్తి కలవాడా అన్నట్టుగా కనిపిస్తున్న ఆయన కీర్తికి భవిష్యత్ లో ఎదురయ్యే సవాళ్లే పెద్ద సమస్యగా మారబోతున్నట్టు కనిపిస్తోంది. నాలుగు దశాబ్దాల తర్వాత తొలిసారిగా ఒంటరిగా జన్మదినం జరుపుకుంటున్న చంద్రబాబు రాజకీయంగానూ ప్రస్తుతం ఒంటరిగానే ఉన్నారు. చివరకు ఆయన సారధ్యంలో ఉన్న పార్టీ పరిస్థితి కూడా అలానే కనిపిస్తోంది.
సవాళ్లు ఎదుర్కోవడంలోనూ, సంక్షోభాల నుంచి గట్టెక్కడంలోనూ చంద్రబాబు సిద్ధహస్తుడు. అందుకు ఆయన నేర్పరితనం కొంతయితే, చేదోడుగా ఉన్న సొంత వర్గం పాత్రే ప్రధానమైనది. మీడియాలో ఉన్న బలమైన పునాదులను వాడుకుంటూ అనేక అడ్డంకులను చంద్రబాబు అధిగమించగలిగారు. తొలుత కాంగ్రెస్ తరుపున గెలిచి, మంత్రిగా అవకాశం దక్కినా, తదుపరి ఎన్నికల్లో ఆయన విజయం సాధించలేకపోయారు. దాంతో వ్యక్తిగతంగా ఆయన తొలి సవాల్ ఎదుర్కొన్నప్పటికీ ఎన్టీఆర్ దయతో టీడీపీలో చేరి అక్కడ నాయకుడిగా ఎదిగాడు.ఆర్గనైజర్ గా పేరు తెచ్చుకున్న చంద్రబాబు నాదెండ్ల ఎపిసోడ్ లో ఎన్టీఆర్ కు అనుకూలంగా క్యాంపు రాజకీయాలు నడిపారు. అదే క్యాంపు రాజకీయాలతో వైశ్రాయ్ ఎపిసోడ్ లో అదే ఎన్టీఆర్ ని తొలగించి, తాను గద్దెనెక్కేందుకు చంద్రబాబు వేసిన ఎత్తులు అన్నీ ఫలించాయి. ఆనాటి రాజకీయ పరిస్థితుల్లో కలిసి వచ్చిన అవకాశాలను ఒడిసిపట్టుకుని టీడీపీని సంపూర్ణంగా సొంతం చేసుకున్నారు.
ఆ తర్వాత తొలినాటి సన్నిహితుడు వైఎస్ రూపంలో కాంగ్రెస్ నుంచి గట్టి సవాల్ ఎదురయ్యింది. వరుసగా రెండు సార్లు ఓడిపోవడం, టీడీపీ నుంచి బలమైన నేతలు దూరం కావడం, ప్రజారాజ్యం కారణంగా మరో పెద్ద తలనొప్పి ఎదురుకావంతో చంద్రబాబుకి చుక్కలు కనిపించాయి. అయినా అనుకోకుండా రాష్ట్ర విభజన రూపంలో కలిసి వచ్చిన అవకాశాన్ని అనుభవం పేరుతో అందుకున్నారు. అదే సమయంలో తాను తొలినాళ్లలో వ్యతిరేకించిన వారసత్వ రాజకీయాలను పుణికిపుచ్చుకుని తనయుడికి పెత్తనం అప్పగించారు. అటు పార్టీలోనూ, ఇటు ప్రభుత్వంలోనూ చంద్రబాబు తనయుడు చెప్పిందే వేదం అన్నట్టుగా మారింది. కానీ చివరకు బాబు ప్రచార మాయాజాలం, అనుభవసారం అన్నీ ఒట్టిపోయి, మొన్నటి ఎన్నికల్లో చతికిలపడాల్సి వచ్చింది. తొలిసారి పోటీకి దిగిన కొడుకు లోకేష్ కూడా ఓటమి చవిచూశాడు.మాటలు కోటలు దాటే లోకేష్ తొలి ఎన్నికల్లోనే బోల్లా పడడంతో ప్రత్యక్ష రాజకీయాలకు పనికిరారనే ముద్రపడిపోయింది.
