iDreamPost
android-app
ios-app

అయ్యో.. చంద్రబాబు ఇంకా అక్కడే ఉండిపోయారు!

  • Published Dec 01, 2020 | 1:27 AM Updated Updated Dec 01, 2020 | 1:27 AM
అయ్యో.. చంద్రబాబు ఇంకా అక్కడే ఉండిపోయారు!

ఏపీ అసెంబ్లీ సమావేశాల తొలి రోజు సస్ఫెన్షన్ తర్వాత చంద్రబాబు వైఖరి ఆసక్తిగా మారింది. తన రాజకీయ జీవితంలో ఎన్నడూ పోడియంలోకి వెళ్లలేదని ఆయన వ్యాఖ్యానించారు. చివరకు పరిటాల రవి హత్య అనంతరం కూడా తాను పోడియం వైపు వెళ్లలేదని ప్రకటించారు. అంటే అప్పట్లో పరిటాల హత్య కాబట్టి ఆయనకు ఆ స్థాయిలో ఆవేశం రాలేదు..కానీ ఇప్పుడు తన సొంతం అనుకున్న చోట తన మాట చెల్లుబాటు కాని సమయంలో ఉక్రోశం పొంగిపొర్లుతున్నట్టు ఆయన చెప్పకనే చెప్పినట్టుంది.

వాస్తవానికి అమరావతి అనే తన కలల రాజధాని తన సొంతమన్నట్టుగా చంద్రబాబు భావించారు. అప్పట్లో రాజధాని అంశం తన వ్యక్తిగతమన్నట్టుగా వ్యవహరించారు. అఖిలపక్షం గురించి పలువురు ప్రశ్నిస్తే చాలా హేళనగా మాట్లాడారు. ఆ తర్వాత రాజధాని నిర్మాణం కోసం శంకుస్థాపన సమయంలో కూడా విపక్షాలను కలుపుకుపోవాలన్న ఆలోచన చేయలేదు. అంతా చేసి తాత్కాలిక నిర్మాణాల ప్రారంభోత్సవం కూడా తమ ఇంటి వ్యవహారంగా మార్చేశారు. తాను, తన భార్య, కొడుకు, కోడలితో పాటుగా మనవడితో కలిసి కార్యక్రమాలు చేయడంతో ద్వారా అంతా తన ఇంటి వ్యవహారం అన్నట్టుగా చిత్రీకరించారు. చివరకు తానే శాశ్వత ముఖ్యమంత్రి అన్నట్టుగా భ్రమల్లో కూరుకుపోయారు. అంతా తాను అనుకున్నట్టే జరుగుతుందని ఆశించారు. అంతా జరిగి ఐదేళ్లు తిరగకముందే బాబుని జనం ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేశారు బొటాబొటీగా ప్రతిపక్ష హోదా దక్కించారు.

రెండేళ్ల క్రితం నాడే ఇలాంటి ఘోర పరాభవం నుంచి చంద్రబాబు నేటికీ కోలుకుంటున్నట్టు కనిపించడం లేదు. అసెంబ్లీలో ఆయన వ్యవహారం అందుకు తగ్గట్టుగానే ఉంటుంది. తన వెనుక ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలు లేరని తెలిసినా ఆయన ఇంకా జనాల్ని నమ్మించాలని చూస్తున్నారు. సభలో పెత్తనం ఆశిస్తున్నారు. తన నాయకత్వం మీద టీడీపీ శ్రేణుల్లోనే విశ్వాసం లేదని తెలిసినా సభా నాయకత్వం కోసం అర్రులు చాస్తున్నారు. ఆ క్రమంలో హద్దులు మీరుతున్నారు. ఏకంగా సభలో గతంలో ఏ ప్రతిపక్ష నేతా వ్యవహరించని స్థాయిలో ఆయన ప్రవర్తన ఉంది. పైగా తాను అందరికన్నా అనుభవజ్ఞుడినని చెప్పుకుంటూ అందరికన్నా దిగజారి ప్రవర్తించడానికి సిద్ధపడుతున్నారు. వాస్తవానికి సభ సందర్భంగా ఆయనకు మాట్లాడే అవకాశం వచ్చే వరకూ సంయమనంతో వ్యవహరించాలి. అలా కాకుండా తనకున్న బలం ఉపయోగించి ఒత్తిడి పెంచాలి. కానీ ఈసారి నేరుగా చంద్రబాబు దిగిపోయారు. నేలపై కూర్చోవడం ద్వారా తానేంటో చెప్పేశారు. దాంతో మిగిలిన టీడీపీ నేతలు కూడా అవాక్కవ్వాల్సి వచ్చింది.

సీఎంగా వైఎస్ జగన్ అధికారం చేపట్టి రెండేళ్లు పూర్తికాకముందే టీడీపీ నేతలు ఈ స్థాయిలో అసహనం ప్రదర్శిస్తుంటే ఇక రాబోయే రోజుల్లో ఏ స్థాయిలో ఉంటుందో ఊహంచడమే కష్టమని వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. అధికారం కోల్పోయిన తర్వాత అసలు సహించలేని ధోరణి చంద్రబాబులో ప్రస్ఫుటంగా కనిపిస్తోందని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దాని ప్రభావంతో అసెంబ్లీలో టీడీపీ మరింత అభాసుపాలయ్యే పరిస్థితి కొనితెచ్చుకుంటున్నట్టు పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అనువుగాని చోట అధికుల మనరాదనే సూక్తిని విస్మరించి చంద్రబాబు విన్యాసాలకు దిగడం వల్ల ఉపయోగం ఉండకపోగా చేటు తెస్తుందనే సంగతి తెలుసుకోవాలని సూచిస్తున్నారు. పైగా సీఎంని ఫేక్ సీఎం అని వ్యాఖ్యానించడం, ఏం పీకుతారని ప్రశ్నించడం, మరో రెండేళ్లలో ఎన్నికలు వచ్చేస్తున్నాయని ఊహించుకోవడం అంతా చంద్రబాబు పరిస్థితి కి అద్దంపట్టే ప్రకటనలుగా అంచనా వేస్తున్నారు. వాస్తవానికి, ఊహకి చాలా వైరుధ్యం ఉంటుందనే సంగతి ఆయనకు 2019లోనే అర్థం చేసుకుని ఉంటే 2021 ముంగిట ఇలాంటి పరిస్థితి దాపురించకపోయేది. కానీ ఆయన మాత్రం ఇంకా 2019 కి ముందు నాటి ఊహాల్లోనే ఉండిపోయి జనమంతా అలానే ఉండాలని ఆశించడం ప్రతిపక్ష నేత హోదాని హాస్యాస్పదంగా మార్చేస్తుంది.