ఓటుకి నోటు కేసులో బ్రీఫ్డ్ మీ ద్వారా నేను నిప్పు అనే మాటకు అర్థం లేకుండా పోయింది. ఎంత చెప్పుకున్నా జనం అంగీకరించే అవకాశం చేజారిపోయింది. ప్రతి ఏడు మా కుటుంబ ఆస్తులు అంటూ విదులచేసే ఆస్తుల చిట్టా అపహాస్యం పాలయ్యింది. అమరావతి వంటి పెద్ద పెయిల్యూర్ ప్రాజెక్ట్ గా మిగిలిపోవడంతో అడ్మినిస్ట్రేటర్ అనే ముద్రకి కూడా అర్థం లేకుండా పోయింది. చివరకు డిజైన్లు కూడా ఖరారు చేయించుకోలేకపోవడంతో విశ్వమంతా తిరిగి చెప్పిన మాటలకు విపరీత అర్థాలు వచ్చాయి. అన్నీ కలిసి రాజకీయంగా తొలిసారి సింగిల్ గా బరిలో దిగి అతి స్వల్ప స్థానాలకు పరిమితం కావాల్సి వచ్చింది.చరిత్రలోనే ఎన్నడూ లేని రీతిలో ఓటమికి గురికావాల్సి వచ్చింది. దాంతో గత ఏడాది ఇదే సమయానికి సీఎం హోదాలో(ఆపద్ధర్మంగానే అయినా) ఆడంబరంగా పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్న చంద్రబాబు ఇప్పుడు సింగిల్ పక్క రాష్ట్రంలోని సొంత ఇంటికే పరిమితం కావాల్సిన పరిస్థితి వచ్చింది.
రాజకీయాల్లో గెలుపు ఓటములు సాధారణమే అనుకున్నా తాని తయారు చేసిన నాయకులుగా చెప్పుకున్న,అధికారంలో ఉన్నత కాలం కుడి ఎడమ భుజాలుగా వ్యవహరించిన సుజనా చౌదరి,సీఎం రమేష్ లు టీడీపీని వీడి బీజేపీలో చేరటంతో యనమల తప్పా అంతరంగికులు అంటూ ఎవరు లేకుండా పోయారు.1978 నుంచి సహచరుడైన కరణం బలరాం కూడా బాబుని వీడి వైసీపీకి జై కొట్టటంతో మనసు విప్పి మాట్లాడుకోవటానికి పాత మిత్రులు ఎవరు మిగలలేదు..
ఒకవైపు ఎంత గొప్పగా ప్రచారం చేసే మీడియా ఉన్నప్పటికీ వాస్తవాలను గ్రహించలేని స్థితికి చేరడంతో చివరకు చంద్రబాబు ఇప్పుడు అసలైన పరీక్షను ఎదుర్కొంటున్నారు. పార్టీని నడిపిస్తూ, తనయుడిని ప్రొజెక్ట్ చేసే పని బెడిసికొట్టింది. చంద్రబాబు వయసు మీరడంతో పార్టీ వ్యవహారాలు కూడా పెద్ద భారంగా మారుతున్నాయి. పలువురు నేతలు ఆయనకు అడ్డంగా తలూపుతున్నారు. ఇన్నాళ్ళుగా వెంట నడిచిన వారు కూడా ఇప్పుడు ఒక్కొక్కరుగా మొఖం చాటేస్తున్నారు.
అదే సమయంలో అధికారంలో బలమైన ప్రత్యర్థి ఉండడం బాబుకి మింగుడుపడడం లేదు. వైఎస్సార్ ఒక అడుగు వేస్తే నేను రెండడుగులు వేస్తానని చెప్పినట్టుగా జగన్ తన రాజకీయ ప్రత్యర్థి విషయంలో వ్యవహరిస్తుండడంతో చంద్రబాబుకి ఊపిరిసలపడం లేదు. కలిసి వస్తాడనుకున్న కొడుకు పెద్ద గుదిబండగా కూడా మారాడనే అభిప్రాయం చాలామందిలో ఉంది. ఏతా వాతా ఇన్నాళ్లుగా ఎలా సాగినప్పటికీ రాబోయే రోజులు మాత్రం చంద్రబాబుకి జీవితంలోనే అత్యంత క్లిష్ట సమయంగానే భావించాల్సి ఉంటుంది. జీవిత చరమాంకంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని అలిసిపోయిన చంద్రబాబుకి ఇప్పుడు అత్యంత పెద్ద భారం తలకెత్తుకోవాల్సిన పరిస్థితి ఎదురుకావడమే అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇదంతా ఆయన స్వయంకృతాపరాధం అని చాలామంది భావిస్తున్న తరుణంలో రాబోయే రెండు మూడేళ్ల కాలం చంద్రబాబుకి నిజమైన పరీక్షాకాలంగా చెప్పక తప్పదు. ఇప్పటికే పదవిని కోల్పోయిన ఏడాది కాలంలోనే మానసికంగా అనేక ఎదురుదెబ్బలు తినాల్సి వస్తున్న తరుణంలో భవిష్యత్తుని ఆయన ఎంత నిబ్బరంగా ఎదుర్కొంటారన్నది ఆసక్తికరమే అని చెప్పవచ్చు.
చంద్రబాబు మళ్ళీ రాజకీయ విజయాలు చూస్తారా?కాలమే సంధానం చెప్పాలి..జన్మదిన శుభాకాంక్షలు చంద్రబాబు గారు